Saturday, July 28, 2012

మనసు మగ్గం




మనసు మగ్గం
మొరాయించలేదెందుకో  
ఈ రోజు

నీ జ్ఞాపకాలు నా కాళ్ళకి 
చుట్టుకుని 
అడుగు ముందుకేయకుండా
చేస్తుంటే  

అక్షరాలన్నీ  కలిపి
కవిత నేస్తూ
ఒడుకుతున్నా
మాటలన్నీ
దారాలుగా కలిపి చేర్చుతూ

పోగు పోగుకూ
ప్రేమ రంగులద్దుతూ
నాకు నేనే
మనసు మగ్గంపై పరుచుకుంటూ

నిన్ను కప్పబోతున్నానని
అందమైన వస్త్రంలా
హౄదయాన్ని హత్తుకుని 
అలా నీతో ఉండి పోనా?
కవితలా ..!?

Sunday, July 22, 2012

నిలబడు


భూమిని ఊహల దారంతో చుట్టి 
ఉత్తరం నుండి దక్షిణానికి 
తూరుపు పడమరలను చేతుల్లో 
బంధించి 
విరుస్తున్న ఒల్లునుంచి సొమరితన్నాన్ని తరిమి 
నిలబడు నిలబడు 
ఈ రోజు నీదే అని 

సముద్రాల అడుగుకెళ్ళి 
నునుపు రాళ్ళు ఏరుకొని 
రకరకాల చేపలతో
దొంగా పోలిసు ఆటలడి 
అలసినప్పుడు హిమాలయాల్లో 
మంచుని కరిగించి నీళ్ళు తాగి 
ఎగురుతుండు ఎగురుతుండు 
ఈ రోజు నీదెనని 

ఆకాశపు అంచులు తాకి 
అటుఇటు కొంచెం కోసుకుని  
మేఘాలన్ని కుప్పనూర్చి 
పిచ్చుక గూళ్ళు కట్టుకొని 
నక్షత్రాల్ని ఏరుకోని ఒళ్ళోనింపుకొని 
చేతిగాజులకు కాలిపట్టీలకు  
వాటి తళుకుళు తగిలించుకుని
నడుస్తూఉండు నడుస్తూఉండు 
ఇంకేదో చేసేదుంది ఈ రోజని 

నీటిని ఆవిరి చేసి తనలో ఏకం 
చేసుకొనే  ఆ సూర్యతాపంలో దూరి 
చినుకు చినుకులో హరివిల్లును 
ఆవిష్కరిస్తూ  
నెమలి పించంలో అంటుకొని 
సీతాకొకకు రంగులద్ది 
మట్టికి వాసన పూసి 
పచ్చని రంగుల ముద్దలు 
అడవులకిచ్చి 
వర్షపు చినుకుల్లో కలిసి  
ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఉండు 
ఈ రోజు జీవితం నిన్ను ప్రేమిస్తుందని 

ఓటమిని ముక్కలు చేసి ఔషదాన్ని పిండి 
చతికిలపడ్డ పట్టుదలకి 
వైద్యం చేసుకొని 
పాదలకు ఉత్సాహపు పారని పూసుకొని 
అపజయాన్ని కాలి జోళ్ళు చేసుకొని 
గమ్యం వైపు 
పరుగెడుతూ పరుగెడుతునే ఉండు 
జీవితంలో ఈ రోజు తప్ప 
బ్రతకును గెలవడానికి ఇంకో రోజు లేదని 
by -mercy  margaret (22/7/2012)

