తూరుపు ముఖంపై రక్తం
మళ్లీ
ఏ నక్షత్రానిదో హత్య జరిగింది
సముద్రంలో రక్తాన్ని కడుక్కుని ఆకాశానికెక్కాడు
నేరగాడు
కిరణాల నవ్వులు విశ్వమంతా చొప్పించి
హత్యతాలూకు సాక్ష్యాలను మంటకలిపి
సప్త వర్ణాల ఇంద్రజాలంతో నిజాన్ని మాయచేస్తూ
అవసరాల అంగట్లో మనుషులు చేసే ప్రతి మారకాన్ని సాక్షిగా
సంతృప్తిని మొహాన కొట్టి
బ్రతుకు దెరువు సంకెళ్ళు మరమత్తు చేసి బిగిస్తూ
పగటి రాజ్యానికి అధిపతినని వికటాట్టహాసం
చేస్తూనే ఉన్నాడు
అంతరిక్షాలకెగిరి, ఆకాశాలను దాటి
ప్రశ్నలశరాలను సిద్ధం చేసుకుని
శాస్త్రాలను , సాహిత్యాన్ని , ప్రపంచ బాషలను , విశ్వజ్ఞానాన్ని
మెదడు నరనరాల్లో నింపుకుని ,
దేహాణువణువులో అభ్యాసం చేసుకుంటూ
మనిషితనం
మనిషినిజం
శోధించి సాధించిన " ఒకడున్నాడే "
అతడిప్పుడు నక్షత్రంయ్యాడు
తూరుపు
రెండు చేతుల వెనక తన ముఖం
మళ్ళీ దాచుకుంది
సూర్యుడిప్పుడు
చీకటి ముసుగులో తేనేపూసిన వెన్నెల గాలం తీసుకుని
రాత్రి వృక్షం వెనక నీడలో దాక్కుని
వేకువ జామున
"ఆతడి "కోసం చూస్తూ
మరో హత్య చేయాడానికి సన్నద్ధమౌతున్నాడు .
(ఆంధ్రప్రభ దిన పత్రికలో 16/9/2013 న ప్రచురితం )