Thursday, October 4, 2012

ముక్కలైన దేహమే మనిషా



చెల్లా చెదురై పడి ఉన్న
మాంసపు ముద్దలు ?
ఇంకా తడి ఆరక  
అలా వాసన కొడుతూ
రక్తం స్రవిస్తూనే ఉన్నాయి

తల ఒకవైపు

తెగి పడిపొయిన కాళ్ళు చేతులు
పరుగెత్తి దూకబోయి పడినట్టుంది
శవం
గోడకి అటు ఇటు సగం సగంగా
పడి దేహం నేను అటు ఇటు అని
రోదిస్తునట్టుంది

ఆ తెగి పడి ఉన్న

చేతిపైన
ఎప్పుడో పొడిపించుకున్న పచ్చ బొట్టు
-"అను"అని
ప్రేయసో ,రక్త సంబంధో
ఆ పేరును రక్తాభిషేకం చేస్తూ
ఇంకా తన ప్రేమని తెలియజేస్తూ
ముద్దాడుతున్నట్టుగుంది

ఏ రక్షకోసం ఎవరు కట్టారో

ఆ చేతి మనికట్టుకు ఎర్రదారం
రక్తంలో తడిచి ఇంకా నెత్తుటి కళ నింపుకొని
దాని వెనక దాగిన దేవుని
దీవెనలెక్కడని ఊడిపోతు ఆ దైవాన్ని
ప్రశ్నిస్తున్నట్టుంది

డాబు దర్పం ఉన్న ఇంటి వాడిలా

ఉన్నాడు
రెండు వ్రేళ్లకి బంగారు ఉంగరాలు
అటు ప్రక్క జారి పడి ఉన్న
కడియం నీ దర్పం ఎమయింది అని
విలపిస్తూ ప్రశ్నిస్తున్నట్టుగుంది


అటు పక్క

పడిపోయిన పర్సు నిండా డబ్బే
రక్తసిక్తమై
కనీ కనిపించకుండా ఎవరిదో అమ్మాయి
ఫొటో
ఇంకా తన కోసం ఎదురు చూస్తున్న ప్రేయసి
కాబోలు

జీపు నుంచి కుక్కలు దిగాయి

శవం అణువణువు వాసన చూస్తూ
చుట్టు ప్రక్కల ఉరుకులు పెడుతున్నాయి
ముక్కలయిన సెల్ ఫొను నుంచి
ఇంక తన అంకెలెవరికి పట్టవని ఏడుస్తూ
మూర్చిల్లిన సింకార్డు రాలేక ఇరుక్కున్నా
బయటికి లాగి చూస్తున్న పోలీసులు!

బ్రతికున్నప్పుడు నువ్వెవరు ?

ఇప్పుడు నీవెవరు ?
అని ప్రశ్నిస్తున్నట్టు
పైన తిరుగుతూ అరుస్తున్న కాకుల గోల

ఒక పక్కగా నిల్చుని నేను

ముక్కలైన దేహమే మనిషా??
మనిషిలో ఏదో ఇన్ని రోజులుండి
నడిపించిన ఆ ఇంకెవరో మనిషా అని??

వలయాలుగా చుట్టుకుంటున్న శూన్యాన్ని

చెవుల దారుల గుండా దండయాత్ర చేస్తుంటే
కళ్లనుంచి నీళ్ళుగా నరికి  బయటికి నెడుతూ
బ్రతికున్న నా ఉనికెంత సేపని
ప్రశించుకుంటున్న మనిషిలా
నేను !!??