Saturday, July 21, 2012

ఎండా వానకి దేహమిచ్చి

చెదురు ముదురుగా 
చిక్కు ముడులుగా 
చెల్లా చెదురై పడి 
నీకోసం చూస్తూ 

ఒక్కొక్కటిగా 
అటు ఇటుగా
ఎటెటో ఎక్కడెక్కడో
నీకోసం కళ్ళలో
ఒత్తులేసుకోని జపిస్తూ

రయ్యిమని పరుగెత్తే
కాలపు వాహనంలొ ఎక్కి
నన్నిక్కడే ఉండమని
చెప్పి వెళ్తే

ఎండా వానకి దేహమిచ్చి
గాలి నీరుకి ఆనకట్టలు
కడుతూ
నీ నిశ్వాస కబుర్లని వెతుకుతూ
వర్తమానానికి వంతెన వేసేందుకు

ఎప్పుడొచ్చి నన్ను ఏరుతావో
ఒక్కచొటికి కూర్చి నా మాటల్ని
నా కలలని నీ చూపుల ఉలితో చెక్కి
నీ శ్వాసతొ తడిమి
ఊపిరి పొసి నిలబెడతావో అని
నా అనువణువు ఎదురుచూపు


BY-Mercy Margaret ♥(21/7/2012)♥

ఊగిసలాట

ఊయలలో ఉన్నప్పటినుంచే
ఊహతెలిసినప్పటి నుంచే ..
ఊగిసలాటలో గెలిచే 
ప్రయత్నం చేస్తూ 

పాకులడుతున్నప్పటినుంచి
పాదాలు స్థిరంగా నిలవడం నేర్పిననుండి
పరుగెడుతూనే ఉన్నా
గమ్యం వైపు ఇదేగా అని

తాతత్త అనే పదం నుంచి
దొర్లి దొర్లి పడుతున్న మాటల వరకు
మాటలన్నీ మూటలు కడుతూనే ఉన్నా
ఎంత స్వాంతన పొందానో ..
ఎంత మందిని సపాందిన్చుకున్నానో
తెలుసు కుందామని

కళ్ళు మూసుకునే చూస్తున్నా
కట్టెలపై నుంచి లెక్క పెట్టుకుందామని
"నా "అన్న వాళ్ళని ...



BY-Mercy Margaret ♥(20/7/2012)

Monday, July 16, 2012

కాఫీ కప్పుకేం తెలుసు


కాఫీ కప్పుకేం తెలుసు 
మౌనం మాటున జరుగుతున్న సంభాషణ 

********
చూపులతో చూపులకు 
మాటలతో మాటలకు 
శ్వాసతో శ్వాసకు 
ఇవ్వాలే జరిగిన పరిచయం  

అటు తను 
వర్షించక ముందు మేఘం లా 
ఇటుగా నేను 
స్వాతి చినుకుకై చూస్తున్న ముత్యపుచిప్పలా

తెలియని సంబంధాన్నీ 
భగీరద ప్రయత్నంలా
చేయి గీతల్లోనో ..నుదుటి రాతల్లోనో   
దాక్కున్న మనసుల్ని    
విధి తపస్సుచేసి  కలిపినట్టు 

ఆ చూపుల్లో చల్లదనం 
తన కళ్ళలో ఒదిగి పోయి 
అక్కడే ఉండమంటూ ..
ఆ నవ్వులో నిష్కల్మషం 
 పెదాలతో ఒప్పందం చేసుకొని 
తన గుండెపై తొలకరి చినుకులై 
వర్షించి చల్లబడమంటూ.

వేడి నిట్టూర్పులు తనువును 
తాకుతూ 
భావాలతో భావాల పరిచయం చేస్తుంటే 
తగిలి తగలని 
అంటి అంటకుండా ఇచ్చిన కర చాలనం 
హృదయ చాలనమే జరిపేసినట్టు 
తెలియని సరికొత్త పరిమళాన్ని 
మనసు మస్తిష్కానికి చేరవేస్తుంటే  

వేల క్షణాలే అవసరం లేదంటూ 
యుగ యుగాల నిరీక్షణ వృధా అనిపిస్తూ 
ఆ కొన్ని క్షణాల కలయిక 
గుండె నిండా నింపుకుని 
ఒక జీవిత కాల జ్ఞాపకంగా 
మిగిలిపోయే ఊపిరై పోవాలనిపించింది 
అర్ధం కాక చూస్తున్న కాఫీ కప్పు సాక్షిగా ... 

