Tuesday, October 30, 2012

నిన్నే చెప్పూ


నీ నవ్వు కావాలి
ఎన్ని కవితలకి అమ్ముతావ్ ??

నీ చూపుల చిలకలు నా మనసుని
చేరడానికి ఏ భావాల కొమ్మలు 
పూయించమంటావ్ ??

నీ మాటల నదికి ఆనకట్ట కట్టి
హృదయాన్ని సాగు చేసేందుకు
ఎన్ని పదాల వెల చెల్లించమంటావ్?

నీ వైపుగా వచ్చే అలోచనల మేఘాన్ని
ఎంత ప్రేమ నీటితో నింపి నన్ను
ఆవిరవమంటావ్??

నిన్నే..!!చెప్పూ !!

 by mercy margaret (29/10/2012)-

Thursday, October 25, 2012

నిన్ను నీవు కొలతలెసుకో

అడ్డంగా 
నిలువుగా 
చుట్టుకొలతల పరిధి నిర్ణయించుకొని
మరీ
ఎందుకంటే" రేపటి " ఫ్రేంలో 
" ఇవ్వాల్టి " నువ్వు 
" నిన్నని " వదిలి 
అమరిపోవాలిగా ... 

------- by Mercy Margaret 23oct2012 ----------

దేహపు నౌక



దేహపు నౌక 
ప్రేమలు ఆప్యాయతలు 
బంధాలు బంధుత్వాలు 
ఆలోచనలు ఆశయాలు భావాల
సరుకులు నింపుకొని

కాలపు నదిలో
విజయవంతమైన ముగింపుకోసం

జీవపు దిశనుంచి
గెలుపోటముల ఆటుపోటు ల నెదుర్కొని
"రేపటి " దిక్సూచి వెలుగులో
అస్తమిస్తూ ఉదయిస్తూన్న కలల అలల సాక్షిగా
మరణపు మజిలీ వైపుకు
ప్రాయాణం సాగిస్తుంది ...

-----
by -Mercy Margaret (25/10/2012)

బెంగ

రా
నా గుండె గుడిలో
సావాసం
చేద్దాం


నీ పేరుతో

కట్టిన తోరణాలు
ఎంత ప్రేమగా
ఆహ్వానిస్తున్నాయో
చూడు


గుమ్మంపైన

చెక్కిన
నీ పేరు
నిన్ను చూడగానే
మురిసిపోతుంది


ఏంటి

అంతలా నివ్వేరపోయావ్
నీ రూపామే అది
నా ప్రాణం పోసుకొని
చలిస్తుంది
ఇక
నువ్వోచ్చావ్ గా
తను లోపల
కకెల్తుందిలే


గది వేడిగా ఉందా ?

యుగాల ప్రేమా  ఆ మాత్రం
ఉండదా ?
ఓ కౌగిలి అందించు
నిరీక్షనకి కరిగి కన్నీటి
ధారగా
నా  కౌగిలి వస్త్రాన్ని తడిపి
చల్లదనం తో నిన్ను
కప్పుతుంది


ఓయ్

బెంగ పడకు
ఈ గుండె గదిని లోపలి
ఆస్థిని
తర తరాలకు నీకే రాసిచ్చా
ఋజూవు  కావాలా?
ఆ యెర్రని  సిరాతో
నుదుటిపై బొట్టులా పెట్టనా ?
గాయమైన పర్లేదు
నువ్వు నమ్మితే చాలు 


Saturday, October 20, 2012

నిద్ర లేపే వారు వస్తారా ?


ఆలోచన మంచంపై
లక్ష్యం ముడుచుకొని
పడుకుంది
కళ్లు మూతలు పడి
నిద్రలోకి జారుకొని
ఎన్ని రోజులయ్యిందో ?


