Friday, June 13, 2014

మాటల మడుగు



ఒకప్పుడు

నోటి నిండా మాటలుండేవి
మాటలకు మొలకల వేళ్ళుండేవి
పచ్చగా మొలకెత్తేందుకు అవి
సారవంతమైన నేలలు వెతికేవి

ఒకప్పుడు

నోటినిండా మాటలుండేవి
మాటలన్నీ శిల్పాలుగా మారేందుకు
ఒకదాన్నొకటి పెనవేసుకుని, అంటిపెట్టుకుని
ఉలి మొన స్పర్శ కోసం సిద్ధమై
శిల్పాలవడానికి ఆత్రంగా ఉవ్విలూరేవి

ఒకప్పుడు

నోటినిండా మాటలుండేవి
మాటలన్నిటి కాళ్ళకి ఘల్లున మ్రోగే
మువ్వలుండేవి
మువ్వలన్నీ సంతోషంగా నృత్యం చేస్తూ
మాటలకు విలువ పెంచేవి

అవును

ఒకప్పుడు నోటి నిండా మాటలుండేవి
మాటలకు రుచుండేది
మసక కన్నుల్ని వెలిగించే నిప్పు రవ్వలుండేవి
చెమట చుక్కల్ని కౌగలించుకునే చేతులుండేవి
కడుపు నింపే ధాన్యపు గింజల్లా ఉండేవి

కాని ఇప్పుడేమయ్యిందో

నోటినిండా మాటలున్నాయి
మాటలన్నీ గాలికి తేలిపోయే తాలులా
వరిపోట్టులా ఉన్నాయి

మాటల్ని తోడుకునే నాలుక చివరనుండి

గొంతుకపై కొన్ని చేతుల ఉరి కాపలాకాస్తుంది
మాటలన్నీ గవ్వలై
మట్టి పెళ్లలై
కాళ్ళు చేతులు విరిగిన బొమ్మలై
నిస్తేజంగా ఉన్నాయి

ఇప్పుడూ నోటినిండా మాటలున్నాయి

మాటలన్నీ ఆ పహారాకి ఘనీభవించి
గడ్డకట్టి
మంచు శిలలై , మౌన తపస్సు చేస్తున్నాయి

ఎవరైనా సహాయానికి రండి నాతోపాటు

ఆ చేతుల్ని నరికి మంటజేసి
మాటల్ని కరిగించడానికి
మళ్ళీ ఆ మాటల్ని ప్రాణమూర్తుల్ని
చేయడానికి