సమాధిపై అక్షరాలు
మాట్లాడుతున్నాయి
గుస గుసగా నీ లాగే
కళ్ళని పొడుస్తూ
తడి ఆరని నా చెంపలని
తుడిచే ప్రయత్నంలో
ఓడిపోయి
నువ్వు
ఆ అక్షరాలలోంచి చూస్తూ
చెదిరిన నా ముంగురుల్ని
గాలిలా తాకే ప్రయత్నం చేస్తూ
కన్నీళ్ళను నీలో
కలుపుకుంటూ
భారమనుకుని వదిలేస్తున్న
క్షణాల్ని
గడ్డివాసనతో నాలోకి
తిరిగి నింపుతూ
ఖాళీగా నిందిస్తున్న
నా కౌగిలి మాటల్ని
ఆ దీపపు వెలుగులో
దహించుకుంటూ నను దీనంగా
చూస్తూ
నీపై సరదా పడ్డ మరణం
నా గుండెకి
వేస్తూనే ఉంది ఉరిశిక్ష
ప్రతి క్షణం
నీ గురుతుల వాసన
త్రాడుని పేనుతూ
నువ్వేమో
ఒంటరిగా ఇక్కడ
ఇల్లు కట్టుక్కున్నావ్
నువ్వు లేని ఇల్లుని
నాకు సమాధిగా
చేసావ్ ..