ఆ మంచం ఏమని బుజ్జగిస్తుందో

ఏ ఏ కధల్ని కలల్ని
తన కళ్ళలోకి జోప్పిస్తూ
తనని తానూ మర్చి పోయేలా
చేస్తుందో

తను పుట్టింది మొదలు

కాళ్ళు నడవడం నేర్చుకున్నప్పుడు
వద్దన్నా వినకుండా పరుగెత్తి
పడుతూ లేస్తూ
విజయాన్నే ఏడ్పించేది 
ఒకప్పుడు
పరుగెత్తడం మొదలుపెడితే      
ఎన్నో సార్లు మాటే వినలేదు
విజయాన్ని ముద్దాడే వరకు 
మరి ఇప్పుడు

ఏమయ్యిందో

నిద్రావస్తాలోకి వెళ్లిందంటే
మెలకువకొచ్చే స్థితే  కనిపించట్లేదు

ఆ మధ్య

ఎవరో ప్రేమ దెబ్బ కొట్టారట
అప్పట్నుంచి ఇంతే
ఇక ఇప్పుడైనా మేల్కొనక పోతే 
లెక్కలోంచే  తీసేసాలా ఉంది'
లోకం  ..

చూడు

కన్నీళ్లు పెట్టుకుంటుంది విజయం
ఎలా చేస్తుందో చూడు
ఓటమి తనని అపహాస్యం
ఇకనైనా దాన్ని నిద్ర లేపే వారు
వస్తారా ?
వస్తారనే చిన్న ఆశని రెట్టింపు చేసుకుంటూ
అయోమయంలో ప్రశ్నార్ధకంగా
మిగిలిన "నేను "

ఒహ్ నువ్వా ..


ఏం  చేయను ?
నిశబ్ధాన్ని 
దోసిళ్ళతో  నింపుకొని
కొంచెం కొంచెంగా సేవిస్తున్నా


ఇదో

మాటలన్నీ  గొంతు కొలన్ను ఒంటరి చేసి
రెక్కల శబ్ధం రాకుండా
ఏ నిశీధికి తరలి వెళ్ళాయో??


ఎండి  ఎడారిగా మారిన

కంఠం నేలకు మొహం వేసి
యెవరో  వస్తారని
ఎదురు చూస్తూ


శబ్ధాన్ని మెళ్లిగా  తనలో

పూడ్చుకుంటూ
చచ్చు  విత్తనాలుగా మారిన ఆలోచనల్ని
గొంతునులుముతూ
ముళ్ళ కంపల్ని పుట్టిస్తూ


తలపుల్ని

మధ్యాహ్నప్పు వెలుగులో
ప్రమిదని చేసి
చీకటి వెలుతురులు  ఒకటే
అని చూపిస్తూ
అందరిలో నువ్వు ఒకడివయ్యవా  అని వెక్కిరిస్తూ
విధి నాతో
తెలియని ఆటలేవో
ఆడుకుంటుంది


ఏ ఆట అయితేనే

ఇన్ని మర బొమ్మల్లో నేను ఒక బొమ్మనై
సహజత్వాన్ని సమాధి చేసుకొని
అస్థిత్వం ,ఉనికి  కోసం
ఉత్సాహాన్ని కొనుక్కొని మరీ
పోటి పడాల్సి వస్తుంది
నాతో నేనే


---------- by Mercy Margaret (18/10/2012)--------------










పిచ్చి నిద్ర

రోజూ నిద్రని ఉరికంబం ఎక్కించి

కలలు కల్లలోంచి ఎగిరిపోతుంటే చూస్తూ

గబ్బిలాల్లంటి జ్ఞాపకాలు



మొండిగా ఆ కొసలలొ వ్రేలాడుతూ
చనిపోబోతున్న నిద్రని చూసి
జాలిపడ్డం మామూలయింది

ఎందుకు అంతగా ఆశ పడతాయో
ఆ కళ్లు
చీకటిని అణువణువు అలుకుకొని
రెప్పల తలుపుల ఘడియలు సరి చూసుకుని
తలపుల చీరతో సింగారించుకుని
నిద్రతో సరసాలాడాలని
రోజు ఎదురు చూస్తూనే ఉంటాయా
ఏంటో

ప్రేమ
ఎడబాటు బాణాలని సంధించి
కళ్లని స్వాధీన పరుచుకుని
నిద్రని
రోజూ తిన్నగా ఆ కళ్లను చేర నిస్తేగా??
మధ్యలోనే తెలియని ప్రశ్నల ముగ్గులో దింపి
స్థిమితత్వం కొల్పోయాకా
పిచ్చి అంటకట్టి
అది ఒప్పుకోలేక తిరగ బడిందని అన్యాయంగా
కలతల కోతల్లో జీవితాన్ని భాగిస్తూ మరీ
ఉరి కంబం ఎక్కిస్తుంది...



