Friday, July 6, 2012

సంధ్యారాగం

నేనిక్కడే నీ కోసం ఎదురు చూస్తూ 
హరివిల్లులోని రంగు రంగుల పరదా వెనక 
అప్పుడెప్పుడో 
ఉదయపు రాగం పాడుతుంటే విని 
నీకోసం బయల్దేరి వచ్చా 
సంధ్యారాగం పాడే ఆ గొంతులో 
నీ రాకకు సూచనలే కనబడవే ?

గుమ్మంలో నీ రాకకై ఎదురుచూస్తూ 
నిలబడి 
కాళ్ళు నా మీద విసుగు ప్రదర్శిస్తున్నా 
నీళ్ళు నింపుకొని వాపుల బరువు భరిస్తున్నా 
సర్ది చెప్తూ 
ఆత్రుత అడుగంటకుండా .. నిరీక్షణ పొంగారకుండా 
కళ్ళకి నీ ప్రేమ తేనెల రుచి చూపిస్తూ 
బుజ్జగిస్తున్నా 

ఒక్కసారి వచ్చి పోరాదు 
విడి విడిగా కౌగిలింతల కలివిడికై 
వడి వడిగా అంచులవరకు పరవసంతో 
నను నింపేందుకు 
చినుకుల మువ్వల అలికిడి
చెవుల చేరేదాక ..
మళ్ళీ వర్షించే వరకు..

మూగ నిట్టూర్పులు పాడే 
గుండె సడి నిన్ను చేరేదెలా ??