Sunday, April 14, 2013

ఆమె కోసం


@ ఆంధ్ర భూమి ఆదివారం మగజైన్  లో ప్రచురించబడ్డ  కవిత 
--------------
క్యాలెండరు గడుల గదుల్లో ఇరుక్కుని
మూలల్లోని  కోణాలతో తనను తాను
ఎప్పటివరకు అలా అణిచి పెట్టుకుని విభాగించుకుని
బాగాహారాలలో నిష్పత్తిని సమంగా చేయలేక
పోరాడుతుందో ?

సాయంత్రం సూర్యుడు గూటికి వెళ్ళే వేళ

ఆమె డ్యూటీ అంటూ బయలు దేరుతుంటే
గడియారం కూడా జాగ్రత్తా అని అరిచే చెబుతుంది
మెడలో వేలాడేసుకుని గుర్తింపు కార్డు
రెండవ భాద్యతను భుజాల ఖాళీలను నింపుతూ మోపుతుంది
ముఖాన అద్దుకునే పౌడరు
ఎన్ని కన్నీలను పీల్చి నవ్వును అంటించుకుని
జాగ్రత్తలను చెబుతుందో
గ్లోబల్ మాయజాలంలో ఇలాగే ఉండాలని
ఆ వస్త్రాలు ఎలా జులుం చేసి తన ఉనికిని
కాపాడుకోమంటాయో


మెడలో వేలాడే ఐడీ కార్డు తనను సంపాదన సూత్రంతో

ప్రపంచం ముందు నిలబెట్టినా
చీకటి షిఫ్టుల కొండచిలువలను తప్పించుకుని  ,
కామపు చూపుల మాటల ,వికృత చేష్టల
కొక్కాలను విడిపించుకుని
ఇంటికి చేరే వరకు హామీ ఇవ్వలేని సమయాన్ని
కొంచెం ఆమెకి రక్షణ ఇవ్వమని
ప్రతి రోజు వేడుకుంటూ

క్యాబ్ డ్రైవరును ఓ పదిమాటల మాట్లాడించి  

పరీక్షించుకుని అడుగులు  వేసే ఆమె
నవతరం నారి అని శ్లాగించినా
ఇంటికొచ్చే వరకు ఎదురు చూసే కళ్ళను అడగాలి

స్త్రీకి నిజంగా రక్షణ ఉందా అని ?? తెలిసిందేగా

ఆ గుమ్మలకి అంటించిన కళ్ళకు " ఆమె" 
ఒక కూతురు , ఓ భార్య , ఓ తల్లి  ఒక చెల్లి అని 
అందుకే  ఆమెను రక్షించే


రెండు చేతుల కౌగిలికోసం ఆ కళ్ళ గాలింపు . 
------------------------------------------------------------------------

|కాలం - బాధ

@ by mercy margaret

కాలాన్ని క్షణాలుగా , నిమిషాలుగా , గంటలుగా విసిరి వదిలెళ్ళొచ్చు కాని బాధను కాదు 
కాలం గాయాన్ని మాన్పుతుంది నిజమే కాని గాయం వళ్ళ అనుభవించిన బాధ , నొప్పిఎప్పుడు తడి తడిగానే ఉంటుంది కదా
కాలాన్ని వదిలి వెళ్ళగలడేమో గానిమనిషినొప్పిని బాధను దాటి వెళ్లడం కుదరదు కదా !!

----- ( 6/3/2013)----


ఒక పరీక్ష ..


మరణం చుట్టూ ఎప్పుడు ఒక వలయం 


రహస్యాలను చేదించలేని 


కృష్ణబిలంలా , బెర్ముడా ట్రైంగులెర్లా ఉంటుందేమో ..?


మనిషిని కౌగలించుకునేలోపు ఎన్నెన్ని 


నిజాలు బోదిస్తుంటుందో?


ఊపిరి దారాన్ని లాగుతూ 


కళ్ళలోని తడిని ఎండకాలం భూమిలా


పీల్చెస్తూ


గొంతులోని మాటలన్నీ మూటకట్టి బిగిస్తుంటే


గుండె గోడలు చివరిగా ఏ జ్ఞాపకలతో


ఎవరిని తలచుకుని బీటలువారతాయో ?


చల్లబడ్డ మట్టి ముద్దలా శరీరం


పనికి రానిదయినప్పుడు


అప్పుడు


నిన్ను చూసే


"ఆ కళ్లకు " చెప్పే సమాధానం కోసం


ఆలోచించే సమయం ఉంటుందో లేదో ?


