Tuesday, December 15, 2015

రేపటి గీతం

2015 డిసెంబర్ నెల మాతృక మ్యాగజైన్లో  వచ్చిన నా కవిత  " రేపటి గీతం " 


నన్ను నేనెలా నిభాయించుకున్నానో
పునరుత్థానం చెందేందుకు ఎంత ప్రయాసపడుతున్నానో
నీకు తెలీదు
బలమైన రెక్కలు
బంధించినట్టు
ఆ రెక్కల్లో వికృత కాషాయగీతం వినిపిస్తుంటే
మరణాన్ని చూసి జాలి భయం రెండూ కలిగేవి
నా కళ్ళ నుండి
నోటినుండి
నాసికా రంధ్రాలు చెవుల నుండి
నా శ్వాసని ఈ దేశం కొంచెం కొంచెం గా పీల్చుకుని
బ్రతుకుతున్నట్టే అనిపిస్తుంది
చుండూరు
కారంచేడు
లక్షింపేట
ఖైర్లాంజీలు ,
గోద్రా, ముజఫర్ నగర్, దాద్రీలపై పడి తింటున్న భూతం
నన్ను కూడా భక్షించడానికి
బయలుదేరినట్టే అనిపిస్తుంది
నిద్రకి కలలకి
శ్వాసకి బ్రతుక్కి చితిపేరుస్తున్న తరుణంలో
ఎలా తెరుచుకున్నాయో లోపలి తలుపులు
నా లోలోపలి తలుపులు
వాళ్ళే కనిపిస్తున్నారు
ఆ భూతం మింగిన వాళ్ళ ఆత్మసంగీతం నన్ను చుట్టుకుని
మాట్లాడడానికి నా గొంతును అరువడుగుతుంటే వాళ్ళే కనిపిస్తున్నారు
నిశ్శబ్దశిలను దాటడానికి
నే చేస్తున్న ప్రయత్నంలో
వాళ్ళే వినిపిస్తున్నారు
నా తనువంతా అరణ్యమై
నిర్భీతిగా వున్నప్పుడు
చెరపడానికొచ్చే క్రూరమృగాలపై
నా పూర్వీకుల ఆత్మల్ని ఆవాహనం చేసుకుని మరీ
దిక్కులు పిక్కటిల్లేలా గర్జిస్తూ
సంరక్షకురిలాగా నన్ను నేను కాపుకాయ బయలుదేరాను
ఇప్పుడు నా చేతులు చాపుతున్నాను
నరికిన నా చేతులిప్పుడు భూమిని చీల్చే ఆయుధాలు
తెగ నరికిన నాల్కలు వారికి ఆసరాగా స్వస్థత నిచ్చే అగ్నికీలలు
వివస్త్రను చేసిన అస్తిత్వానికి నేను కప్పబడ్డ వస్త్రాన్ని
విముక్తి గీతం ఎత్తుకుని ముందుకు నడుస్తున్న కేతనాన్ని
రండి నాలో మీరు కూడా ఐక్యం కండి
ఒక కొత్త విప్లవగీతంలా పునరుత్థానం చెందుదాం