Wednesday, March 6, 2013

వాడితో జాగ్రత్త

 విహంగ ఈ మహిళా పత్రిక లో ఫిబ్రవరి నెలకి గాను అచ్చైన నా కవిత
*** 

శరీరాలని
చూసినప్పుడల్లా నోట్ల కాగితాలే కనిపిస్తాయి
వాడికి

నౌకల్లా దేహాల్ని ఉపయోగించుకుని
మురికి ఆలోచనల నదుల్లో
కోరికల్ని మారకం చేస్తూ
కరెన్సీ కాగితాల వాసన రక్తంలోకి రవాణా చేసుకుంటూ
మానవత్వాన్ని మచ్చుకైనా   కనిపించకుండా
మారేడు కాయ చేయగల
మాయగాడు

తాగుడు కోసం తండ్రి రూపంలో నక్కలా
కామంతో కళ్ళు నిండి
ప్రేమ ముసుగులో
కోరికలు తీర్చుకుని చంపే   గొర్రె చర్మం కప్పుకున్న తోడేలులా
డబ్బుకు మానం అభిమానాల్ని
అమ్మ ,  అక్క  చెల్లెళ్ళ బంధాలని తూకం వేసి
దైవభయం, ఆత్మ  భయం లేక వారి దేహాలను అవయవాలను సైతం
అమ్ముకునే నయ వంచకుడు
రక్తపిశాచి రూపంలో చుట్టు పక్కన తిరిగే వంచకుడై
పొరుగువాడి రూపంలో
ఎక్కడో ఒక దగ్గర నీకు తారస పడకుండా ఉండడు
ఎందుకంటే వాడికి " ఆడది  " అంటే
ఒక  పదార్ధం

కపటం తెలియని పావురాలను
మోసంతో  చిక్కించుకుని  అమ్మేస్తూ కాలం గడుపుతూ
సమాజంలో మనుషులమద్యే
వాడు

శరీరం అంటే వాడుకుని వదిలేసే వస్తువే వాడికి
కులమతాలుండవు
ఆస్తులు చదువులు పట్టవు
కేవలం దేహం మాత్రమే కనబడుతుంది

వాడెళ్ళే  రోడ్లమీద ట్రాఫిక్ జాం లుండవు

ఎందుకంటే చేసేది విమెన్ ట్రాఫికింగ్
హ్యూమన్ ట్రాఫికింగ్ కదా '!!
నా వరకోచ్చినప్పుడు కదా అనుకునే సమాజంలో
మనతో పాటే సహజీవనం కదా

--------



ప్రశ్నల గది

 ఆంధ్ర జ్యోతి పత్రిక " వివిధలో 28/1/2013 న అచ్చైన నా కవిత
* * *

అప్పుడప్పుడు
ఆ గదిలోకెళ్లడం అవసరం

నీ కోసం ఏర్పడ్డ భావాలన్నీ ఇటుకలై
హృదయంలో అడుగునున్న మట్టి తీసి
మెదడు నరనరాల్లో ప్రవహిస్తున్న నీటితో
మెత్తన చేసి
జీవితపు చేతులు కట్టుకున్న
గదుల్లో
"ప్రశ్నల గది " ఓ ప్రత్యేకం

ఎందుకు ??
సందేహపు గదిని అలంకరించుకుని
అందులోనే ఉంటావ్ ?

ఏ ఏ గదిలో వేయాల్సిన అడుగులన్నిటిని
ఆ మట్టిముద్డపై కవాతులు చేయించి
నీకు..
నీకే .. తెలియని కొత్త గదుల్ని కట్టుకుని
నివసించాలని ప్రయత్నించినా
ఏం లాభం ?
ఏం సుఖం ??

