Sunday, August 26, 2012

లెక్క చూసుకున్నా ఇవ్వాల్టి ప్రేమని


లెక్క చూసుకున్నా
ఇవ్వాల్టికి
ఎంత ప్రేమ వెనకేసుకున్నాఅని

ఆవర్జా ముగిసినా

ఇంకా ఎదో
అస్పష్టపు లెక్క
అంకెల గీతలు దాటి
రేపటికై లాభాల
మిగుళ్ళు చూడడానికి
నష్ట పోయిన ప్రేమ
నటనకి అమ్ముడుపోయిన ప్రేమల్ని
బేరీజు వేసుకొని
తెలివి తెచ్చుకోడానికి

చేతిలో నిలుపుకుకున్న ప్రేమ

ఎంతో
రేపటికి తీసుకెళ్లే, మోసుకెళ్లే
ప్రేమెంతో
ఖర్చు చేసిన
ప్రేమెంతో అని
హృదయంలోని ఎడమవైపు
గదుల్ని డెబిట్ అంటూ
ఖాళీ తనంతో ఒంపేస్తూ
ప్రశ్నల మరకలతో
నింపేస్తుంటే

ఆ వైపుకు ఈ వైపుకు

సరి సమానం కాక
క్రెడిట్ అయ్యె ప్రేమ లేక
హృదయం పై ప్రశ్నలని
తుడిచేసే, కొట్టేసే ప్రేమ
డిపాజిట్ అవ్వక
ఇన్ని రోజులూ
లోటు చూపించింది

ఇవ్వాలే

నాకు తెలియని
జీవితాంతం సరిపోయే
ప్రేమ మొత్తాన్ని
క్రెడిట్ చేసారు
అది నీవేనా?

* * * * *


ఒక్కసారిగా

నా ఆవర్జా తల క్రిందులయ్యింది
ఎప్పూడూ రేపటికోసం
నన్ను నేను ఖాళీ చేసుకునే
లోటు ప్రేమ
నుంచి
అందరికి పంచమని ఒకేసారి
ప్రేమే ప్రేమగా
తనని తాను నాకు దానమిచ్చింది

ఇప్పుడే ముగిసింది

ఈవ్వాల్టి లెక్క
ఆశా నిరాశల మధ్య
ధైర్యానికి పిరికితనానికి
గెలుపు ఓటముల మధ్య
నాణానికి రెండువైపులా నేనై

అటూ ఇటూ గా

సమానమవుతూ
అసమానతల్లో
ప్రేమనే చూస్తూ
నా అస్తిత్వాన్ని ప్రేమకొసమే
అప్పగించుకుని
తృప్తిని ప్రేమ భాషల
లెక్కలో మిగుల్చుకొని

వ్యాపారిని కాకపోయినా

తరహాననుసరించి నడుస్తున్న
మనసున్న మనిషిని
అంకెల్లో లెక్కలు చూపలేని
ప్రేమ పొంది ధనవంతున్ని  అని
తృప్తి కోసం ఆశపడే  మనసువాదిని