                                 by mercy margaret( 19/10/2012 )-

Sunday, October 14, 2012

అద్దం నవ్వింది



రాలిపోయిన నవ్వులన్నీ
అద్దంపై నీటి చుక్కలై
ప్రతిబింభాన్నైనా  అంటి ఉండాలని
ప్రయాసపడి ఎండిన   మరకలుగా మిగిలి
ఎదురుచూస్తుంటే
ఎటు నుంచి వచ్చిందో వర్షం
నన్నూ , తనని   తడిపి మరకలన్నిటిని కడిగి
నా  భుజం తట్టి చూసుకోమని చెప్పి
వెళితే
చూసుకుంటున్నా



అద్దం నవ్వింది ఇన్నాళ్లకి

ముఖాన మళ్ళీ ఉదయం పూసిందని


వర్షమై తనొచ్చి గతాన్ని కడిగి

వెళ్ళాడని
నాకు మరుగైన నన్ను మళ్ళీ
కొత్తగా నాకు చూపాడని
నవ్వుల లిపిని వెతికి తెచ్చి అద్దానికి
నన్ను అర్ధం చేసుకోమని చెప్పి వెళ్ళాడని
నా పెదాల  కొమ్మలకి సంతోషం అంటుకట్టి
నవ్వు పూలు పూయిస్తున్న
ప్రేమికుడని
నన్ను చూసి ఆనందిస్తూ
అద్దం నవ్వింది ఇన్నాళ్లకి 

--------by- Mercy Margaret --------------








Wednesday, October 10, 2012

ఆ కళ్ళ గుహలలో


ఆ కళ్ళ  గుహలలో
ఎన్ని చచ్చిపడిఉన్న  కలలో

అప్పుడప్పుడు

 అస్తమించలేని ఆ  జ్ఞాపకం గుండెని అలా తాకి 
దానిని  కప్పిన  పొరను చీల్చి 
శబ్ధంలోంచి మేఘామై పుట్టి 
వర్షించే ప్రయత్నం చేసి 
నిసత్తువగా వెనక్కి తిరుగుతూ నిట్టూరుస్తూ
ఇన్ని రోజులూ 

ఆ గుహల గోడలపై 

అప్పుడెప్పుడో 
రాసిన  ప్రేమ రాతలు 
చెక్కుకున్న పేర్ల గుర్తులు 
తగిలించి పాతగిలిన పరిచయాల చిత్రాలు
ఊసులు బాసల  బహుమతులు 
సాలెగూడైనట్టు గతం 
ఇక్కడే నా  సామ్రాజ్యం అన్నట్టు కళను కలలను కట్టేసి 
చుట్టేసి అల్లిపడేస్తున్న గూడు 

ఒక్కొక్కటి 

ఆ వర్షంలో తడవాలని ఆరాటపడి 
ఎండిన గొంతులతో ఇంకా ఎదురు చూస్తూ 

ఇన్నేళ్ళకు 

ప్రతి గడియని విడగొడుతూ ,అడ్డు గోడలని కూల్చేస్తూ 
తన నుదుట సిందూరమై ఉదయించే సాహసం చేసి 
కనుబొమ్మల సంగమంలో ముడిపడి 
ఇలా ప్రేమ చెలమ పుట్టుకొస్తే 
ఇక 
దాహార్తి తీర్చుకునే గుహతో పాటు  
చచ్చిపడున్న ప్రతి కల జీవం పోసుకొని 
దాని నరనరాలని కుదుపుతుంటే

మలినమంతా కడిగేస్తున్నప్రేమని చూసి 

గుండె అసూయతో ఆగి కొట్టుకోవడంలో  తప్పు లేదులే ?!
నువ్వు 
వ్యర్ధమైన కన్నీళ్లని వ్యాక్యానించడంలో కూడా 
హాస్యమేముందిలే   ?!

