మేఘం లా నన్ను కమ్ముకొని
రగులుతున్న నా గుండె మంటను
చల్లార్చే ప్రయత్నం
నా అనుమతి లేకుండా చేయడం
నీ నేరం..!!
సుగంధమై నా గతాన్ని
కౌగలించుకొని
దాన్ని పరిమళ భరితం చేసి
నన్నే మైమరిపించేట్టు చేయడం
నీ నేరమే ...!!
ప్రశ్నల పుట్టలోనే దాగున్న
సమాధానాలను నీ మాటల
నాదస్వరంలో రప్పించి
నా భ్రాంతి చీకట్లను తొలగించే
ప్రయత్నం చేయడం
నీ నేరమే ..!!
నా ఒంటరి దారుల్లో
నా అడుగులతో జతకలిసి
నేనడక్కుండానే నా ప్రయాణం
పంచుకోవడం కూడా
నీ నేరమే ...!!
గుండెగదిలో ఒంటరిగా కూర్చొని
ఆశల తలుపులు మూసుకున్న
నా చేత తోడుంటావని
తెరిపించడం కూడా
నీ నేరమే ..!!
నీ జీవితాన్ని నా గుండెవాకిట నాటి
నమ్మకపు దారి వేసుకొని
నా గుండెలో ప్రవేశించి
నా ప్రేమని నీ బానిస చేసుకొని
ఇప్పుడలా నన్ను వదిలి వెళ్ళకుండా
నన్ను నేను మరిపిచిపోయేలా
క్షమించలేని నేరం నువ్వు చేసి
నీ ప్రేమ నంతా పెట్టుబడి పెట్టి
దాన్ని అనుభవించమంటూ
రోజుకో కమనీయ కావ్యంలా
నా జీవితాన్ని మార్చుకునే శిక్ష
నాకు వేస్తావా ?
ఇంత అదృష్టం నాకివ్వడానికి
జీవితాన్నే త్యాగం చేసేంత
వెల చెల్లించిన ..
నా ప్రియమైన శత్రువా
నన్ను గెలుచుకొని నీవు
జీవితాంతం నీకు ప్రేమించే
ప్రియమైన శిక్ష నాకేసావ్ ...