Wednesday, August 29, 2012

నీ బానిసగా ఉండిపోనా


నేను  రాసుకునే ముత్యాలను 
నువ్వు దాచుకొని 
నా శ్రమలో కుడా ఆనందాన్నిస్తావ్ 

నా ఆలోచనల దొంగవు నీవైనా 

నీ దొంగతనానికి గురైన నాకు 
ఆ నవ్వు నురగనంటిస్తూ   
ఇంకా ఆనందమే పంచుతావ్ 

నే రాసే ప్రతి మాట నీకోసం 

ముత్యాల హారమైతే 
నీకోసం నేను పలికే ప్రతి మాట 
నీ దారిన గులాభీలు పరిస్తే 

నీ సాంగత్యంతో నా గుండె 

నిత్య యవ్వనంగా పరుగులు తీస్తూ 
ప్రవాహమై పోటెత్తుట్టుతుంటే 

నాకు నేను 

నీకు రాసిచ్చుకొని 
నీ బానిసగా ఉండిపోనా 
నీ కంట కారే కన్నీటి చుక్కలో 
ప్రేమ సంద్రాన్ని వెత్తుక్కోనా 
ప్రియా !!

Monday, August 27, 2012

జీవితం ఒక మంచి కాఫీ లాంటిదే



నిమిషాలన్నీ 
కాఫీ చుక్కలుగా 
కాలాన్ని కాఫీ చేసుకుని తాగెయ్ 

ఒక్క కప్పు కాఫీ రుచిగా 

ఉండడం కోసం 
జీవితాన్నిమరిగించే 
పిచ్చి వారిలో నువ్వూ 
ఒక దానివేగా 

వేడి వేడి పొగల్లో తన

జ్ఞాపకాలతో నింపుకున్న శ్వాస 
ఆవిరై పోనివ్వక 
తన మాటలన్నీ 
చెక్కర గుళికలుగా చేసుకో 
ఆ పోగానంతా పీల్చేసుకొని 
గుండెల్లో నింపుకో 

అక్కడే తను ఘనీభవించి పోయేలా 

ఆ ఆవిరులకు 
నీ తలపుల వెచ్చని కౌగిలి 
జోడి చెయ్ 

చూడు అప్పుడు జీవితం 

ఒక చక్కటి కాఫీ లాంటిదే కదా !

Sunday, August 26, 2012

లెక్క చూసుకున్నా ఇవ్వాల్టి ప్రేమని


లెక్క చూసుకున్నా
ఇవ్వాల్టికి
ఎంత ప్రేమ వెనకేసుకున్నాఅని

ఆవర్జా ముగిసినా

ఇంకా ఎదో
అస్పష్టపు లెక్క
అంకెల గీతలు దాటి
రేపటికై లాభాల
మిగుళ్ళు చూడడానికి
నష్ట పోయిన ప్రేమ
నటనకి అమ్ముడుపోయిన ప్రేమల్ని
బేరీజు వేసుకొని
తెలివి తెచ్చుకోడానికి

చేతిలో నిలుపుకుకున్న ప్రేమ

ఎంతో
రేపటికి తీసుకెళ్లే, మోసుకెళ్లే
ప్రేమెంతో
ఖర్చు చేసిన
ప్రేమెంతో అని
హృదయంలోని ఎడమవైపు
గదుల్ని డెబిట్ అంటూ
ఖాళీ తనంతో ఒంపేస్తూ
ప్రశ్నల మరకలతో
నింపేస్తుంటే

ఆ వైపుకు ఈ వైపుకు

సరి సమానం కాక
క్రెడిట్ అయ్యె ప్రేమ లేక
హృదయం పై ప్రశ్నలని
తుడిచేసే, కొట్టేసే ప్రేమ
డిపాజిట్ అవ్వక
ఇన్ని రోజులూ
లోటు చూపించింది

ఇవ్వాలే

నాకు తెలియని
జీవితాంతం సరిపోయే
ప్రేమ మొత్తాన్ని
క్రెడిట్ చేసారు
అది నీవేనా?