పరీక్షించుకో ఇప్పుడే


----- (7/6/2013)---
పూరించాల్సిన ఖాళీ


కళ్ళ తోటలో నాటిన మొక్కలకు 
కొన్ని కలలు 
ఎలాంటి ప్రమేయం లేకుండానే పూస్తాయి 

కష్టపడి మొక్కల్ని నాటి
మొగ్గలుగా ఉన్నప్పటినుంచి కాపాడుకున్నా
ఇంకొన్ని
మొగ్గలుగానే రాలిపోతాయి

పూచి పూయగానే
కనురెప్పల ఆకాశం
కురిపించే వర్షానికి రాలిపడి
మరికొన్ని కొట్టుకుపోతాయి

అలా అని
కలల్ని కనని/పూయించని కళ్ళను
ఒద్దని ఎవరూ ఎప్పుడూ అనలేరుగా !?
నిద్ర వేలు పట్టుకుని కళ్ళ అంచుల వరకెళ్ళి
ఆ వనాల లోనికెల్లనని
జీవితాన్ని సగం రాసి వదిలేసినా ఖాళీగా పూరించకుండా
వదిలేయరుగా !?


--- (3/4/2013)

ఒక సారి విను

నదులౌతాయి
చేతులు,
గాలిలా నీ చూపులు నన్ను తాకగానే 
ప్రవహిస్తూ వచ్చి 
నీ చేతుల సంగమంలో 
సేద తీరుతూ ఒదిగిపోతాయి 

పుస్తకాలవుతాయి 
నా చేతులు
నీ మాటలు అక్షరాలై వాటి మీద పరుచుకుంటే
నీవై గీతాలు గీతలుగా
కొత్త కధలేవో రాసుకుంటాయి

అప్పుడప్పుడు
నా వేళ్ళ కొమ్మలకు ఊయల కట్టి ఊగుతూ
నీ జ్ఞాపకాలు నక్షత్రాలై
చేతుల వృక్షాలను అంటుకొని
రాతిరి పుష్పాలై
మెరుస్తుంటాయ్

అందుకే నిన్ను ముట్టుకున్న ఈ చేతులంటే
నాకెంతో ఇష్టం
నీకోసం ఎప్పుడు తెరుచుకునే ఉంటాయి 

ఎక్స్లూసివ్ నవ్వులు

జేబులో కొన్ని నవ్వుల్ని వేసుకుని 
ఉదయమే ఇంటినుంచి బయలుదేరుతాం 
భలే నేర్చుకున్నాం 
ఎలాగో , ఎక్కడ్నుంచో 

ఏ మొహం ఎదురైతే ఏ నవ్వు పెదాలకు అంటించుకోవాలో 
ఏ అవసరానికి ఏ నవ్వు సరిపోతుందో 
ఏ నవ్వుతో ఏ నవ్వును మారకం చేయొచ్చో వెన్నతో పెట్టిన విద్యల్లో జీవితం
ఉచితంగా ఇచ్చే ఆఫర్లలో ఇదొకటేమో

ఎంతైనా మనుషులకే సాధ్యం
పాపం జంతువులకు ఆ అవకాశం లేదుగా
నానార్ధాలు తెలిసిన నవ్వుల్ని మనిషి ఉపయోగించినంత
వాటికి ఉపయోగించడం తెలియదుగా

అందుకే నవ్వు నాలుగు విధాలా
నా నా అవసరాల కోసం ..
exclusively for "being who is called human "

నడుస్తున్నాను ఉదయం వైపు

వాకిలి ఈ పత్రికలో వచ్చిన నా కవిత
***
ఘనీభవించిన చీకటిపై
మొలకెత్తుతున్న  పాదాల ముద్రలు  వేస్తూ
కిరణాలు సోకని పుస్తకంలో అక్షరాల విత్తనాలు
కొన్ని జారవిడిచి
భావాలకు దాహమైనప్పుడల్లా చీకటి నీటిని త్రాగించి
నడుస్తున్నాను ఉదయం వైపు
తొలికిరణంతో
నేనే మొదట మాట్లాడాలని

ఆలోచనలన్నీ దాడి చేస్తే పగిలిపోయిన లాంతరు వెలుగుకు
నా పాదాలనుంచి కారిన రక్తపు బొట్లను తోడుగా వదిలి

