Saturday, October 20, 2012

పిచ్చి నిద్ర

రోజూ నిద్రని ఉరికంబం ఎక్కించి

కలలు కల్లలోంచి ఎగిరిపోతుంటే చూస్తూ

గబ్బిలాల్లంటి జ్ఞాపకాలు



మొండిగా ఆ కొసలలొ వ్రేలాడుతూ
చనిపోబోతున్న నిద్రని చూసి
జాలిపడ్డం మామూలయింది

ఎందుకు అంతగా ఆశ పడతాయో
ఆ కళ్లు
చీకటిని అణువణువు అలుకుకొని
రెప్పల తలుపుల ఘడియలు సరి చూసుకుని
తలపుల చీరతో సింగారించుకుని
నిద్రతో సరసాలాడాలని
రోజు ఎదురు చూస్తూనే ఉంటాయా
ఏంటో

ప్రేమ
ఎడబాటు బాణాలని సంధించి
కళ్లని స్వాధీన పరుచుకుని
నిద్రని
రోజూ తిన్నగా ఆ కళ్లను చేర నిస్తేగా??
మధ్యలోనే తెలియని ప్రశ్నల ముగ్గులో దింపి
స్థిమితత్వం కొల్పోయాకా
పిచ్చి అంటకట్టి
అది ఒప్పుకోలేక తిరగ బడిందని అన్యాయంగా
కలతల కోతల్లో జీవితాన్ని భాగిస్తూ మరీ
ఉరి కంబం ఎక్కిస్తుంది...



                                 by mercy margaret( 19/10/2012 )-