Thursday, September 6, 2012

నాలో నాకై ఆకలి

 llనాలో నాకై ఆకలిl

--------------------

ఆకలి
తిమ్మిరెక్కిన వేళ్ళకి
హృదయాన్ని అర్ధం చేసుకొని
కాగితంపై సిరా పారని పూసుకొని
కాలమై నృత్యం చేస్తూ
ఏదో రాయాలని
ఆకలి
రక్తాన్ని మరిగించుకునే గుండెకి
ప్రతీ  స్పందనని
రక్తంలోని అరుణ వర్ణంలో ముంచి
గుండె చప్పుళ్ల నాదంలో
హరివిల్లు లాంటి భావావేశాలన్నింటితో
రక్త వర్ణమయ్యే వరకు
రమించాలని
ఆకలి
కోరికల సంద్రమైన మనసుకి
త్సునామిలా చెలరేగుతున్న ఊసులకి
ఆటు పోటుల మధ్య ఆవిరవుతూ
స్వేదంలో కలిసి బయటికెగిసినా
తనువంతా మేఘంలా మార్చుకుని
మళ్ళీ తిరిగి నింపుకోవాలని
ఆకలి
ఎదురు చూస్తున్న కళ్ళకి
తనువంతా వసంతమై పులకరిస్తూ
లేలేత చిగురుల ఆలాపనలో
మొగ్గలా  మ్రోవిలా
ప్రేమగా మారి తను ఇటు నడిచి వస్తే
జన్మ జన్మల తృప్తి పొందేలా
కళ్ళ నిండా తినేయాలని
ఆకలి
నాలో నాకై
నన్ను నేను
పరిస్థితుల దాహం తీర్చడానికి
తోడేసుకుంటూ
నేనైన  ఎండిన  చెలమలో
తిరిగి
ఉపద్రవమై ఉద్యమమై
పొరలు పొరలుగా ఉషస్సునై
ఉదయిస్తూ
నన్నే పోగుచేసుకోవాలని
నాలో నేను
ఎందరెందరో అయి
అనేకమై అనంతమై
విశ్వజనీనమవ్వాలని