Sunday, July 15, 2012


బ్రతికే ఉన్నా 
నీ  చివరి శ్వాస ఊపిరిగా
మిగిలే ఉన్నా 
నీ ఆకరి కల ఆయువుగా 

రాలిన కన్నీటి వెల
నీ నవ్వు కొని తెచ్చేటంతా 
మూగబోయిన గుండె 
నీ రాక చూసి మేల్కొనే గంట 

పిలుపుకే ఆయాసం అంతా 
గొంతు మూగ బోయినా 
చూపుకే అలసటంతా
ఎదురు చూసే కన్ను వాలినా 

వెళ్తున్నాఅదే దారుల్లో 
పోగొట్టుకున్న ప్రేమను వెతుక్కుంటూ 
పారేసుకున్న సంతోషాన్ని
అన్వేషిస్తూ 
చితిలో కుడా జతగా మిగిలే వరకు 
వదలనని నీకై 
చివరి పరుగులు తీస్తూ

నా..
మనసిక్కడే ఆగిపోయింది 
రాలుతున్న జ్ఞాపకాల్ని  
కుప్పనుర్చుతూ 
గతంలోనే  నీతో సహజీవిస్తూ 
అరుణ కాంతినిష్టపడి 
నువ్వు నన్ను వదిలిపోయినా  
ఉదయించే తొలికిరణంతో 
ఈ ఎర్రతురాయి పూలై 
నీ శ్వాసల్ని,
జ్ఞాపకాల కౌగలింతలు కురిపిస్తూ 
నాతో రమిస్తూ ..
గతంలోనే నా వర్తమానమై నీకోసం 
ప్రియా 

Saturday, July 14, 2012

నీలి చీరతో వర్షం


ఘల్లు ఘల్లు మంటూ
నీలి చీరతో వర్షం
ఎదురుగా  వచ్చి కూర్చుంది

కళ్లలోని 
కన్నీటి చుక్కల్ని తుడుస్తూ
ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని
మెల్లిగా చిరునవ్వు నవ్వింది

-"ఒంటరివని ఎవరన్నారు ?"
నాకన్నా ఒంటరి ఎవరున్నారంటు -
-"మేఘంలా ఆవిరైన నన్ను కౌగలించుకునే
వారెవరు ?

పొగలు పొగలుగా కదులుతూ ఎవరి
గుండెని గట్టిగా హత్తుకోలేను
గాలి అధికారం నాపై ఎప్పుడు ఉండేదే
నా ఇష్టానికి నేను ప్రయానించలేను
ప్రేమ కబుర్లకి .. సందేశం మోసుకెల్లడం వరకే
తరువాత నా వైపు చూసేదెవరు

వర్షించే వరకు పూజలు పునస్కారాలు
ప్రకృతి పలుకులు ..ముచ్చట్లు మూడు నెలలకే
ముగించుకొని మళ్ళీ ఎదురు చూపులు చూడడం తప్ప
అంతవరకు చాలదన్నట్టు

అడవుల్ని నరుకుతూ నా గొంతునులుముతూ
నా కాళ్ళని విరగొట్టి మళ్ళీ పాపమని
దొంగ ప్రేమ చూపిస్తుంటే

కొద్ది సేపటి ఆనందం ఇలా నాకు
కొండల గుసగుసలలో కరిగిపోతు
నేల నేలంతా పరుచుకుని వేడి నింపుకుంటూ
పచ్చిక పైరులతో ఆడుతూ పాడుతూ
ప్రకృతితల్లి  ఒడిలో నిదురోయే వరకే అని

తన కళ్ళలో నీళ్ళుఓదార్పు పూలై
నా పైన కురిపించి నను హత్తుకుని
పిలవగానే నేను నీతో ఉంటానని
తన ప్రేమతో తడిపి  ఒంటరితనాన్ని
పంచుకుని నేస్తమయింది