* * * * *


ఒక్కసారిగా

నా ఆవర్జా తల క్రిందులయ్యింది
ఎప్పూడూ రేపటికోసం
నన్ను నేను ఖాళీ చేసుకునే
లోటు ప్రేమ
నుంచి
అందరికి పంచమని ఒకేసారి
ప్రేమే ప్రేమగా
తనని తాను నాకు దానమిచ్చింది

ఇప్పుడే ముగిసింది

ఈవ్వాల్టి లెక్క
ఆశా నిరాశల మధ్య
ధైర్యానికి పిరికితనానికి
గెలుపు ఓటముల మధ్య
నాణానికి రెండువైపులా నేనై

అటూ ఇటూ గా

సమానమవుతూ
అసమానతల్లో
ప్రేమనే చూస్తూ
నా అస్తిత్వాన్ని ప్రేమకొసమే
అప్పగించుకుని
తృప్తిని ప్రేమ భాషల
లెక్కలో మిగుల్చుకొని

వ్యాపారిని కాకపోయినా

తరహాననుసరించి నడుస్తున్న
మనసున్న మనిషిని
అంకెల్లో లెక్కలు చూపలేని
ప్రేమ పొంది ధనవంతున్ని  అని
తృప్తి కోసం ఆశపడే  మనసువాదిని    

ఒంటరి గాలి



ఆ గాలికి ఏ భావాలు లేవు 

అనుభవాలు తప్ప 

అనుభవాల కొలతల్లో భావాలను 

వెతుకులాడటం  తప్ప 

భావాల చెమ్మ ఘాడత 

కొలిచే ప్రయత్నంలో
అణువణువులుగా విడిపోవడంతప్ప
ఆ అణువుల్లో కూడా ఒకటిగా 

ముడిపడి ఉండాలనుకోవడం తప్ప 


ఒంటరిగా గుండెల్లో చేరి 

మనసు పొరలను తాకి 

నిదురోయే జ్ఞాపకాల కలల్లో 

దొంగలా 

ఏవేవో రహస్యాలని తడిమి రావడం 

తప్ప 

రహస్యాల గుస గుసలు 

తన నుంచి చేరేసినా  

మూగ గానే ఉండి మూలల్లో 

స్థానాన్నివెతుక్కోవడం తప్ప 

ఆ గాలికి ఏ భావాలూ లేవు 

మట్టితో మమేకమైనా 

మరుపును   చెంతనే ఉంచుకోవడం తప్ప 

నీటిలో అణువుల్ని కౌగిలించుకున్నా
వాటి నిట్టుర్పులను కూడా 

గ్రహించలేనంత 

అపరిచితగా ప్రవర్తించడం తప్ప 


మేఘాల కురులు ముడివేస్తూ 

వాటి చిలిపిదనం అల్లరి పెట్టినా 

తనకేం సంబంధం లేనట్టు 

ఆ వైపు చూడక నీల్గుతూ 

ప్రేమికుల కౌగిలింతల్లో దూరినా 

సిగ్గు పడకుండా తనకు తానూ 

డోంట్  కేర్ అనుకోవడం తప్ప


ఆ గాలికి ఏ భావాలు లేవు 


పిల్లన గ్రోవి తనువును మృదువుగా 

స్పృశించినా 

దాని మనసును అర్ధం చేసుకోకుండా 

ఉండడం తప్ప 

మనసు నిండా శ్వాసగా నింపుకున్న 

అక్కడ నిలువలేక బయటికొచ్చే వరకు 

పరగులు తీయడం తప్ప 

ఎందుకని నిలదీస్తే 


భావాలన్నీ ప్రేమకి రాసిచ్చి 

మోసపోయిన గుండెని 

గతంలో సమాది చేసి 

ఆకృతి లేకుండా 

ఏ ఆలోచనల కొక్కానికి 

తనకు తానే చిక్కకుండా తిరుగుతునట్టు 

సమాధానం ఇస్తూ అంది 

అందుకే 

ఈ గాలికి ఏ భావాలు లేవు

నన్ను నేను మరిచిపోవడం తప్ప 



Wednesday, August 22, 2012

నాకు నీకు


నాకు నీకు
ఎంత దూరం?
కంటి పాపకి
కను రెప్పకి
మధ్య ఉన్నంతా

నాకు నీకు
ఎంత సామిప్యం?
నా కన్నీళ్ళలో
నీ కాళ్ళు ఊపుతూ
నా కను పాపలో నువు
దాగినంత

నాకు నీకు
మధ్య ఎంత సాంగత్యం?
నీ రూపం నా కళ్ళలో
చిత్రీకరించుకుని
అలాగే యుగాల వరకు
కళ్ళు మూసుకునేంత

నాకు నీకు
మధ్య ఎలాంటి సహచర్యం?
కళ్ళలో పడ్డ నలకని తోడేస్తూ
నీళ్ళలా నేను బయటికి
వెళ్ళేంతా

మరి నీకు నాకు
మధ్య ఉన్నదేంటి?
నాకు దృష్టిగా ఉండి
నా దేహానికి చూపుగా మారి
నాలో భాగమైన
ఆ కళ్ళే నీవు
నా ప్రేమ
by-mercy margaret (22/8/2012)

