Sunday, July 22, 2012

నిలబడు


భూమిని ఊహల దారంతో చుట్టి 
ఉత్తరం నుండి దక్షిణానికి 
తూరుపు పడమరలను చేతుల్లో 
బంధించి 
విరుస్తున్న ఒల్లునుంచి సొమరితన్నాన్ని తరిమి 
నిలబడు నిలబడు 
ఈ రోజు నీదే అని 

సముద్రాల అడుగుకెళ్ళి 
నునుపు రాళ్ళు ఏరుకొని 
రకరకాల చేపలతో
దొంగా పోలిసు ఆటలడి 
అలసినప్పుడు హిమాలయాల్లో 
మంచుని కరిగించి నీళ్ళు తాగి 
ఎగురుతుండు ఎగురుతుండు 
ఈ రోజు నీదెనని 

ఆకాశపు అంచులు తాకి 
అటుఇటు కొంచెం కోసుకుని  
మేఘాలన్ని కుప్పనూర్చి 
పిచ్చుక గూళ్ళు కట్టుకొని 
నక్షత్రాల్ని ఏరుకోని ఒళ్ళోనింపుకొని 
చేతిగాజులకు కాలిపట్టీలకు  
వాటి తళుకుళు తగిలించుకుని
నడుస్తూఉండు నడుస్తూఉండు 
ఇంకేదో చేసేదుంది ఈ రోజని 

నీటిని ఆవిరి చేసి తనలో ఏకం 
చేసుకొనే  ఆ సూర్యతాపంలో దూరి 
చినుకు చినుకులో హరివిల్లును 
ఆవిష్కరిస్తూ  
నెమలి పించంలో అంటుకొని 
సీతాకొకకు రంగులద్ది 
మట్టికి వాసన పూసి 
పచ్చని రంగుల ముద్దలు 
అడవులకిచ్చి 
వర్షపు చినుకుల్లో కలిసి  
ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఉండు 
ఈ రోజు జీవితం నిన్ను ప్రేమిస్తుందని 

ఓటమిని ముక్కలు చేసి ఔషదాన్ని పిండి 
చతికిలపడ్డ పట్టుదలకి 
వైద్యం చేసుకొని 
పాదలకు ఉత్సాహపు పారని పూసుకొని 
అపజయాన్ని కాలి జోళ్ళు చేసుకొని 
గమ్యం వైపు 
పరుగెడుతూ పరుగెడుతునే ఉండు 
జీవితంలో ఈ రోజు తప్ప 
బ్రతకును గెలవడానికి ఇంకో రోజు లేదని 
by -mercy  margaret (22/7/2012)