Sunday, September 30, 2012

మనసు మొక్క


1

అక్కడ ..ఇక్కడ ..
కొన్ని ఆలోచనలు తెచ్చి
మనసుకు అంటు కడతావ్


వాటితో రమించి మనసు అవే
చిగురింపచేస్తుంది

2.
చిగురించిన ఆలోచనలు
లేలేత రంగుల్లో బోసి నవ్వులు నవ్వుతూ
నాలోలో గిలిగింతలు పెడుతుంటే
నువ్వేమో
గాలి గుప్పిట పట్టి జ్ఞాపకాన్ని కడుగుతూ
ఏవో తెలియని సంభాషణలే చేస్తుంటావ్

3.
నీ హృదయాన్ని
ఎన్ని గదులున్నాయో తెరిచి చూసి
నా ఆలోచనలతో సహా
మనసుని ఎక్కడ ప్రతిష్టించాలా ? అని
నువ్వు పడే తపన
నన్ను నేలని చెమ్మ చేసేలా
నీ చూపుల సంయోగంలో
కన్నీటి ఆహరం సిద్ధం చేసుకునేలా చేస్తుంది

4.
అప్పుడప్పుడు
కూని రాగాలు నీ స్వరంలో ప్రవహిస్తూ వస్తుంటాయా
అలా అవి
నా మనసు వేర్లని తాకి మరిచిన కొన్ని జ్ఞాపకాలను
మళ్ళీ నాలో ఉత్పత్తి చేస్తూ
మనసు రంగును మార్చుతుంది

****
5.
ఏమంటున్నావ్?
సరే నీవన్నట్టే రేపటి కోసం ఇంకో చిగురును కనే ప్రయత్నం
చేస్తాలే
అప్పటివరకు శ్వాసతో నాకు కావాలిగా
ఉండరాదు .. !! ?
By --Mercy Margaret ------ (29 /9/2012 ) ---------------

తిరిగొచ్చిన వసంతం



నేలకి మొహం వేసి 

అంతా అయిపోయిందనుకుంటానా 
ఓటమిలోంచి గెలుపై వస్తావ్
ఎండిన నదిలా
గొంతు వెల్లకిలా పడుకుంటుందా ?!
చెవుల దారుల గుండా
మాటల ప్రవాహాన్ని పంపి
మళ్ళీ నీళ్ళ దుప్పట్టి
కప్పుత్తావ్
కళ్ళు అమావాస్య నింపుకొని
మూయలేక
ఇబ్బండిపెడుతుంటాయా
నీ చూపుల మతాబులు వెలిగించి
మళ్ళీ వెలుగు నింపుతావ్..
ఓటమి వెనకే కనబడతావ్
నా భుజాన్ని తడుతూ
అలసిపోయానని అనుకునే గుండెను
కౌగలించుకొని
మళ్ళీ ప్రయత్నాల పరికరాలు అందిస్తూ
ముందుకు నడిపిస్తావ్
ఇప్పుడనిపిస్తుంది
ఒంటరితనాన్ని
తెలియకుండానే తరిమి
ఎండిన అరణ్యాన మళ్ళీ వసంతం
మూటలు కట్టి తెచ్చావని
ఎటు చూసినా నీ పరిమళమే
వెదజల్లుతూ
నన్ను మళ్ళీ స్పందింప చేస్తున్నావని



మాటలన్నీ ఖాళీ అయి

by-Mercy Margaret (26/9/2012)