తనతో ఉన్న కాసేపు


తనతో
ఉన్న కాసేపు
సమయాన్ని తీగలుగా చుట్టి
మూలకు పడేసి
కనబడకుండా
వర్తమానపు గోనెసంచుల్లో నింపి
కుట్టేస్తే చాలు
అనిపిస్తూ

మాటలన్ని
బంతి పూల రెక్కల కింద
దాక్కుని
ఆ రంగుల్లో స్నానమాడి
తన పెదాలపై
అంటుకున్నట్టు
కనిపిస్తూ

చీకటంతా
ప్రవహమై
వెలుగులో కలుస్తూ
కను రెప్పలని
ఆ వెలుగు తరగలతో నింపి
తన కళ్ళలో
ఆ ప్రకాశాన్ని
మెరుస్తుంటే చూస్తూ

గాలినంతా
ఎక్కడికక్కడ ఆపి
తన స్వేదాన్ని తాకకుండా
చేసి
ఆ చెమ్మనుంచి సుగంధాన్ని
తీసి
నా గుండెలనిండా
తనుగా నింపుకుంటూ

ఆ క్షణాల దగ్గరే
ఆగిపోయా
అడుగు ముందుకేసే ధైర్యం చాలక
తనకు
ఈ రోజుకు
వీడ్కోలు చెప్పలేక

నన్ను నేను
గతాన్ని జ్ఞాపకాల్ని కౌగలించుకొని
రేపటికి
తను వేసే
అడుగుల కింద
పచ్చగా పరుచుకొనే
గడ్డి తివాచి నవుతూ
ఆ పాదలని
సున్నితంగా
ముద్దాడటానికి ఎదురుచూస్తుంటా
By- Mercy Margaret (20/8/2012)

Sunday, August 19, 2012

నాకెప్పుడూ తొందరే



నాకెప్పుడూ
తొందరే
సంతోషాన్ని పొందాలని చేసే
కష్టంలో
రాల్చాల్సిన
చివరి చెమట చుక్క
రాల్చాకుండా
ఎదురుచూపుల వెచ్చదనంలో
ఉత్సాహపు తడిని
ఆవిరి చేస్తూ  

నాకెప్పుడూ

తొందరే
కలల్ని ఫొటో తీసి
నాకోసం
ఆల్బం చేసుకునే క్రమంలో
కనురెప్పల
పరదాన్ని
తలుపు తడుతున్న సూర్యుని
నిరుత్సాహ పరచొద్దని
త్వరపడి ఘడియ తీస్తూ
కలల్ని చెదరగొట్టేస్తూ

నాకెప్పుడూ

తొందరే
రేపటి అబద్దాన్ని
ఈరోజు నిజంతో పోలుస్తూ
నిన్నటి పద్దుల్లో
నన్ను నేను తీసేసుకుని
గతాన్ని జ్ఞాపకాల గుంజకి
కట్టి
భవిష్యత్తు దారుల్ని
ఇప్పట్నుంచి వెతుకుతూ
నన్ను నేను
నేటికి దూరం చేసుకుంటూ

నాకెప్పుడూ

తొందరే
బాల్యం నుంచి యవ్వనానికి
యవ్వనం నుంచి ముసలితనాన్ని
ఇప్పుడు బ్రతకాల్సిన
క్షణాలు చూడకుండా
జీవితం నుంచి కొనాల్సిన
వస్తువులు కాకుండా
నన్ను నేను వెచ్చించుకుని
నాకు కాని వాటినెవో కొంటూ
బ్రతుకు సంచి నింపుకుంటూ
అందులో
నన్ను నేను కొల్పోతూ
(BY-mercy margaret)



Monday, August 13, 2012

సగటు బంధాలు



నీటి మీద రాతలే

బంధాలు 
కొద్ది సేపు నిశ్చలంగా 
అనిపించినా 
ఆ కొద్దిసేపట్లోనే 
జీవితాంతపు నమ్మకం 
పెంచేసుకుంటూ 

ఎటునుంచి పడతాయో
దూరల్ని పెంచే రాళ్ళు 
వలయాలు వలయాలుగా 
నిక్షిప్తం 
చేసుకున్నాం అనుకున్న రూపాన్ని
తరంగాలతో క్షణాల లెక్కన
దూరం చేస్తూ 


తామరాకు పై
అందాన్ని ఆవిష్కరించే 
నీటి బొట్టుతో
బంధాల్ని పోల్చి
ఎంత అందమని మురిసిపోయే
లొపే
దారెతుక్కున్ని సజాతీయుల్తో
కలిసిపోతుందని ..పదిలంగా చూసుకో
ఎంతనుకున్నా 
మనం మనం 
సగటు మనుషులం కదా

by-Mercy Margaret (12/8/2012)

