ఏంటి ఈ శబ్ధం?
అక్షరాలు రెక్కలు విదిలిస్తూ
ఎటో ఎగిరి వెళ్ళే
ప్రయత్నం చేస్తున్నాయి
ఎటు?
కవి
ఆలోచనాకాశంలోకి
అతడి భావాల సంద్రం లోకి
మనసు వృక్షం పై వ్రాలి
గుండె తడిలో తడిసి
గొంతు గూటిలో మాటల జత కట్టి
వ్రేళ్ల దారుల్లో ప్రయానించి
కాగితపు మైదానం పై
నడుస్తూ
కన్నీటిని సంతోషాన్ని
తడిమి చూస్తూ
ఎగురుతూ వెళ్ళేందుకు
సిద్దపడుతున్నాయి ..
అక్షరాలు
గొంతును సవరించుకుంటున్నాయి
ఎందుకని ?
పాటలా, పద్యంలా
కధలా ,మాటలా
స్వరాల జలపాతంలో కలిసి
నీటి బిందువులన్నీ రాశిగా ఏకమైనట్టు
రాగమై ఆలపించే ఆ స్వరాల అల్లికలో
ఒదిగిపోతూ
ఆ గొంతుకల్ని భావవేశాల పరిమితులకి
తగ్గట్టు మలుచుకుంటూ
పిల్లాడి చదువుకు పద్యమై
అక్షరాల ఆస్తులై
విప్లవ పాటగా జ్వలితమై
అమ్మ పాటగా లాలనై
ప్రేమికుల ప్రేమ లేఖల్లో పూలై
కౌగిలింతలై
దేవుడి ముందు అర్చనై అభ్యర్దనై
సర్దుకుంటూ హడావిడి చేస్తున్నాయి
అక్షరాలు
ఏడుస్తూ మొరాయిస్తున్నశబ్దం
ఎందుకని ?
రాజకీయ నాయకుడి ప్రసంగానికి
ఉరి కాబోతూ
అసత్యం అవబోతుందని
డబ్బుకు అమ్ముడవుతున్న మీడియా
చేతుల్లో నగ్నత్వాన్ని ఆవిష్కరించాలని
మాటలు తప్ప చేతలలో చూపలేని వారి
నోటికి వేలాడుతూ అవమానం పాలవడం
ఇష్టం లేకని ..
ఆ అక్షరం రెక్కల చప్పుళ్ళలో
ఆనందం
కల్మషం లేకుండా హత్తుకునే
హృదయం దొరికిందని
ఎవరిదో ? అని వెతుకుతూ
అక్కడే నిరీక్షిస్తున్నా