ఇప్పుడు

ఆ కళ్ళ  గుహల నిండా 
పుట్టుకొస్తున్న సంజీవని  మూలికలే ..

Thursday, October 4, 2012

ముక్కలైన దేహమే మనిషా



చెల్లా చెదురై పడి ఉన్న
మాంసపు ముద్దలు ?
ఇంకా తడి ఆరక  
అలా వాసన కొడుతూ
రక్తం స్రవిస్తూనే ఉన్నాయి

తల ఒకవైపు

తెగి పడిపొయిన కాళ్ళు చేతులు
పరుగెత్తి దూకబోయి పడినట్టుంది
శవం
గోడకి అటు ఇటు సగం సగంగా
పడి దేహం నేను అటు ఇటు అని
రోదిస్తునట్టుంది

ఆ తెగి పడి ఉన్న

చేతిపైన
ఎప్పుడో పొడిపించుకున్న పచ్చ బొట్టు
-"అను"అని
ప్రేయసో ,రక్త సంబంధో
ఆ పేరును రక్తాభిషేకం చేస్తూ
ఇంకా తన ప్రేమని తెలియజేస్తూ
ముద్దాడుతున్నట్టుగుంది

ఏ రక్షకోసం ఎవరు కట్టారో

ఆ చేతి మనికట్టుకు ఎర్రదారం
రక్తంలో తడిచి ఇంకా నెత్తుటి కళ నింపుకొని
దాని వెనక దాగిన దేవుని
దీవెనలెక్కడని ఊడిపోతు ఆ దైవాన్ని
ప్రశ్నిస్తున్నట్టుంది

డాబు దర్పం ఉన్న ఇంటి వాడిలా

ఉన్నాడు
రెండు వ్రేళ్లకి బంగారు ఉంగరాలు
అటు ప్రక్క జారి పడి ఉన్న
కడియం నీ దర్పం ఎమయింది అని
విలపిస్తూ ప్రశ్నిస్తున్నట్టుగుంది


అటు పక్క

పడిపోయిన పర్సు నిండా డబ్బే
రక్తసిక్తమై
కనీ కనిపించకుండా ఎవరిదో అమ్మాయి
ఫొటో
ఇంకా తన కోసం ఎదురు చూస్తున్న ప్రేయసి
కాబోలు

జీపు నుంచి కుక్కలు దిగాయి

శవం అణువణువు వాసన చూస్తూ
చుట్టు ప్రక్కల ఉరుకులు పెడుతున్నాయి
ముక్కలయిన సెల్ ఫొను నుంచి
ఇంక తన అంకెలెవరికి పట్టవని ఏడుస్తూ
మూర్చిల్లిన సింకార్డు రాలేక ఇరుక్కున్నా
బయటికి లాగి చూస్తున్న పోలీసులు!

బ్రతికున్నప్పుడు నువ్వెవరు ?

ఇప్పుడు నీవెవరు ?
అని ప్రశ్నిస్తున్నట్టు
పైన తిరుగుతూ అరుస్తున్న కాకుల గోల

ఒక పక్కగా నిల్చుని నేను

ముక్కలైన దేహమే మనిషా??
మనిషిలో ఏదో ఇన్ని రోజులుండి
నడిపించిన ఆ ఇంకెవరో మనిషా అని??

వలయాలుగా చుట్టుకుంటున్న శూన్యాన్ని

చెవుల దారుల గుండా దండయాత్ర చేస్తుంటే
కళ్లనుంచి నీళ్ళుగా నరికి  బయటికి నెడుతూ
బ్రతికున్న నా ఉనికెంత సేపని
ప్రశించుకుంటున్న మనిషిలా
నేను !!??