Friday, February 27, 2015

కాలపు దవనం

ఏమీ చేయలేని సమయాల్లో 
సీసాలోని నీళ్ళలా ఖాళీ అయిన సమయాల్లో 
నువ్వూ నేను ఏం చేస్తాం ?


చెవులకు కళ్ళకున్న గొళ్లాలను విడగొట్టి

మనుషులతో నాకేంటి సంబంధం అనుకుంటూ
ఒంటరి వీధులు వెతుక్కుంటాం
ఆలోచనల్ని గులకరాయిలామార్చి
అనంతంలోకి విసిరికొడతాం

ఏమీ చేయలేని సమయాలెందుకో
కాళ్లకు చేతులకు ఉక్కుపదాల బిగింపై
శరీరంలోంచి ఊపిరిఒత్తిని లాగేస్తున్నట్టు
నిశబ్ధాన్ని చుట్టూ కుమ్మరించి ఆలోచనల మంటపెట్టినట్టు
ఎవరో ఏడుస్తున్నప్పుడొచ్చే కమరువాసనైనట్టు
కుర్చీలోకినెట్టి బంధాల బరువు కట్టి
సముద్రంలోకి నేట్టేసినట్టు
ప్రకృతితోపాటు చూపుకూడా
తప్పిపోయినట్టనిపిస్తుంటుంది కదూ

ఇంకొన్ని సార్లు
హృదయలోతుల నుండి ఎవరో ప్రేమించేప్పుడొచ్చే
సంపంగిపరిమళమో
గుండెకు దగ్గరగా అగరొత్తుల దైవప్రార్ధనై
హత్తుకున్న చేతుల్లానో
ప్రేమనంతా నేతనేసి తొడిగిన అంగీలానో
నరకబడి తునాతునకలైన దృశ్యాలన్నీ
ఆశ్చర్యంగా మళ్లీ ఏ మునివేళ్ళకో మొలిచి
క్రొవ్వత్తుల వెలుగులా సజీవమైనట్టుగానో
ఓ సమ్మోహన సంగీతమేదో నదులై పారుతూ
మనల్నీ పాయలా కలుపుకొని
ప్రవహిస్తున్నట్టనిపిస్తుంది

ఏమీ చేయలేని సమయాల్లో
సగం చదివొదిలేసిన పుస్తకమేదో
పలకరింపుల కోసం ఎదురుచూస్తున్నట్టు
సగంరాసి వదిలేసిన ఉత్తరమేదో
రెప్పవేయని తపస్సు చేస్తూ
పూలురాల్చుతున్న మల్లెతీగలా
నింపబడే దోసిలికోసం నిరీక్షిస్తున్నట్టనిపిస్తుంది

అంతేనా ??
ఆ ఏమి చేయలేని సమయాల్లో అప్పుడప్పుడు
గ్లాసునిండి పొర్లుతున్న కాఫీ వాసనలు
జ్ఞాపకాలతుట్టెపై రాయి విసురుతాయ్
అటుగా వెళ్ళే నవ్వుల తరంగాల ఫ్రీక్వెన్సీ మెదడులోని
ఓల్టేజీని మీటర్ కొలవలేనంత పెంచేస్తాయ్
అవును
గుండె గుమ్మం దగ్గరే స్తంభించిన మాటలు కన్నీటి పొడిరాలుస్తూ
లోలోపల ఉద్విగ్నతల బడబాగ్నుల్ని రగిలిస్తాయ్ 

ఇంకా … ?!
ఏమీ చేయలేని సమయాల్లో
రాలిపోయే పూలు మొగ్గలతో ఊసులు పంచుకుంటునట్టుంటే
గాలినిండిన జ్ఞాపకాలు సీతాకోకల వనాలవుతాయ్ 

మనుషులందరూ
నడిచే అడవుల్లా
ఆకాశానికి వేయబడ్డ నిచ్చెననెక్కుతూ దిగుతూ
పక్షులకూ మనకూ కొత్త పాటల్లా కనిపిస్తారు
చుట్టూ ఎప్పుడో నాటిన విత్తనాల నుండి
కొత్త నదులు పుట్టుకొస్తూ
హృదయాన్ని కవితావస్త్రంతో కప్పి
కాలంతో రాజీకుదిర్చే ప్రయత్నం చేసినట్టుంటాయి

తెలుసా
ఈ ఏమీ చేయలేని సమయాలు
ఒకరి నుంచి ఒకరికి
కాలం నుంచి కాలానికి
అక్షరం నుంచి అక్షరానికి అక్కడినుండి కవిత్వానికి
ప్రవహించే దారులు వేస్తుంటాయ్