సగం కాలిన చిత్తు కాగితం

అక్కడేదో

సగం కాలిన చిత్తు కాగితం 
తీసి చూస్తే 
చివరిగా మిగిలిఉన్న 
అక్షరాలు 
-"నిన్ను మరువలేక 
చూడలేక
చాలిస్తున్నా .....తనువు--
నీకైవస్తున్నా నీ వెన--
నా ప్రి--"
సగం కాలిన అక్షరాల్లాగే
ఎవరిదో దేహం
ఇప్పుడిప్పుడే
ఆ కట్టెలపై కాలబెట్టినట్టున్నారు
కాలుతున్న పొగల్లోంచి
ఆ దేహం
తనలో నింపుకున్న
జ్ఞాపకాలు
తెరలు తెరలుగా
అనంతాల్లోకి
రోదిస్తూ
చుట్టుపక్కల వారికి
అర్ధమయ్యేలా కళ్ళకి
మంట పెట్టి మరీ
కన్నీళ్ళను ఒంపుకుని
తడిసి పోతున్నాయి
ఆ ప్రక్కన
తండ్రి మూగ రోదన
ఏ కలెక్టరో అవుతుందని
ఆశపడి ఇంటికి
దూరంగా పెట్టి చదివిస్తుంటే
ఆశలపల్లకిని కాదని
చావు పల్లకినెక్కి
ఇన్నేళ్ళ ప్రేమకన్నా
ఆర్నెల్ల ప్రేమలో
తమ ప్రేమనే గడ్డిపరకగా
చూసేంత కొలతలెలా
కొలిచావమ్మా
చిన్నప్పుడు గుండెలపై తన్నిన
తన్నులే
ఇప్పుడు నా గురుతులై
పోవాలని
నీ దృష్టిలో
గొప్పదైన ప్రేమ
మాకు
ఆజన్మాంతపు
నరకపు శోకం మిగిలేలా
జీవితకాల శిక్ష వేసెలా
నిన్ను ఒప్పింప చేసిన
గొప్ప ప్రేమ
మేము
నీపై చూపిన ప్రేమనే
లోకం చులకనగా చూసేలా
మాకు నరకం ఇచ్చి
నీ స్వర్గం వెతుకుంటూ
వెళ్ళావా ?
ఆ తండ్రి రోదన చూస్తూ
పొగల్లోంచి
సుడులు సుడులుగా వచ్చి
ఆ కన్నీళ్ళు
తుడుస్తూ
చివరి సారిగా తన చెంపను
ముట్టుకుందామనుకుందా
అంతే
వర్షం ఆ అవకాశం తను
తీసుకొని
ఇకెన్నట్టికి తన వాళ్ళని
చూసుకోలేనంత
దూర తీరాలకి కర్కషంగా
లాక్కెల్లింది
మరి పొందాలనుకున్న
ప్రేమ ఏమయ్యింది ?
by-Mercy Margaret (13/8/2012)
.......................................................



Monday, August 6, 2012

ప్రశ్నార్ధకాల రెక్కలు




-
ఆలోచనలన్నీ
నీటి బుడగల్లా
పట్టుకునేంతలో పగిలిపోతూ
నన్ను చూసి నవ్వుతూ

ఊహలొ ఊసులో
ఊపిరినే
మనసు
ఆలోచనల్లో నింపి
ఊదుతుంటే

నీ జ్ఞాపకాల కిరణాలు
వాటిలోంచి పరావర్తనం చెందుతూ
ఎన్నెన్ని రంగులో
నా కనులకు
విందు చేస్తూ కవ్విస్తుంటే

పసిపిల్లాడిలా
ఆ బుడగలను పట్టుకునేందుకు
పరుగెడుతూ ,
పడుతూ లేస్తూ
నాకు తెలియని నన్ను
గెలిపించాలని
గెలుచుకోవాలని ప్రయత్నిస్తుంటే

నన్ను చూసి నవ్వకు
ప్రశ్నార్ధకాల రెక్కలు కట్టుకుని
ఎగురుతున్నా
సమాధానాన్ని గెలవాలని
నీ మీదే నాకు జాలి
నీకు ఆ రెక్కలు కూడా లేవని
BY-Mercy Margaret (6/8/2012)