Tuesday, September 25, 2012

మిగిలిపోయిన దారం


1.చెత్త కుప్పలో పడవేయబోయితప్పి 
వాడిపోయాక
విసిరి పారేసిన పూలమాల
2.
దారం
స్నేహం మొదలు పెట్టి
పూలు వాడిపోయినా
తోడు విడువని
బంధం !!
3.
రంగు మారుతూ
ఊపిరి చివరి శ్వాస మెట్లు
ఎక్కుతూ
వదిలి వెళ్తున్న దారానికి ఏమని
వీడ్కోలు పలికాయో పూలు ?
4.
వాటి
గుస గుసలు వింటూ
గడ్డిపోచలు
కొంత ఊరట దారానికిచ్చినా
వాడి ,వీడి పోయిన పూలు లేక
ఇక అక్కడే ఎన్ని రోజులుండాలో ?
5.
పూలతో స్నేహం వళ్ళ
దారానికి గొప్ప తనమా ?
లేక
తనని తానూ మెలికలతో
తిప్పుకుంటూ దారం
వాటిని ఒక దగ్గర కూర్చడం
దారం గొప్ప తనమా?
6.
కాని
పూలతో స్నేహం చేసినందుకు
ఇంకా ఆ చెత్త కుప్పలో పూల
జ్ఞాపకాలతో
అలాగే మిగిలోపోయే దారం
కొందరిని అలాగే గుర్తు చేస్తూ...
7.
ఇలా
మిగిలిపోయిన ప్రశ్నల్లాగే
కొన్ని జ్ఞాపకాల
పెదవులతడి ఆర్పేయలేని
కిరణాల వర్షంలా ...

గడ్డిలో పడ్డ

Sunday, September 23, 2012

నువ్వు అడుగెయ్



ఒక వెలుగుకోసం ప్రమిద నిప్పుని ముద్దాడాలిఒక గమ్యాన్ని చేరడనికిచెట్టు ఫలం మంచిదయినందుకుఇంకొకరిని వెలిగించే పాదానికి చలనపు ఉత్సహం నింపాలి 
రాళ్ల దెబ్బలు ఆహ్వనించాలి
స్పూర్తితో వెలుతూ చీకటి అపహసించినా ఆ చిరునవ్వుతోనే తరిమెయాలి 

Saturday, September 22, 2012

నవ్వు-జీవం పోసే వేళ


ఆ నవ్వు వీస్తున్నప్పుడు 
మనసు చెక్కిలి ఎర్రబడి సిగ్గు బడితే 


ఆ నవ్వు ప్రవహిస్తునప్పుడు 
ఆ నవ్వు  వర్షిస్తున్నప్పుడు 
ఆ నవ్వు ఉదయించే వేళ 
గడవని క్షణాలు ఎన్నెన్నో 
ఎడబాటు చలిమంటలేసుకుంటూ 
ఇప్పుడు 
మిగిలిన చిహ్నాలను 
మళ్ళీ ఆ నవ్వు వీచి  
--మెర్సి  మార్గరెట్ 


తలపుల పాదాలు నడుస్తూ వెళ్లి 
తడిని అనుభవిస్తే 

ఆలోచనలు అరమోడ్పు లోచనాల్లో 
ముడుకొని  
లయించి పోతుంటే 

హృదయం నీ సంతకాల సేకరణ 
మొదలు పెడితే 

అటుఇటుగా చెదిరినవి 
ఒక్కచోట కుప్పనూర్చి 
గుర్తు చేసుకుంటూ 

గడిపిన  నేను ..

ఏమయిందో 
తెలియని హళ్ళీసకం   చుట్టుకెళ్ళి 
నాకు దూరం చేస్తే 

గుర్తుచేసుకుంటూ ఇప్పుడిలా 
నేను ఒక అవషేశమై మిగిలి ఉన్నా ..

జీవం పోసే వేళ కోసం 
నువ్వు లేని ప్రొద్దు తిరుగుడునై 

Friday, September 21, 2012

స్వాతంత్ర్యం కూడా బానిసే
గెలుపుకు.. 
అలుపుకు ..
ప్రేమకు..
కనబడని సంకెళ్లు 
నవ్వులుగా 
తొడుగుకుంటూ..
స్వేచ్చే అనుకొని 
పరిది నిర్ణయించుకుంటూ..


