Tuesday, December 15, 2015

రేపటి గీతం

2015 డిసెంబర్ నెల మాతృక మ్యాగజైన్లో  వచ్చిన నా కవిత  " రేపటి గీతం " 


నన్ను నేనెలా నిభాయించుకున్నానో
పునరుత్థానం చెందేందుకు ఎంత ప్రయాసపడుతున్నానో
నీకు తెలీదు
బలమైన రెక్కలు
బంధించినట్టు
ఆ రెక్కల్లో వికృత కాషాయగీతం వినిపిస్తుంటే
మరణాన్ని చూసి జాలి భయం రెండూ కలిగేవి
నా కళ్ళ నుండి
నోటినుండి
నాసికా రంధ్రాలు చెవుల నుండి
నా శ్వాసని ఈ దేశం కొంచెం కొంచెం గా పీల్చుకుని
బ్రతుకుతున్నట్టే అనిపిస్తుంది
చుండూరు
కారంచేడు
లక్షింపేట
ఖైర్లాంజీలు ,
గోద్రా, ముజఫర్ నగర్, దాద్రీలపై పడి తింటున్న భూతం
నన్ను కూడా భక్షించడానికి
బయలుదేరినట్టే అనిపిస్తుంది
నిద్రకి కలలకి
శ్వాసకి బ్రతుక్కి చితిపేరుస్తున్న తరుణంలో
ఎలా తెరుచుకున్నాయో లోపలి తలుపులు
నా లోలోపలి తలుపులు
వాళ్ళే కనిపిస్తున్నారు
ఆ భూతం మింగిన వాళ్ళ ఆత్మసంగీతం నన్ను చుట్టుకుని
మాట్లాడడానికి నా గొంతును అరువడుగుతుంటే వాళ్ళే కనిపిస్తున్నారు
నిశ్శబ్దశిలను దాటడానికి
నే చేస్తున్న ప్రయత్నంలో
వాళ్ళే వినిపిస్తున్నారు
నా తనువంతా అరణ్యమై
నిర్భీతిగా వున్నప్పుడు
చెరపడానికొచ్చే క్రూరమృగాలపై
నా పూర్వీకుల ఆత్మల్ని ఆవాహనం చేసుకుని మరీ
దిక్కులు పిక్కటిల్లేలా గర్జిస్తూ
సంరక్షకురిలాగా నన్ను నేను కాపుకాయ బయలుదేరాను
ఇప్పుడు నా చేతులు చాపుతున్నాను
నరికిన నా చేతులిప్పుడు భూమిని చీల్చే ఆయుధాలు
తెగ నరికిన నాల్కలు వారికి ఆసరాగా స్వస్థత నిచ్చే అగ్నికీలలు
వివస్త్రను చేసిన అస్తిత్వానికి నేను కప్పబడ్డ వస్త్రాన్ని
విముక్తి గీతం ఎత్తుకుని ముందుకు నడుస్తున్న కేతనాన్ని
రండి నాలో మీరు కూడా ఐక్యం కండి
ఒక కొత్త విప్లవగీతంలా పునరుత్థానం చెందుదాం

పింగాణీ సూక్తము


ఈ ఘడియలన్నీ 
కాలం వేళ్ల సందులనుండి జారిపోయే 
తెగిపడ్డ గాజు పూసలదండ 

మేల్కొని పురివిప్పే స్వప్నాలన్నీ 
యేటి పాయల వొంపులో 
హొయలొలుకుతూ నడిచే నీటిహంస 

రైలుపాదాల కింద 
రోజురోజుకూ సన్నగిల్లే పట్టాల స్వరపేటిక పాడే 
జీవనయాన గీతిక 

పక్షులన్నీఒకలాగే కనిపించినా  
వేరు వేరు ఆకాశాల్ని మోసుకెళ్ళే 
పురాస్మృతుల దేహపు ఛాయ





Monday, November 23, 2015

ఎలాగోలాగ
ఇలాగే ఇలాగే
ఈ రాత్రిలాగే నిలిచిపోవాలి
నిట్టనిలువునా ?? నేలమట్టంగానా ??
భూప్రపంచ  కాగితంపై ఎక్స్ యాక్సిసో , వై యాక్సిస్ల లాగానో  ?
ఎటైనా ఈ రాత్రినెత్తుకెళ్ళి పునాదుల్లో కప్పేసి
ఈ రోజునిక్కడే ఆగిపోనివ్వండి


ఏదో ఒక మంత్రమేయండి
యే  రాక్షసున్నోపంపి సూర్యున్ని రాకుండా మింగేయమనండి
లేదా ఈ రాత్రి నెవరైనా అపహరించుకెళ్ళి ఇష్టమొచ్చినంత
అనుభవించనీయండి
కాని
ఈ రాత్రినిలాగే నిలిచిపోనివ్వండి

ఈ రాత్రి కొందరికి అప్సరస
ఇంకొందరికి అడవి తేనెతుట్టె
కవిత్వరసం పంచే తుంటరి ప్రేమిక
మరి కొందరికి తమ మొహం పై జారిన
ఆకాశపు పయిట

కాని, నాకెందుకో ఈ రాత్రిని
నా ఇంటి తలుపు లోపలే బంధించి ఉంచాలనుంది
సూర్యుడ్ని ఎవరైనా ఆకాశమంత గొంగలిలో  కప్పెట్టేస్తే
ప్రశాంతంగా నిదురపోవాలనుంది

ఆ క్యాలెండర్ ని చుట్ట చుట్టి పడేయండి
అసలంకేలూ రోజుల లెక్కలే లేకుండా చేయండి
కనుల రెప్పలమీద నెలల నాట్యాలను ఈ రాత్రితో పాటే
మోసుకెళ్ళండి

