Monday, April 30, 2012

తను రాక ముందు

తను రాక ముందు 
నా మాటలు సరళ రేఖలు 
కాని ఇప్పుడు ఎన్ని 
వంకరలు తిరుగుతున్నాయో 

సిగ్గు, బిడియం అనే 
పదాలను ఇంతవరకు 
అవి వినడమే కాని 
ఇప్పుడు నా మాటలు నాకు 
వాటి అర్ధాలను బోధిస్తున్నాయి ..

ఇంత వరకు వాటి స్నేహం
చెవులతోనే..ఇప్పుడు 
అదేంటో తన మాటలు 
వినబడక పోతే గిల గిలా 
కొట్టుకునేలా 
మల్లెలై  మైమరిపిస్తున్నాయి 

ఆదేశాలు ఆంక్షలు 
ఆరాటపడే భావాలు 
మాటల కందని మకరందాలు 
నీ పెదవులనే ఆస్తులుగా చేసుకొని 
తన స్వంతమయ్యే ప్రయత్నానికి 
నాంది పలుకుతున్నాయి ..

జ్ఞాపకాల నొదిలి

నీ జ్ఞాపకాలు నా పెదాలపై 
ఎరుపు రంగు తెచ్చాయి 
చలనం లేని పెదాల రేకులకు 
వణుకును పుట్టిస్తున్నాయి   
తేనె ధారలూరే 
మనసు బావి నువ్వై 
తీపినంతా నింపుకున్న 
చెరుకుగడ నువ్వై 
రుచి చూపిస్తున్న 
జ్ఞాపకాల  నొదిలి నేనెక్కడికెల్లను ?
నీ స్మృతుల  మధురిమలను వదిలి 
ఎలా మనగలను?

Sunday, April 29, 2012

నీ ప్రేమకై తూకం

తూకమేస్తున్న నిన్ను ప్రేమిస్తున్నా
అని చెప్పడానికి ఎన్ని మాటలు 
కావాలో అని .. ?
ఎక్కడ మాటలన్నీ తేలికవుతున్నాయి 

నీ ప్రేమ మాత్రం 
ఇంచు కూడా పైకి లేవట్లేదు .. 
అంత ప్రేమించావా ఏంటి ?
కొండంత ప్రేమ 
కడలి అంత ప్రేమ 
ఆకాశమంత ప్రేమ 
నాది అని చెపుతూ ఊరేగే వారు 
ఉన్నారని తెలుసు 
కాని మౌనంగా ఇంత ప్రేమ 
ఎలా పెంచుకున్నావ్ 
నా మీద ??

నీ వైపు చూసినప్పుడల్లా 
నా వైపుకు ప్రవహించే 
అభిమానమే తప్ప .. 
ప్రేమ కనబడలేదే 
అని పొరబడ్డానా?

ఏమో ... నీ హృదయపు  సముద్రంలో 
ఇంకా ఎంత గుప్త ధననిధిలా 
ప్రేమ దాచుకున్నవో 
తెలియదు కానీ .. 
ఈ ఒక్క సారికి 
నా ప్రేమను నీ ప్రేమతో 
సరితూగ నివ్వవా?
నీ అడుగులో  అడుగు వేసే
అర్హత కోసం ఈ విజయం 
నన్ను వరించనివ్వవా ..  ?

ఫెం టో స్


నువ్వున్నావని కలల కాలువలు త్రవ్వా
ఇప్పుడు నీతో నిదుర తీసుకెల్లావ్

అడుగుల ఆకలి తీరేది .. 
నీ జాడలు వెతికి నిన్ను చేరినపుడే ..

అక్షరాన్ని నీ ప్రేమ తోటలో 
నాటా.. అందమైన కవితను పండించింది...

నీ నవ్వుల పువ్వులన్నీ ఏరి .. 
జ్ఞాపకాల దారంతో అల్లి నా గుండెకి వేసా ...

మట్టి వాసనలో బాల్యం 
చూపించి వర్షం నా తిట్లను తప్పించుకుంది .

వయసు ఒంటరి అయిందట .. 
ప్రేమేమో పుస్తకాలు రాస్తూ కాలిగా లేదు 

ఈ వైపుకు తిరగమంటే 
కరిచింది పువ్వు పై గండు చీమ .. అలకట


ఫెంటోస్

తన కన్నీళ్లు .. 
నా మనసున వేసవికోపానికి చన్నీళ్ళు ..


ప్రేమా... నువ్వున్న కలలన్నీ...
నా హృదయంపై పండిన గోరింటాకు ..


ఇంకెంత కాలం ఈ నా ప్రపంచం 
నీ జ్ఞాపకాలు తింటూ గొంగళిపురుగునై...


భావాలన్ని నింపినా తన
గుండె నిండదే ??.. దానికెంత స్వార్ధం ...?


నేను అడివి మల్లెను ..
నాలోని తేనె తప్ప నేను కాలేనా నీ ప్రేమ ...??


నా హృదయం గాజు పంజరం 
అందులో నుంచే ప్రపంచం చూడు .. 

ఇది అనుమానపు మాటా ? లేక అతని ప్రేమ మాట ?



Thursday, April 26, 2012

ఫెం టో స్

గడియ వేసుకున్న కలల

తలుపులు ... నిన్ను వదలిపెట్టబోమని...

నా కన్నీటికెంత చిక్కదనం ... 