కన్నీటి వర్షం ప్రతి సారి చెరిపేస్తున్న కలల కధలను చేతి గోళ్లకు
రంగుగా అద్దుకుంటూ

శూన్యం తరుముతుంటే రాల్చుకున్న
సీతాకోకచిలుకల రెక్కల స్వేచ్చని
ఏరుకుంటూ  నడుస్తున్నాను
ఉదయం వైపు

నాలోకి వెలుగు ఒంపుకుని
వెనక్కి చూడకుండా వెలుగై ప్రవహించాలని


నాతోడుగా  మిగిలి ,నా నోట నలిగి చినిగిపోయిన పాటకు
కుట్లు వేసుకుంటూ

నిశబ్దపు దుప్పటిలో దూరి నన్ను వెంబడిస్తున్న గాలికి
ఊపిరి నిట్టూర్పులను జత చేసి

కొన్ని భయంకర యుద్ధాల తరువాత ఆ చీకట్లో వర్షిస్తున్న
నిశ్శబ్దంలో తడుస్తూ
నడుస్తున్నాను ఉదయం వైపు
కొత్త పాట నొకటి నా పెదాలపై అల్లుకుంటూ
తూరుపు తలుపులు  తెరిచి
విజయగీతం సూర్యునితో పాటు ఆలపించాలని

------------------------


దోసిలిలో ఒక నది


సారంగ ఈ వారపత్రిక లో వచ్చిన నా కవిత 

  http://www.saarangabooks.com/magazine/?p=1456

------------------------------------
బయటికి ప్రవహించేందుకు దారి వెతుకుతూ

నాలుగు గోడల మధ్య ఒక  నది

ఊరుతున్న జలతో పాటు

పెరుగుతున్న గోడల మధ్యే తను బందీ

ఆకాశమే  నేస్తం నదికి

మాట్లాడుకుంటూ, గోడును వెళ్లగక్కుకుంటూ

గోడల మధ్య బందీయై  ఏడుస్తున్న తనతో

ఊసులు పంచుకుంటూఅప్పుడప్పుడు

నదిని ఓదారుస్తూ  వర్షంలా మారి ఆకాశం

గోడల పై నుండి జారి నదిని కావలించుకోవాలని

చేసేది ప్రయత్నం

ఉదయాన్నే కిరణాల కరచాలనంతో సూర్యుడు నదిని పలకరించి

తన స్వభావం కొద్ది ఆకాశాన్ని ఆవిరి చేసి

ఆకాశాన్ని నదిని విడదీస్తూ వేడిగా నవ్వేవాడురాత్రుళ్ళు చీకట్లో

నిశబ్ధం నాట్యం చేసేది గోడలపై

ఎలా నిన్ను బంధించానో  చూడని గోడలు

ధృడమైన నవ్వు నవ్వేవి, ఆ నవ్వు నదిని కుదిపేసేది

ప్రతిఘటించాలని ప్రయత్నిస్తే సూర్యుని సాయంతో

నది దేహాన్ని గోడలు వేడి వేడిగా కొరికి పీల్చేసేవివలస వెల్తూ పక్షొకటి  నది  పరిస్థితి చూసి

ఏమి చేయలేనని నిట్టూర్పు విడిచి

సాయపడ్డం ఎలాని? ఆలోచిస్తూ వెళ్ళిందిఒక రోజు

గోడలను పెకిలిస్తూ

మర్రి చెట్టు  వేళ్ళు వ్యాపించడం నది చూసింది

ఇంకొద్ది రోజులకే గోడ  ఒక వైపు కూలింది

నదికి స్వాతంత్ర్యం వచ్చింది

పరవళ్ళు తొక్కుతూ, కొండలెక్కుతూ,

పల్లం వైపు జారుతూ భూమినంతా తడుపుతూ  ప్రవహించింది

బంజరు భూములను పచ్చగా చేసి

ప్రతి పల్లె దాహాన్ని తీర్చి తల్లిగా మారిందిప్రతి విత్తనాన్ని మొలకెత్తిస్తూ స్వేచ్ఛని పండిస్తూ

మర్రి విత్తనాన్ని నాటిన పక్షి ఋణం తీర్చుకుంటూ

నింగికెగసి ఆకాశాన్ని పలకరించి

భూమి నలుదిక్కులా వ్యాప్తమై,

స్వేచ్ఛా విరోధపు గోడలను మింగేస్తూ

సహాయానికి , సహనానికి నిలువెత్తు సాక్ష్యమై

తనను తీసుకునే ప్రతి ఒక్కరి దోసిలిలో పక్షిలా మారుతూనే ఉంది