Wednesday, September 3, 2014

భాష

@by Mercy Margaret 

మీరే భాషలో నన్ను పలకరిస్తారో 
ఆ భాష మీది కాదు 
నేను ఏ భాషలో ప్రతిస్పందిస్తానో 
అది నాది కాదు 

మీరనుకున్నట్టు 
మేమ అమ్ముతుంది 
మా ఆభరణాలో, నాలుకో, శీతాలాకపు దుస్తులో, 
మీ కోరికలకు తగ్గట్టుగా
తయారుచేసి అందించే బహుమతులో కాదు
వాటితో కలిపి కొంచెం కొంచెంగా కోల్పోతున్న
మా అరచేతుల్ని

మేము మాట్లాడుతున్న బాషకు తెలుసు
ఆ ఛీత్కారాల ఘాటుగాయాల లోతెంతో
మా చెమ్మకన్నుల నీటి సాంద్రత ఎంతో
ఇప్పుడే దాటి వెళ్ళిన మేస్త్రీ కి తెలుసు
ఇంటి మధ్యలో గోడలు కట్టమని అడగాల్సి వచ్చిన
పరిస్థితులెంటో

మా చేతులు విస్తరిస్తున్నప్పుడు మీ దుస్తులు మాత్రమే
మాకు తుగులుతున్నాయి
అలాగే మీ చేతులు వ్యాప్తి చెందుతున్నప్పుడు కూడా
మాకు బదులు దుస్తులే తగులుతున్నట్టు ,
తిరుగుతున్నట్టు అనిపిస్తుందనుకుంటాను.
అలా కదులుతున్నప్పుడు
ఎన్ని అలిఖిత అక్షరాలు
ఉనికిని కోల్పోయి పొగలా మారిపోతుంటాయో

భాషకు తెలుసు
ఎందుకు
అడుగులు వ్యతిరేకదిశగా పడుతుంటాయో ??
మోసపోయి, దగాపడినా..
తెలిసిన దారులగుండానే కదా
మనం కలసి ప్రయాణించాం

మొహాలపై అంటించబడ్డ దుమ్మును ఊదేసి
ఇళ్ళకు అంటించబడ్డ బ్యాండేజీలను ఒక్కొక్కటిగా ఊడదీస్తూ
వెతుకుతూ వెళ్తున్నాను
అలలుఅలలుగా వ్యాకరణ వాసన లేకుండా బాష ఎదురవుతుంటే
ప్రవహిస్తున్న ఒక రహస్యనదిని కనుగొనడానికి

ఔషద మూలికల వేర్లలాంటి
పుప్పొడి వెదజల్లే పూల నవ్వుల్లాంటి
మాయమవని కాలిన గాయం లాంటి
భాష వైపుకు

పొరపాటున కూడా
నాతో ఎవరూ ఇప్పుడు చెప్పకండి
ఆ భాష ఇప్పుడు
ఏ ఎగ్జిబిషన్లో ప్రదర్శింపబడుతుందని