1
అక్కడ ..ఇక్కడ ..
కొన్ని ఆలోచనలు తెచ్చి
మనసుకు అంటు కడతావ్
వాటితో రమించి మనసు అవే
చిగురింపచేస్తుంది
2.
చిగురించిన ఆలోచనలు
లేలేత రంగుల్లో బోసి నవ్వులు నవ్వుతూ
నాలోలో గిలిగింతలు పెడుతుంటే
నువ్వేమో
గాలి గుప్పిట పట్టి జ్ఞాపకాన్ని కడుగుతూ
ఏవో తెలియని సంభాషణలే చేస్తుంటావ్
3.
నీ హృదయాన్ని
ఎన్ని గదులున్నాయో తెరిచి చూసి
నా ఆలోచనలతో సహా
మనసుని ఎక్కడ ప్రతిష్టించాలా ? అని
నువ్వు పడే తపన
నన్ను నేలని చెమ్మ చేసేలా
నీ చూపుల సంయోగంలో
కన్నీటి ఆహరం సిద్ధం చేసుకునేలా చేస్తుంది
4.
అప్పుడప్పుడు
కూని రాగాలు నీ స్వరంలో ప్రవహిస్తూ వస్తుంటాయా
అలా అవి
నా మనసు వేర్లని తాకి మరిచిన కొన్ని జ్ఞాపకాలను
మళ్ళీ నాలో ఉత్పత్తి చేస్తూ
మనసు రంగును మార్చుతుంది
****
5.
ఏమంటున్నావ్?
సరే నీవన్నట్టే రేపటి కోసం ఇంకో చిగురును కనే ప్రయత్నం
చేస్తాలే
అప్పటివరకు శ్వాసతో నాకు కావాలిగా
ఉండరాదు .. !! ?
By --Mercy Margaret ------ (29 /9/2012 ) ---------------