Friday, July 13, 2012

నీ పరిచయం

పర్వతాల తనువును పై నుంచి స్పృశిస్తూ 
నది జారుతునట్టు నీ పరిచయం 

కనిపిస్తూ కనిపించకుండా 
వినిపిస్తూ వినిపించకుండా 
ఆరు బయట వెన్నెల్లో
రాత్రి పది గంటలకు
రేడియో తరంగాలతో నువ్వు
మెల్లిగా నన్ను తాకుతూ వినిపిస్తున్న
ఊహలు గుస గుస లాడే అంటూ
నా చుట్టూ అల్లుకున్న మల్లెల సుగంధం

ఆకాశం చేయి మడిచి పడుకుని
చంద్రునికి తలవాల్చుకోమని ఇచ్చిన స్థలం
కబురులన్ని గుబురుగా మనసుని కప్పి
గిలిగింతలు పెట్టే క్షణం

నాలో శ్వాసవై చేరావో
ఆశవై మొలకెత్తావో
నీ తలపుల వేడికే గుండె తట్టుకోలేక
మరుగుతున్న రక్తాన్ని కవితలై గుప్పుతుంది .


--{@ by -Mercy Margaret (13/7/2012)@}--

Thursday, July 12, 2012

ఆమె అతను

ఆమె : శ్వాస నిశ్వాసల పోటి ... 
గెలుపు మాత్రం నాలో దాగిన నీది 

అతను :రెండు శ్వాసల సుగంధం ఒకటైతే పోదా ఓటమి గెలుపుల రూపం.. పోదా స్వేదంలో కరిగిన దూరం.. నీది నాది కాని . . నూతన సవ్వడి నిర్వచించే నవ నాడి 

ఆమె : స్వేదపు దారులు వెతుకుతు పరిమళా నాస్వదించి మర్చిపోయా ..సమాధానాల వేట ఎలా చేయను అని

అతను :ఉన్నావా నా తలగడలో దాగిపోయవా శ్వాసవై

ఆమె : దాగిపోయి చెవిలో గుస గుస లాడుతున్న వినిపించానా ?

అతను :ఈ వేడి నీ శ్వాస దేనా కరిగిస్తోంది

ఆమె :స్వేదంలో చల్లదనం భయపడుతుంటే దైర్యం చెప్పాలే

అతను: ఊ
మాటలు భలే నేర్చావే ?

ఆమె : సాంగత్య దోషమే కదా.. ఓటమి ఒప్పుకోలు పత్రం పై సంతకం చేయండి

అతను :కలిపిన గోరు ముద్ద తినిపిస్తూ .. చాలు చాలు ఇవ్వాల్టి గెలుపు నీదేలే అని నవ్వు చుక్క సంభాషణకు ...♥

--{@ BY- mercy @}- (12/7/2012) @}--

Tuesday, July 10, 2012

మిస్డ్ కాల్ 
------------
ఏంటి గుండె  ఉమ్మేసింది
నా  వాలిడిటి ఎక్స్పైర్  అయిందా ?

కొన్ని పరిచయాల గాయాలు అలాగే వున్నాయి 
కాని ..
మానిపోయే గాయం కన్నా ఏడ్పిస్తూ ఎక్కిరించే
వాతల అంకెలని చూస్తే
మళ్ళీ మళ్ళీఅస్తమించమని 
బలవంతంగా నన్ను  సముద్రంలోకి
విసిరి కొడుతూ ఆడుకోవద్దని
విన్నవిస్తూ మనసు తివాచి పరిచా 

ఇప్పుడు 
నా పిలుపు ఏడుస్తుంది
ఎందుకు జీవితకాలం  దూరం  చేసావని ?

