Monday, July 16, 2012

కాఫీ కప్పుకేం తెలుసు


కాఫీ కప్పుకేం తెలుసు 
మౌనం మాటున జరుగుతున్న సంభాషణ 

********
చూపులతో చూపులకు 
మాటలతో మాటలకు 
శ్వాసతో శ్వాసకు 
ఇవ్వాలే జరిగిన పరిచయం  

అటు తను 
వర్షించక ముందు మేఘం లా 
ఇటుగా నేను 
స్వాతి చినుకుకై చూస్తున్న ముత్యపుచిప్పలా

తెలియని సంబంధాన్నీ 
భగీరద ప్రయత్నంలా
చేయి గీతల్లోనో ..నుదుటి రాతల్లోనో   
దాక్కున్న మనసుల్ని    
విధి తపస్సుచేసి  కలిపినట్టు 

ఆ చూపుల్లో చల్లదనం 
తన కళ్ళలో ఒదిగి పోయి 
అక్కడే ఉండమంటూ ..
ఆ నవ్వులో నిష్కల్మషం 
 పెదాలతో ఒప్పందం చేసుకొని 
తన గుండెపై తొలకరి చినుకులై 
వర్షించి చల్లబడమంటూ.

వేడి నిట్టూర్పులు తనువును 
తాకుతూ 
భావాలతో భావాల పరిచయం చేస్తుంటే 
తగిలి తగలని 
అంటి అంటకుండా ఇచ్చిన కర చాలనం 
హృదయ చాలనమే జరిపేసినట్టు 
తెలియని సరికొత్త పరిమళాన్ని 
మనసు మస్తిష్కానికి చేరవేస్తుంటే  

వేల క్షణాలే అవసరం లేదంటూ 
యుగ యుగాల నిరీక్షణ వృధా అనిపిస్తూ 
ఆ కొన్ని క్షణాల కలయిక 
గుండె నిండా నింపుకుని 
ఒక జీవిత కాల జ్ఞాపకంగా 
మిగిలిపోయే ఊపిరై పోవాలనిపించింది 
అర్ధం కాక చూస్తున్న కాఫీ కప్పు సాక్షిగా ...