ఉదయమయ్యిందో
వాడొస్తాడు .. ఇంటి అద్దె అడుగుతాడు
తాను లేస్తుంది రోజు చెప్పినట్టే ఇంటి లెక్కల చిట్టా ముందుంచుతుంది
వాళ్లొస్తారు పోస్ట్ డేటడ్ చెక్ అడుగుతారు
పిల్లలు లేచి ఈ వారమైన బయటికి తీసుకెళ్తావా నాన్న??
అన్నట్టు చూస్తారు

ఒక్క విషయం
నాకు రాత్రంటే ప్రేమ కాదు
ఉదయమంటే  భయం లేదు
కాని ఫలితం లేని ఇంకో రోజున నా వాళ్ళను
నిరాశపర్చలేను
నాతో అల్లుకు పోయిన వాళ్ళ కలల మొక్కలకు
నీళ్ళు పోసి ఎరువేయలేని నన్ను ఊహించుకోలేను
నేను తండ్రిని .. నేను తండ్రిని

Friday, February 27, 2015

కాలపు దవనం

ఏమీ చేయలేని సమయాల్లో 
సీసాలోని నీళ్ళలా ఖాళీ అయిన సమయాల్లో 
నువ్వూ నేను ఏం చేస్తాం ?


చెవులకు కళ్ళకున్న గొళ్లాలను విడగొట్టి

మనుషులతో నాకేంటి సంబంధం అనుకుంటూ
ఒంటరి వీధులు వెతుక్కుంటాం
ఆలోచనల్ని గులకరాయిలామార్చి
అనంతంలోకి విసిరికొడతాం

ఏమీ చేయలేని సమయాలెందుకో
కాళ్లకు చేతులకు ఉక్కుపదాల బిగింపై
శరీరంలోంచి ఊపిరిఒత్తిని లాగేస్తున్నట్టు
నిశబ్ధాన్ని చుట్టూ కుమ్మరించి ఆలోచనల మంటపెట్టినట్టు
ఎవరో ఏడుస్తున్నప్పుడొచ్చే కమరువాసనైనట్టు
కుర్చీలోకినెట్టి బంధాల బరువు కట్టి
సముద్రంలోకి నేట్టేసినట్టు
ప్రకృతితోపాటు చూపుకూడా
తప్పిపోయినట్టనిపిస్తుంటుంది కదూ

ఇంకొన్ని సార్లు
హృదయలోతుల నుండి ఎవరో ప్రేమించేప్పుడొచ్చే
సంపంగిపరిమళమో
గుండెకు దగ్గరగా అగరొత్తుల దైవప్రార్ధనై
హత్తుకున్న చేతుల్లానో
ప్రేమనంతా నేతనేసి తొడిగిన అంగీలానో
నరకబడి తునాతునకలైన దృశ్యాలన్నీ
ఆశ్చర్యంగా మళ్లీ ఏ మునివేళ్ళకో మొలిచి
క్రొవ్వత్తుల వెలుగులా సజీవమైనట్టుగానో
ఓ సమ్మోహన సంగీతమేదో నదులై పారుతూ
మనల్నీ పాయలా కలుపుకొని
ప్రవహిస్తున్నట్టనిపిస్తుంది

ఏమీ చేయలేని సమయాల్లో
సగం చదివొదిలేసిన పుస్తకమేదో
పలకరింపుల కోసం ఎదురుచూస్తున్నట్టు
సగంరాసి వదిలేసిన ఉత్తరమేదో
రెప్పవేయని తపస్సు చేస్తూ
పూలురాల్చుతున్న మల్లెతీగలా
నింపబడే దోసిలికోసం నిరీక్షిస్తున్నట్టనిపిస్తుంది

అంతేనా ??
ఆ ఏమి చేయలేని సమయాల్లో అప్పుడప్పుడు
గ్లాసునిండి పొర్లుతున్న కాఫీ వాసనలు
జ్ఞాపకాలతుట్టెపై రాయి విసురుతాయ్
అటుగా వెళ్ళే నవ్వుల తరంగాల ఫ్రీక్వెన్సీ మెదడులోని
ఓల్టేజీని మీటర్ కొలవలేనంత పెంచేస్తాయ్
అవును
గుండె గుమ్మం దగ్గరే స్తంభించిన మాటలు కన్నీటి పొడిరాలుస్తూ
లోలోపల ఉద్విగ్నతల బడబాగ్నుల్ని రగిలిస్తాయ్ 

ఇంకా … ?!
ఏమీ చేయలేని సమయాల్లో
రాలిపోయే పూలు మొగ్గలతో ఊసులు పంచుకుంటునట్టుంటే
గాలినిండిన జ్ఞాపకాలు సీతాకోకల వనాలవుతాయ్ 

మనుషులందరూ
నడిచే అడవుల్లా
ఆకాశానికి వేయబడ్డ నిచ్చెననెక్కుతూ దిగుతూ
పక్షులకూ మనకూ కొత్త పాటల్లా కనిపిస్తారు
చుట్టూ ఎప్పుడో నాటిన విత్తనాల నుండి
కొత్త నదులు పుట్టుకొస్తూ
హృదయాన్ని కవితావస్త్రంతో కప్పి
కాలంతో రాజీకుదిర్చే ప్రయత్నం చేసినట్టుంటాయి

తెలుసా
ఈ ఏమీ చేయలేని సమయాలు
ఒకరి నుంచి ఒకరికి
కాలం నుంచి కాలానికి
అక్షరం నుంచి అక్షరానికి అక్కడినుండి కవిత్వానికి
ప్రవహించే దారులు వేస్తుంటాయ్