ఏ అరణ్యంలో దాక్కున్నావ్
నా మనసు కుడా చేరలేని ప్రదేశమా?
ఏ ఎడారిలో ఇసుక దిబ్బ వయ్యావ్?
నీ అడుగుల జాడలు తుడిచేసి దాక్కున్నావ్
నా పాదాలు నిను చేరకుండా

కాలం దోసిటిలో పట్టుకున్నా
బొట్టు బొట్టుగాదారులెతుక్కుని 
మరీ జారి పోతుంది
ఎం చేయను ?

మిస్డ్ కాల్స్ లా మిగిలిపోయే నన్ను
ఎప్పుడో ఒకప్పుడు నీ చూపు తడుముతుందని
తిరిగి స్పందించేంతలో నిజంగానే నేను
నీ గుండె అర నుంచి
బయట పడేసే సిమ్ కార్డునయిపోతానని
భయం

అందుకే జీవితమే మిస్ అవుతున్నా
నా పిలుపుకి నువ్ స్పందించేంత వరకు
నీ గుండెను  తెరిచే అంకెలని వల్లే వేస్తూ
నీ గడప దగ్గరే
తలుపు తెరిచే వరకు తడుతూనే ఉంటా..




Sunday, July 8, 2012

మరణం కనిపిస్తే


ఎవరికైనా మరణం కనిపిస్తే
కబురుపెడ్తారా
ఊపిరి ఆవిరై కొండెక్కేలోపు బంధించి
చెంప చెల్లు మనిపించాలని ఉంది

ఒక్కొక్కరినిగా తన కాళ్ళతో
గద్దలా "నా " అనే బంధాలను తన్నుకు పోతూ
ఎక్కడ తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటుందో
అడిగి ,
దాని కళ్ళను పీక్కొని వెళ్లి "నా" వాళ్ళని
చూడాలని ఉంది

కడుపు కోతలోంచి పుట్టే కన్నీళ్ళ నదులు
గుండె బ్రద్దలయి ఉసురు తీస్తూ ఎగిసే లావా
వేడి శెగలు
ఎండిపోతున్న గొంతులు అవిసిపోయెంత
వినవస్తున్న ఆక్రందనలన్నీ
ఉప్పెనై ముంచి ఉతికేయాలని కసిగా చూస్తుంటే

శబ్దం నుంచి నిశబ్ధానికి అది ప్రయాణించే
జాడలు కనిపెట్టి ఉరితీయాలనుంది

తిరిగొస్తాయా ?
జ్ఞాపకాలుగా మిగిలిన జీవచ్చవాలు ఊపిరిపోసుకొని
చేతులు కలిపిన స్నేహాలు ,
పారాణి ఆరని పాదాలు
గోరుముద్ధలతో అమ్మ ముచ్చట్లు
నాన్నతో ఉప్పు బస్తాల ఆటలు
వర్షంతో నన్ను చుట్టుకు పోయే మట్టివాసనలు
నుదుటిపై వెచ్చగా నా వాళ్ళు పెట్టిన ఆత్మీయ ముద్దులు
కాలపు భూమిలో పాతిపెట్టిన ప్రతి జ్ఞాపకాన్ని
త్రవ్వుకుని ప్రాణం పోస్తూ వెళ్ళేదెలాగు

మరణపు గొంతు నులిమి ,ఊపిరి లాగి
నా జ్ఞాపకాల పాదాల క్రింద పాతేయాలనుంది

ఎవరికైనా మరణం కనిపిస్తే
కబురుపెడ్తారా ?
ఊపిరి ఆవిరై కొండెక్కేలోపు బంధించి
చెంప చెల్లు మనిపించాలని ఉంది


--{@ By -Mercy Margaret (8/7/2012 ) @}

Friday, July 6, 2012

సంధ్యారాగం

నేనిక్కడే నీ కోసం ఎదురు చూస్తూ 
హరివిల్లులోని రంగు రంగుల పరదా వెనక 
అప్పుడెప్పుడో 
ఉదయపు రాగం పాడుతుంటే విని 
నీకోసం బయల్దేరి వచ్చా 
సంధ్యారాగం పాడే ఆ గొంతులో 
నీ రాకకు సూచనలే కనబడవే ?

