Saturday, May 19, 2012

మైలు రాయిని

అలసిపోయా ...
రోడ్డు పక్కన ,అలాగే నిలబడి 
వచ్చే,పోయే వాళ్ళకి 
ఇంత కాలం దూరం
ఇంతని చెప్తూ ...

గమ్యాన్ని చూపుతూ ..
వయసు మీద పడిందని 
వానకు తడిచి 
ఎండకు ఎండి 
అప్పుడేప్పుడో ..నన్ను ముస్తాబు 
చేస్తూ వేసిన రంగులు 
అందంగా నా ముఖంపై 
వ్రాసిన ,
తమ గమ్యాన్ని నన్ను చూసి 
తమ ప్రయాణం లెక్కించుకోమని
వేగాన్ని సరిచేసుకొని 
లక్ష్యంతో శ్రద్ధగా గమ్యాన్ని చేరుకోమని 
నా కిచ్చిన , నా మనుగడ 
ఉద్దేశ్యం , ఉద్యోగం 
పూర్తి చేస్తూ ..
ఇంత కాలం సంతోషించా ...

రెండు చక్రాలతో మాట్లాడుతూ 
మొదలు పెట్టి 
కాల క్రమంలో ఎన్ని మార్పులు 
చెందినా వాహనాలను చూసానో ...!
మట్టి దారులు ,తారుతో 
అందంగా మారిపోతుంటే   
చూసి ..నేను వాటితో సంబరపడ్డాను..!!

అప్పుడప్పుడు 
నాలాగే మిగిలున్న పాత మిత్ర 
వాహనాలు ,తమ నవ్వు 
విసురుతూ నన్ను పలకరిస్తాయి 
ఎన్నో ప్రమాదాలు  చూస్తూ  
విలపించిన క్షణాలు ఇంకా జ్ఞాపకమున్నాయి ..

అదో కిలోమీటర్ 
ముందుకు ఎత్థుగా ఒక కొత్త 
హోర్డింగ్ని నిలబెత్తారట ..
తన పరిచయమే నాకు లేదు ..
మార్పుల్లో నేను " పాత "అయ్యాను ..

మార్పుల్లో పడి ..
నేను మార్పును చూస్తూ !!
ఎవరో మార్చితే గాని మారలేని నన్ను 
పట్టించుకునే తీరిక లేని వారు ...
ఎలా నా వైపు చూసేది .. 
చుట్టుపక్కన ఉన్న మనుషులనే 
పట్టించుకోలేనివారు 
ఎలా ప్రయత్నం చేస్తారు 

ఎన్నో జ్ఞాపకాలను
అలా గుండెల్లో దాచుకొని 
విరిగిపోతున్నా .. రాలిపోతున్నా 
నేను " మైలు  రాయిని "...
ఇలా రోడుపక్కన నిల్చొని 
గతంలో భాగమవుతూ 
గమ్యాన్ని దగ్గర చేస్తూ ...
ఒంటరి ప్రయాణాల్లో 
అడుగు కలపకపోయినా ..
లక్ష్యం చేరమని నవ్వుతూ  సాగనంపుతూ .. !!