హృదయపు భూమి పరిభ్రమించడం
మానేసి ,
లావా
గదుల గోడలను బ్రద్దలు కొడుతూ
ప్రకంపనలు బీటలువార జేస్తున్నప్పుడు
ఆ భూమిలో చలనం కోపమైన
వెదుకుతున్న ప్రతి తాళపుచెవి స్థానాన్ని
తెలుసుకోడానికైనా
ఒక్కసారి ఆ ప్రశ్నల గదిలో కెళ్లడం
అవసరం

అందులో
ఎండిపోయిన విత్తనాల్లాంటి ప్రశ్నలు
చిక్కులు , చిక్కులుగా ఉండలు చుట్టిపడేసిన
ఊలు దారాల్లాంటి ప్రశ్నలు
రాయడానికి వాడనందుకు జబ్బు చేసి సిరా కక్కుతున్న
ప్రశ్నలు
వెలుతురును మింగేస్తూ
గాజులోనే బందీ చేస్తున్న
మసక బారిన చిమ్నీల్లాంటి ప్రశ్నలు
గాలిక్కుడా రెపరెపలాడకుండా
జీవాన్ని ఆవిరి చేసుకుంటూ
శ్వాస పీల్చుకోలేక వ్రేలాడుతున్న క్యాలెండరులాంటి
ప్రశ్నలు
తెచ్చిపెట్టుకుని తినలేక వదిలేస్తే
కుళ్ళిపోయి కంపుకొడుతున్న ప్రశ్నలు
ఎటు ప్రవహించాలో తెలియక
అక్కడే ఆగిపోయిన నదులనీరు తటాకమై
పాకురుపట్టి పచ్చని దేహంలా
చచ్చిన శవాల్ని గుర్తుచేస్తున్న ప్రశ్నలు
జీవచ్చవాలై
శవజీవనం చేస్తుంటే
భయపడకు
ఆ గదిలొకెల్లడం అవసరం

నీ
అడుగుల స్వరానికి అవి చిగురిస్తాయేమో ?!
నీ చేతులు తాకి మొలకెత్తి
నూత్న జీవితాన్ని పొంది
కొత్త సమాధానపు తాళపు చెవుల్ని
పరిష్కారపు వెలుగు రేఖల్ని
కంటాయేమో !?
అప్పుడు
నీకు -"నేను " అనే మాటకు
అర్ధం అవగతమవుతుందేమో

అప్పుడు నీకు
బ్రతుక్కి  - బంధానికి
ఆకలికి -ఆశకి
భవిష్యత్తుకు -చావుకు మధ్య అంతరం
తెలుస్తుందేమో
నిజనిజాల పొరలను తొలిగించి చూస్తే
తల్లివేరు జాడ దొరుకుతుందేమో
అప్పుడైనా సమాధానాన్ని
ప్రశ్నలు గర్భం దాలుస్తాయేమో
----

ఇది దాని లింక్  http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHI/2013/01/28/ArticleHtmls/28012013004012.shtml?Mode=undefined

విత్తనపు వీర్యం ఆడా ?? మగ ??

అదంతా  ఆకుపచ్చ సముద్రం
ఎన్ని చెట్ల ఆకులు తెంపి ఆ సముద్రాన్ని
సృష్టించారో?
ఎన్ని మ్రానులు నరికి
ఎన్ని మొక్కలు నాటి నిర్మించారో ??

ఆ సముద్రపు తీరానికి కొట్టుకొచ్చే అలలు
ఎండుటాకులు
సారంపోయి ప్రాణంపోయిన వాటిని
ఆ సముద్రం తనలో ఉంచుకోదు
గాలికి ఎప్పటికప్పుడు పని చెప్పి
శుభ్రం చేయిస్తూ  ఉంటుంది

బయటికెప్పుడు ప్రశాంతంగానే కనిపిస్తుంది
పచ్చగానే ఉన్నట్టు భ్రమ కలిగిస్తుంది
లోలోపల అగ్ని పర్వతాలు
భూకంపాలూ
జంతుబలులు నరహత్యలు జరుగుతూనే ఉంటాయి

అకస్మాత్తుగా ఒక రోజు
ఆ సముద్రంలో సగం కొట్టేసిన మ్రానొకటి గర్భం
దాల్చింది
గర్భం కోల్పోయి మోడురారిన
ప్రతి మొద్దు  గుస గుసలు
మొదలుపెట్టాయి

ఇంతకు
ఆ మ్రానులో పడ్డ  విత్తనపు వీర్యం
ఆడదా ??
మగదా ?? అని

----------

( ఈ కవిత  మంచి స్పందనను తెచ్చిపెట్టింది  ,నౌదురి  మూర్తి గారు ఈ కవితను ఆంగ్లం లో అనువదించి అనువాదలహరి అనే తన బ్లాగులో పోస్ట్ చేసారు )