గుమ్మంలో నీ రాకకై ఎదురుచూస్తూ 
నిలబడి 
కాళ్ళు నా మీద విసుగు ప్రదర్శిస్తున్నా 
నీళ్ళు నింపుకొని వాపుల బరువు భరిస్తున్నా 
సర్ది చెప్తూ 
ఆత్రుత అడుగంటకుండా .. నిరీక్షణ పొంగారకుండా 
కళ్ళకి నీ ప్రేమ తేనెల రుచి చూపిస్తూ 
బుజ్జగిస్తున్నా 

ఒక్కసారి వచ్చి పోరాదు 
విడి విడిగా కౌగిలింతల కలివిడికై 
వడి వడిగా అంచులవరకు పరవసంతో 
నను నింపేందుకు 
చినుకుల మువ్వల అలికిడి
చెవుల చేరేదాక ..
మళ్ళీ వర్షించే వరకు..

మూగ నిట్టూర్పులు పాడే 
గుండె సడి నిన్ను చేరేదెలా ??

Thursday, July 5, 2012

మాటల కుంపటిని

నీ మాటల కుంపటిని రగిలించి 
మనసు చలి కాచుకుంటూ
ఊహల జలపాతంలో తడిసి
నీ అడుగుల తడికి అంటుకుపోయే
మంటినవుతూ...

బొట్టు బొట్టుగా కారే భావాన్ని
దోసిళ్ళలో ఒడిసిపట్టి
ఈ కాగితంపై పోస్తూ
అక్షరాలన్నీ జతకూడి నీలా
రూపుదాల్చుతుంటే చూస్తూ ...

టప  టప మని రెక్కల శబ్దం
నిట్టూరుస్తుంటే వింటూ
ఒంటరితనం ఎగిరే ప్రయత్నం చేస్తుంటే
నా వెన్నంటే  నిల్చుని సన్నగా నువ్వు
విసిరే నవ్వులు చూస్తూ...

ఎంతటి ఇంద్రజాలం నేర్చావో  ?

భాషేరాని  నా మనసుతో మాట్లాడిస్తూ 
నన్ను కమ్ముకొని కౌగిలించుకున్న 
తొలి అక్షరం నువ్వైతే చూస్తున్నా 

Sunday, July 1, 2012

చిదిమేసిన జ్ఞాపకం

నిలువ చేస్తూ వచ్చిన నీ మాటల విత్తనాలు 
కాలం దొంగిలించిందని తెలిసినా 
నువ్వు నా నీడని అసహ్యించుకున్నావని 
తెలిసి ,సమయాన్నికూడా ఏమనలేదు 
అవసరమైతే ప్రాణాన్ని కుడా దోచేసుకోమన్నా 

పిల్ల కాలువనే లోకమని ఆనందంగా
ఉన్నా.. ఇంత కాలం 
సముద్రం వరకు తీసుకొచ్చి 
నీ జత వెతుక్కొన్ని 
ఒంటరితనానికి నన్ను ఎరగా వేస్తావనుకోలేదు 
నీ సంతోషం కోసం ప్రాణమే ఇవ్వాలనుకున్నా 

నువ్వు చిదిమేసిన జ్ఞాపకాలని 
హృదయ్యన్ని త్రవ్వి పాతి పెట్టా 
నాలో నీ ప్రేమని నువ్వు చంపేసినా 
ఆ ఆవిరైన ప్రేమ 
కంటి పొరలను నింపి వర్షించి 
హృదయాన్ని తడిపింది  అంతే 
మొలకెత్తిన నీ జ్ఞాపకాలు 
నువ్వు ఇంకా నాలో సజీవంగానే ఉన్నావని 
నన్ను చూస్తూ జాలిపడుతున్నాయి 
నువ్వు లేని నాకు తోడునిస్తూ  ఆయువుగా