Monday, August 13, 2012

సగం కాలిన చిత్తు కాగితం

అక్కడేదో

సగం కాలిన చిత్తు కాగితం 
తీసి చూస్తే 
చివరిగా మిగిలిఉన్న 
అక్షరాలు 
-"నిన్ను మరువలేక 
చూడలేక
చాలిస్తున్నా .....తనువు--
నీకైవస్తున్నా నీ వెన--
నా ప్రి--"
సగం కాలిన అక్షరాల్లాగే
ఎవరిదో దేహం
ఇప్పుడిప్పుడే
ఆ కట్టెలపై కాలబెట్టినట్టున్నారు
కాలుతున్న పొగల్లోంచి
ఆ దేహం
తనలో నింపుకున్న
జ్ఞాపకాలు
తెరలు తెరలుగా
అనంతాల్లోకి
రోదిస్తూ
చుట్టుపక్కల వారికి
అర్ధమయ్యేలా కళ్ళకి
మంట పెట్టి మరీ
కన్నీళ్ళను ఒంపుకుని
తడిసి పోతున్నాయి
ఆ ప్రక్కన
తండ్రి మూగ రోదన
ఏ కలెక్టరో అవుతుందని
ఆశపడి ఇంటికి
దూరంగా పెట్టి చదివిస్తుంటే
ఆశలపల్లకిని కాదని
చావు పల్లకినెక్కి
ఇన్నేళ్ళ ప్రేమకన్నా
ఆర్నెల్ల ప్రేమలో
తమ ప్రేమనే గడ్డిపరకగా
చూసేంత కొలతలెలా
కొలిచావమ్మా
చిన్నప్పుడు గుండెలపై తన్నిన
తన్నులే
ఇప్పుడు నా గురుతులై
పోవాలని
నీ దృష్టిలో
గొప్పదైన ప్రేమ
మాకు
ఆజన్మాంతపు
నరకపు శోకం మిగిలేలా
జీవితకాల శిక్ష వేసెలా
నిన్ను ఒప్పింప చేసిన
గొప్ప ప్రేమ
మేము
నీపై చూపిన ప్రేమనే
లోకం చులకనగా చూసేలా
మాకు నరకం ఇచ్చి
నీ స్వర్గం వెతుకుంటూ
వెళ్ళావా ?
ఆ తండ్రి రోదన చూస్తూ
పొగల్లోంచి
సుడులు సుడులుగా వచ్చి
ఆ కన్నీళ్ళు
తుడుస్తూ
చివరి సారిగా తన చెంపను
ముట్టుకుందామనుకుందా
అంతే
వర్షం ఆ అవకాశం తను
తీసుకొని
ఇకెన్నట్టికి తన వాళ్ళని
చూసుకోలేనంత
దూర తీరాలకి కర్కషంగా
లాక్కెల్లింది
మరి పొందాలనుకున్న
ప్రేమ ఏమయ్యింది ?
by-Mercy Margaret (13/8/2012)
.......................................................