Wednesday, October 10, 2012

ఆ కళ్ళ గుహలలో


ఆ కళ్ళ  గుహలలో
ఎన్ని చచ్చిపడిఉన్న  కలలో

అప్పుడప్పుడు

 అస్తమించలేని ఆ  జ్ఞాపకం గుండెని అలా తాకి 
దానిని  కప్పిన  పొరను చీల్చి 
శబ్ధంలోంచి మేఘామై పుట్టి 
వర్షించే ప్రయత్నం చేసి 
నిసత్తువగా వెనక్కి తిరుగుతూ నిట్టూరుస్తూ
ఇన్ని రోజులూ 

ఆ గుహల గోడలపై 

అప్పుడెప్పుడో 
రాసిన  ప్రేమ రాతలు 
చెక్కుకున్న పేర్ల గుర్తులు 
తగిలించి పాతగిలిన పరిచయాల చిత్రాలు
ఊసులు బాసల  బహుమతులు 
సాలెగూడైనట్టు గతం 
ఇక్కడే నా  సామ్రాజ్యం అన్నట్టు కళను కలలను కట్టేసి 
చుట్టేసి అల్లిపడేస్తున్న గూడు 

ఒక్కొక్కటి 

ఆ వర్షంలో తడవాలని ఆరాటపడి 
ఎండిన గొంతులతో ఇంకా ఎదురు చూస్తూ 

ఇన్నేళ్ళకు 

ప్రతి గడియని విడగొడుతూ ,అడ్డు గోడలని కూల్చేస్తూ 
తన నుదుట సిందూరమై ఉదయించే సాహసం చేసి 
కనుబొమ్మల సంగమంలో ముడిపడి 
ఇలా ప్రేమ చెలమ పుట్టుకొస్తే 
ఇక 
దాహార్తి తీర్చుకునే గుహతో పాటు  
చచ్చిపడున్న ప్రతి కల జీవం పోసుకొని 
దాని నరనరాలని కుదుపుతుంటే

మలినమంతా కడిగేస్తున్నప్రేమని చూసి 

గుండె అసూయతో ఆగి కొట్టుకోవడంలో  తప్పు లేదులే ?!
నువ్వు 
వ్యర్ధమైన కన్నీళ్లని వ్యాక్యానించడంలో కూడా 
హాస్యమేముందిలే   ?!

ఇప్పుడు

ఆ కళ్ళ  గుహల నిండా 
పుట్టుకొస్తున్న సంజీవని  మూలికలే ..