20sep2012
BY -mercy margaret :)

Tuesday, September 18, 2012

తనతో ఉన్న కాసేపు


తనతో
ఉన్న కాసేపు
సమయాన్ని తీగలుగా చుట్టి
మూలకు పడేసి
కనబడకుండా
వర్తమానపు గోనెసంచుల్లో నింపి
కుట్టేస్తే చాలు
అనిపిస్తూ  


మాటలన్ని
చీకటంతా
గాలినంతా
ఆ క్షణాల దగ్గరే
నన్ను నేను


బంతి పూల రెక్కల కింద
దాక్కుని
ఆ రంగుల్లో స్నానమాడి
తన పెదాలపై
అంటుకున్నట్టు
కనిపిస్తూ

ప్రవహమై
వెలుగులో కలుస్తూ
కను రెప్పలని
ఆ వెలుగు తరగలతో నింపి
తన కళ్ళలో
ఆ ప్రకాశాన్ని
మెరుస్తుంటే చూస్తూ

ఎక్కడికక్కడ ఆపి
తన స్వేదాన్ని తాకకుండా
చేసి
ఆ చెమ్మనుంచి సుగంధాన్ని
తీసి
నా గుండెలనిండా
తనుగా నింపుకుంటూ

ఆగిపోయా
అడుగు ముందుకేసే ధైర్యం చాలక
తనకు
ఈ రోజుకు
వీడ్కోలు చెప్పలేక

గతాన్ని జ్ఞాపకాల్ని కౌగలించుకొని
రేపటికి
తను వేసే
అడుగుల కింద
పచ్చగా పరుచుకొనే
గడ్డి తివాచి నవుతూ
ఆ పాదలని
సున్నితంగా
ముద్దాడటానికి ఎదురుచూస్తుంటా




ప్రేమ భిక్షగత్తే



ఎన్ని ప్రశ్నలో ఆ  వృక్షానికి
ఆకుల శబ్దంలో కలిసి
తన చెవులు కొరుకుతూ

అదేదో  దారిలో

ఓ మూలాన తనను
అనాధగా దురదృష్టానికి
అమ్మేసి వెళ్ళిన జీవితాన్ని
నిందిస్తూ
జాలి చూపులు, గోడు వింటూ
ఉన్నంతలో నీడ నివ్వడం తప్ప
ఏమి చేయలేక 

ప్రేమ బిక్షమెత్తుతూ వచ్చి

ఈ చెట్టు దగ్గరే ఆగిపోయి
హృదయానికి ,మనసుకి
కాళ్ళు పోగొట్టుకొని
సంవత్సరాలుగా  ఎదురుచూస్తున్న
తనను రోజూ  రాలుతున్న ఆకులతో
పలకరిస్తూ

పిచ్సిదన్నారు,పొగరన్నారు

అభాగ్యురాలని దొంగ జాలి నటించారు
మరి కొందరు
బలుపన్నారు మధంఎక్కిందన్నారు కొందరు
కాని ఏవి వినే ఓపిక లేక  ..

ఎండకు ఎండి

వర్షానికి తడిసి
ఆ చెట్టు కిందే ఇలా అన్నీ  కోల్పోయి
ఇంకా నిజమైన ప్రేమ
ఎవరో ఒకరు
భిక్షంగా వేయక పోరు
అని ఎదురు చూస్తున్న
ఆమె

-" ప్రేమ భిక్షగత్తే "


మీకు కాని కనిపిస్తే

చీత్కరించకండి
బిక్షమేయక  పోయినా పర్లేదు
ఎక్కిలి నవ్వులు నవ్వకండి
జాలి చూపే మనసు లేక పోయినా 
పర్లేదు
మాటల్ని ఖర్చు చేసుకోకుండా
పక్కగా వెళ్ళండి
-"మళ్ళీ మీ సంస్కారం మైలపడొచ్చు"

Monday, September 17, 2012

రక్తంలో మరుగుతున్నతెలంగాణ



నా చావు 
తెలంగాణ కోసం
జై తెలంగాణా "

అంటు 
ముగిస్తూ

అమ్మొచ్చింది 
-"ఇంత రేతిరి దాక 
అన్నం తినక సదువుకుంటే
ఎట్టా కొడుకా? 
ఈ సారి ఎప్పటి లాగే
మండలం అంతా ఇనిపించేట్టు
మార్కులు నా కొడుక్కి కాక 
ఎవరికొస్తాయ్ లే పట్టు " 
గింత అన్నం తిను
అంటూ 
ముద్దలు తినబెడుతూ