Thursday, August 2, 2012

ఎదురుచూపుల తెర



ఒకటే గొడవ
నాలో నీ తలపులకు
నా మనసుకు


ముని వేళ్ళతో ముద్దుగా తాకి

అలా
వదిలేయక రెమ్మ పై గోరుతో గిల్లి
నీ తలపులు  చేసిన గాయాలు


మనసంతా పరుచుకుని

స్వయానికి - స్వార్ధానికి మధ్య
నాకు నీకున్న తీరపు దూరాల్ని
పెనవేసుకొని
ప్రవహిస్తూ నదిలా  నిండుకుని
కలుపుకు పోతూ


ఆగి ఆగి వెనక్కి తిరిగి

ఎంత దూరం వచ్చానో నీనుంచని
చూపుల అడుగుల్ని వెనక్కి నీ వైపు పరుగెత్తిస్తూ
నా కళ్ళలో నీకై  నా భవిష్యత్తు నిలిపివేస్తూ


నీ ఒక్కో జ్ఞాపకాన్ని ఉండలుగా చుట్టి

మస్తిష్కపు పెట్టెలో గులికలుగా దాస్తూ
వ్యాపకాలలో పడి నిన్ను మరిచేంతలో
ఔషదమై
అర్ధభాగానిగా నిన్ను
నాలో నింపుకుంటూ మరుపుకు వైద్యం
చేసుకుంటూ .


దూరమైన ఈ కొద్ది  నిమిషాలకే

నీ  తలపుల సుడిగుండాలలో నేను
మునిగిపోతు
ఎదురుచూపుల తెర చాపనెత్తి
నీ ముందర మోకరిల్లే
గడియ కోసం చూస్తున్నా

సమాధిపై అక్షరాలు


సమాధిపై అక్షరాలు
మాట్లాడుతున్నాయి
గుస గుసగా నీ లాగే
కళ్ళని పొడుస్తూ

తడి ఆరని నా చెంపలని
తుడిచే ప్రయత్నంలో
ఓడిపోయి
నువ్వు
ఆ అక్షరాలలోంచి చూస్తూ

చెదిరిన నా ముంగురుల్ని
గాలిలా తాకే ప్రయత్నం చేస్తూ
కన్నీళ్ళను నీలో
కలుపుకుంటూ

భారమనుకుని వదిలేస్తున్న
క్షణాల్ని
గడ్డివాసనతో నాలోకి
తిరిగి నింపుతూ

ఖాళీగా నిందిస్తున్న
నా కౌగిలి మాటల్ని
ఆ దీపపు వెలుగులో
దహించుకుంటూ నను దీనంగా
చూస్తూ

నీపై  సరదా పడ్డ మరణం
నా గుండెకి
వేస్తూనే ఉంది  ఉరిశిక్ష
ప్రతి క్షణం
నీ గురుతుల  వాసన
త్రాడుని పేనుతూ

నువ్వేమో
ఒంటరిగా ఇక్కడ
ఇల్లు కట్టుక్కున్నావ్
నువ్వు లేని ఇల్లుని
నాకు సమాధిగా
చేసావ్ ..



రాతిరి కౌగిలిలో


నేను మేల్కొనే రాత్రులు
నాకు పాఠాలు నేర్పే గురువులు
నాతోనే ఉంటూ నన్ను ప్రేమించే
నా స్నేహితురాళ్ళు

దొంగలా ఎప్పుడొచ్చి దోచుకెల్తుందో
జీవితాన్ని ఒంటరితనం
కానీ  ఆప్తురాలిగా తన తోడు నివ్వడానికి
దరిచేరుతుంది చీకటి నేస్తం

ప్రతిఘటించే ధైర్యాన్ని  బందీ చేసుకొని
వెళ్తుంది పిరికితనం
పౌరుషాన్ని కంటికి మెలుకువతో
నేర్పుతూ సానబడుతుంది చీకటి నేస్తం
రేపటి ఉదయం కోసం

నలుగురి ముందు  సాహసినని
కళ్ళకి నటనలో శిక్షననిస్తుంది
ఉదయపు కాంతుల్లో జీవితం...
గుండెనంతా తనై  తనలోకి
ఒంటరితనాన్ని ఒంపేయమనే
ఆత్మ బంధువు నీ కోసం చీకటి నేస్తం

ఒంటరికి కూడా తోడునిస్తూ
రాతిరి కౌగిటిలో
ఓడిపోయిన ప్రతిసారి  సేద తీరుస్తూ
త్రవ్వి త్రవ్వి జీవితాన్ని తోడుకోమని
కవులకు
భావాల సేద్యం చేయడం నేర్పుతుంది
చీకటి నేస్తం ..

అందుకే చీకటంటే నాకూ  ..
నా ఒంటరితనానికి 
ఏకాంతంతో కలిపి
మరీ  ఇష్టం ..