Sunday, August 26, 2012

ఒంటరి గాలి



ఆ గాలికి ఏ భావాలు లేవు 

అనుభవాలు తప్ప 

అనుభవాల కొలతల్లో భావాలను 

వెతుకులాడటం  తప్ప 

భావాల చెమ్మ ఘాడత 

కొలిచే ప్రయత్నంలో
అణువణువులుగా విడిపోవడంతప్ప
ఆ అణువుల్లో కూడా ఒకటిగా 

ముడిపడి ఉండాలనుకోవడం తప్ప 


ఒంటరిగా గుండెల్లో చేరి 

మనసు పొరలను తాకి 

నిదురోయే జ్ఞాపకాల కలల్లో 

దొంగలా 

ఏవేవో రహస్యాలని తడిమి రావడం 

తప్ప 

రహస్యాల గుస గుసలు 

తన నుంచి చేరేసినా  

మూగ గానే ఉండి మూలల్లో 

స్థానాన్నివెతుక్కోవడం తప్ప 

ఆ గాలికి ఏ భావాలూ లేవు 

మట్టితో మమేకమైనా 

మరుపును   చెంతనే ఉంచుకోవడం తప్ప 

నీటిలో అణువుల్ని కౌగిలించుకున్నా
వాటి నిట్టుర్పులను కూడా 

గ్రహించలేనంత 

అపరిచితగా ప్రవర్తించడం తప్ప 


మేఘాల కురులు ముడివేస్తూ 

వాటి చిలిపిదనం అల్లరి పెట్టినా 

తనకేం సంబంధం లేనట్టు 

ఆ వైపు చూడక నీల్గుతూ 

ప్రేమికుల కౌగిలింతల్లో దూరినా 

సిగ్గు పడకుండా తనకు తానూ 

డోంట్  కేర్ అనుకోవడం తప్ప


ఆ గాలికి ఏ భావాలు లేవు 


పిల్లన గ్రోవి తనువును మృదువుగా 

స్పృశించినా 

దాని మనసును అర్ధం చేసుకోకుండా 

ఉండడం తప్ప 

మనసు నిండా శ్వాసగా నింపుకున్న 

అక్కడ నిలువలేక బయటికొచ్చే వరకు 

పరగులు తీయడం తప్ప 

ఎందుకని నిలదీస్తే 


భావాలన్నీ ప్రేమకి రాసిచ్చి 

మోసపోయిన గుండెని 

గతంలో సమాది చేసి 

ఆకృతి లేకుండా 

ఏ ఆలోచనల కొక్కానికి 

తనకు తానే చిక్కకుండా తిరుగుతునట్టు 

సమాధానం ఇస్తూ అంది 

అందుకే 

ఈ గాలికి ఏ భావాలు లేవు

నన్ను నేను మరిచిపోవడం తప్ప