కళ్ళలో సుడి తిరిగే
కన్నీళ్ళను 
అన్నం ముద్దలతో లొలొపలే
మింగెస్తూ
తనని తాను 
సముదాయించుకుంటూ

పదకొండు దాటుతుంటే 
చెరువుగట్టుకై బయల్దేరుతుంటే

*******
-" ఇంకెన్ని రోజుల్లేవే
మన చిన్నొడు సదువైపోగానే
ఉద్యొగంల జేర్తడు 
గీ అప్పులు సప్పులన్ని దీరిపోతయి
నన్ను పెద్ద ఆస్పటళ్ల జూపెడ్తడు
నువ్వు గా యేడుపాపు "
అమ్మ కన్నీళ్ళు తుడుస్తూ
అయ్య

అడుగు వేయడానికి 
వీళ్లేకుండా ఎవరో 
కాళ్ళు రెండూ విరగొట్టి 
పక్కన పడేసినట్టు 
నన్ను ముద్దలా చుట్టి మూటకట్టినట్టు 
అక్కడే 
కులబడి పొయి తను

****
రక్తంలో మరుగుతున్న 
తెలంగణా 
అమ్మ ప్రేమ 
నాన్న ఆశలు 

ఇప్పుడు తను సైనికుడే
ఎవర్ని గెలిపించాలి 
కన్నీట్టి చుక్కలడిగే
ప్రశ్నల్ని చెంప పైనే 
తుడిచేస్తూ 

"చచ్చి తెలంగాణా కాదు 
చావగొట్టి తెలంగాణా" 
అని 
అతని డైరీ లో పెద్ద పెద్ద 
అక్షరాలే రాసుకొని 
మరో ప్రస్తానం వైపు
ఎర్రటి సంద్రంలా బయల్దేరాడు..



BY-Mercy Margaret (14sep2012)
-----------------------------------------------

Sunday, September 16, 2012

నల్ల మల్లెలు


ఇప్పుడే
విచ్చుకుంటున్న
నల్ల మల్లెలు


****

అస్తమిస్తున్న సూర్యుడు
ఆడుకోడానికొచ్చే
రేరాజుకు
సమయాన్ని
చేబదులిస్తున్నట్టు


కొండల్లోంచి

బురదమడుగుల్లోంచి
దారితప్పిన
రాణి వాసాల్లోంచి
రోడ్డు ప్రక్కన ఎవరో
నాటిన
అనామకంగా సంకరించిన
తీగల  నుంచి


మొగ్గళ్ళా  ఉన్నప్పుడే

ఎవరో తెంపి
నలిగిపోడానికే
కామపు  దారంతో
అల్లినట్టు  


వెలుగులో దాక్కుని

చీకటిలో
కనిపించే కళ్ళకు
అనేకానేక  చంద్రుళ్ళకు
ఒక్క పూటైనా
హృదయంలో
వసంతం పూయించడానికి
వాడిపోతూ
సుఖానికి కాటుక గుర్తవడానికి
ఇచ్చి పుచ్చుకునే
తాంబులమవుతూ


ఒక్కోరెమ్మగా దేహంతో

దూరమవుతున్న ఆత్మను
అనంత విశ్వంలోని
అద్వితీయ శక్తికి రాలిపొతూనే
అసహాయంగా
మొరపెడుతూ


మళ్ళీ జన్మంటూ ఉంటే

తెల్ల మల్లెల్లుగా
పుట్టించాలని
ప్రార్దిస్తూ
చేతి మణికట్టుకూ
మంచంపై
మలిన ముచ్చట్లకు
ఆ చంద్రుళ్ళ
చేతులలో 
వేడిపోతల  మధ్య
వాడి పోతూ


రోజూ

కడుపు రెండు నిమిషాలు
నవ్వడం కోసం
చివరి శ్వాసకి
వైద్యం చేసుకుంటూ




చస్తూ

బ్రతుకుతున్నాయి


కూతలు వాతలు తప్ప

పాపమో పుణ్యమో 
లెక్కలెరుగని
నల్ల మల్లెలు


by -మెర్సి మార్గరెట్





Friday, September 14, 2012

సిరి సిరిమువ్వలు



గోడకీ పగుల్లొస్తాయి

అందులోంచీ మొక్కలొస్తాయి... 

ఆ గుండెలాగే...

****
ఎప్పుడో వచ్చే
ఋతుపవనం
ఇటుగా వీస్తున్న
నీ జ్ఞాపకం
****
చీల్చేంత వరకు
ఓర్చుకున్నా
ఇప్పుడు
ధ్వనిస్తూఅయినా
నన్ను మాట్లాడనీ
****
వెలుగు చీకటికి
మధ్య దారి
తన మౌనం...
****
కళ్లలో సంతోషం
కాలువలు
చేస్కొని
బయటికొచ్చింది
--"కన్నీళ్లంటావేం?
BY-Mercy Margaret (13/9/2012)



Thursday, September 6, 2012

నాలో నాకై ఆకలి

 llనాలో నాకై ఆకలిl

--------------------

ఆకలి
తిమ్మిరెక్కిన వేళ్ళకి
హృదయాన్ని అర్ధం చేసుకొని
కాగితంపై సిరా పారని పూసుకొని
కాలమై నృత్యం చేస్తూ
ఏదో రాయాలని
ఆకలి
రక్తాన్ని మరిగించుకునే గుండెకి
ప్రతీ  స్పందనని
రక్తంలోని అరుణ వర్ణంలో ముంచి
గుండె చప్పుళ్ల నాదంలో
హరివిల్లు లాంటి భావావేశాలన్నింటితో
రక్త వర్ణమయ్యే వరకు
రమించాలని
ఆకలి
కోరికల సంద్రమైన మనసుకి
త్సునామిలా చెలరేగుతున్న ఊసులకి
ఆటు పోటుల మధ్య ఆవిరవుతూ
స్వేదంలో కలిసి బయటికెగిసినా
తనువంతా మేఘంలా మార్చుకుని
మళ్ళీ తిరిగి నింపుకోవాలని
ఆకలి
ఎదురు చూస్తున్న కళ్ళకి
తనువంతా వసంతమై పులకరిస్తూ
లేలేత చిగురుల ఆలాపనలో
మొగ్గలా  మ్రోవిలా
ప్రేమగా మారి తను ఇటు నడిచి వస్తే
జన్మ జన్మల తృప్తి పొందేలా
కళ్ళ నిండా తినేయాలని
ఆకలి
నాలో నాకై
నన్ను నేను
పరిస్థితుల దాహం తీర్చడానికి
తోడేసుకుంటూ
నేనైన  ఎండిన  చెలమలో
తిరిగి
ఉపద్రవమై ఉద్యమమై
పొరలు పొరలుగా ఉషస్సునై
ఉదయిస్తూ
నన్నే పోగుచేసుకోవాలని
నాలో నేను
ఎందరెందరో అయి
అనేకమై అనంతమై
విశ్వజనీనమవ్వాలని
    

చెదురుతున్న చిత్రం




ముఖం తడుముతున్న గాలికి 
హృదయపు కాన్వాస్ పై 
నీ చిత్రం 
చెదురుతున్నట్టు
కనిపించిందట


ఎన్నెన్నో కలల రంగులు

పులిమి 
ఊహలన్నీ ఊసులన్నీ
సమపాళ్ళలో కలిపి
మనసునే కుంచెగా మార్చి
చిత్రించుకున్నా 
ఎంతో పవిత్రంగా మరి 
ఏం చేయను ?


గాలి 

చెవులలో చేరి
ఏవో కుశల ప్రశ్నలడిగి 
హృదయాన్ని ఎందుకు 
చేరిందో 
తెలియదు కాని
కదులుతున్న నీ రూపం
ఏదో చెప్పాలనుకుంటునట్టు
నాకు 
చెప్పకనే చెప్పింది


రోదిస్తున్న 

నీ చిత్రంకన్నీళ్లు 
నా ప్రేమ రంగులని 
చెరిపేసుకుంటూ 
తనకు తానే రూపం కోల్పొతుంటే
చూడలేక 
నా కళ్లు కూడా 
నదులకు స్థానాలయ్యాయి


కారణం ఏంటని

దాన్నే అడిగా !?


మనసు మరో దారి వైపు

మళ్ళింది 
ఏం చేయను ?
అని 
సమాదానం ఇచ్చింది
కొత్త రంగులెత్తుక్కుంటుందట..


అందుకే

కన్నీళ్లతో 
కడిగేసుకుంటున్నా 
నాకు కొంచెం
దైర్యం చెప్పరూ..!!
(ఎవరిదో కధ విన్నక ఏం చెప్పలో అర్ధం కాక రాసుకున్న మాటలు )


Tuesday, September 4, 2012

'స' కి బదులు 'చ'



సదువు సదువు
అన్న మాటని దాటుకేల్లాలని 
'స' కి బదులు 'చ' ని 
నాలుకకి 
కుట్టుకోవాలని  
చాల ప్రయత్నమే చేశ్నా 
ఏం  లాభం 

కుండ ఎక్కడ మట్టితో 
తయారయిందో 
ఆ మట్టిరుచే 
నీళ్ళ కొస్తుందిగా   
నా నాలుకకి తెలంగాణా 
అంటుకొని పోయింది 
కాదు కాదు 
తెలంగాణా నా నాలుకయ్యింది

మొదటి సారి రుచి చూసిన 
అమ్మ పాల రుచయ్యింది 

Sunday, September 2, 2012

అక్షర రెక్కల శబ్ధం



ఏంటి ఈ శబ్ధం?


అక్షరాలు రెక్కలు విదిలిస్తూ

ఎటో ఎగిరి వెళ్ళే
ప్రయత్నం చేస్తున్నాయి


ఎటు?



కవి

ఆలోచనాకాశంలోకి
అతడి భావాల సంద్రం లోకి
మనసు వృక్షం పై వ్రాలి
గుండె తడిలో తడిసి
గొంతు గూటిలో మాటల జత కట్టి
వ్రేళ్ల దారుల్లో ప్రయానించి
కాగితపు మైదానం పై
నడుస్తూ
కన్నీటిని సంతోషాన్ని
తడిమి చూస్తూ
ఎగురుతూ వెళ్ళేందుకు
సిద్దపడుతున్నాయి ..


అక్షరాలు

గొంతును సవరించుకుంటున్నాయి
ఎందుకని  ?


పాటలా, పద్యంలా

కధలా ,మాటలా
స్వరాల జలపాతంలో కలిసి
నీటి బిందువులన్నీ రాశిగా ఏకమైనట్టు
రాగమై ఆలపించే ఆ స్వరాల అల్లికలో
ఒదిగిపోతూ
ఆ గొంతుకల్ని భావవేశాల పరిమితులకి
తగ్గట్టు మలుచుకుంటూ


పిల్లాడి చదువుకు పద్యమై

అక్షరాల ఆస్తులై
విప్లవ పాటగా జ్వలితమై
అమ్మ పాటగా లాలనై
ప్రేమికుల ప్రేమ లేఖల్లో పూలై
కౌగిలింతలై
దేవుడి ముందు అర్చనై అభ్యర్దనై
సర్దుకుంటూ హడావిడి చేస్తున్నాయి


అక్షరాలు

ఏడుస్తూ మొరాయిస్తున్నశబ్దం


ఎందుకని ?



రాజకీయ నాయకుడి ప్రసంగానికి

ఉరి కాబోతూ
అసత్యం అవబోతుందని
డబ్బుకు అమ్ముడవుతున్న మీడియా
చేతుల్లో నగ్నత్వాన్ని ఆవిష్కరించాలని
మాటలు తప్ప చేతలలో చూపలేని వారి
నోటికి వేలాడుతూ అవమానం పాలవడం
ఇష్టం  లేకని ..


ఆ అక్షరం రెక్కల చప్పుళ్ళలో

ఆనందం
కల్మషం లేకుండా హత్తుకునే
హృదయం దొరికిందని
ఎవరిదో ? అని వెతుకుతూ
అక్కడే నిరీక్షిస్తున్నా