నా గుండెలో నీ ప్రేమకై జరిగే మధనం ..

ఒక్క నవ్వు విసురు .. 

గుండె తటాకం తటస్థంగా భయపెడ్తుంది ..

నా నీడ రంగులమయం ... 

నీ వెంటతిప్పుకుని ప్రేమలో ముంచావట ..

ఏంటో మసక బారిన మొహం .. 

నవ్వు దీపం చతికిలపడిందా ...?

తన మాటకెన్ని వయ్యారలో .. 
పెదవులే సిగ్గుపడి గర్వపడతాయి ....

Tuesday, April 24, 2012

అశ్రునివాళి

అశ్రునివాళి ... ఈ అక్షరాలలో 

ఎటని వెతికేది ?
మీ అమ్మ నీ నవ్వు కోసం 
ఎవరిని అడిగేది ?
మీ నాన్న నీ మాటకోసం 
ఏ ఆదరణ ఓదార్చేది 
నీవారి కన్నీరు 
ఆపటంకోసం....

నీకోసం ఆరాటపడ్డ 
ఆ హృదయం ఇంకా 
తన మొబైల్ వైపు చూస్తూ 
నీ కాల్ కోసం ఎదురుచూస్తుంటే 
ఎవరు ఓదార్చేది ఇక 
నీవు ఇకరావు అని చెప్పడంకోసం 

నిషి ..
నీదారిలో వెళ్తూ చూస్తూనే ఉన్నావుగా 
ఎన్ని హృదయాలు కరిగి 
పిలుస్తున్న కన్నీరు 
ఎలా ఓదారుస్తావ్ 
ఏమాటని నీ కబురుగా పంపుతావ్ ??

ఈ అక్షరాలలో 
నీ జ్ఞాపకాలేరుకొని 
నీ దారిలో మేము ఒకరోజు రావాలని 
జ్ఞ్యప్తికి తెచ్చుకొని 
నయనాలు నీ జ్ఞాపకాలను తోడుతుంటే 
చెప్పలేక చెప్తున్నా 
ఇవ్వలేక ఇస్తున్న అశ్రునివాళి ...  

(Dedicating this to NISHI BOPLAY .. Femto's Group memeber on her sudden demise on 23rd apr 12.. )

Sunday, April 22, 2012

ఎందుకొచ్చిన ఏడుపు

ఎందుకొచ్చిన  ఏడుపు 
ఆపితే బాగు 
ఎటేల్లాలో తెలియని కన్నీటికి 
దారి చూపితే బాగు 

ఒక గుండెకి నీటి ఎద్దడి 
మరో గుండెకి అతి వృష్టి 
గెలుపువల్లన్నో  ఓటమివల్లనో 
తెలుసుకునే ప్రయత్నం చేస్తే బాగు 

ఆ కంఠం విసిగిపోయిందే ?
నులిమే ఆక్రోశం చేతిలో 
తన గుండె ఓడిపోయిందే ?
ఊరడించే ప్రేమ మాటల 
హత్తుకోలు ఇచ్చి 
కన్నీటి ద్వారాన్ని మూస్తే బాగు 

బండరాళ్ళ గుండెల్ని కరిగించే 
ఎండిపోయిన మానవతా విలువల్ని 
ప్రశ్నించి మేల్కొలిపే 
ప్రేమాప్యాయతల్ని నీటివనరై పెంచే 
హృదయపు బాధను కడిగి  యిట్టె 
శుభ్రం చేసే 
విజయపు ఉనికి చాటి చెపి గుండెని 
ఊరడించే 
ప్రాయశ్చిత్తపు నైవేద్యమైన 
కన్నీలను అవసరానికే వాడితే బాగు 
కన్నీటిని వృధా చేయొద్దని చేసే మనవి 
అర్ధం చేసుకుంటే బాగు 

కన్నీటి జ్ఞాపకలేనా

ఏంటి ఈ పూలు 
నా పడక నిండా 
కలలో కన్నీరై 
కంటినుడి కారిన 
కన్నీటి జ్ఞాపకలేనా ?

ఏంటి ఈ పరిమళాలు 
నన్ను వీడిపోడానికి 
నీ చేయి నా చేతిలోనుంచి 
తీసుకోడానికి 
నువ్వు చల్లిన 
మత్తుసుగంధాలెనా ?

ఏంటి చిందర వందరగా 
పడి వున్న వస్తువులు 
వెళుతూ వెళుతూ 
నీ జ్ఞాపకాలను 
చెరిపేసే ప్రయత్నమేనా ?

చేతిలోచేయి తీసేసినప్పుడు 
విశ్రాంతి తీసుకుంటావేమొ అనుకున్న 
దారులు వెత్తుకునేందుకు 
నిద్దరపుచ్చుతావనుకోలేదు 

నాతో చెప్పిఉండొచ్చుగా ..
కలలో కుడా నీ జ్ఞాపకాన్ని 
హత్తుకొని ఉండి 
నన్నోదిలేసే క్షణం నీకు 
వీడుకోలు కుడా చెప్పలేకపోయా 

మళ్ళీ వస్తావని తెలుసు 
నా హృదయం ప్రేమ తీపి 
నిను మళ్ళీ నా వైపు 
లాక్కోస్తుందని తెలుసు 
అప్పటివరకు 
ఈ పూలను వాడిపోనివ్వను
నా కన్నీటి సాక్షిగా 

సంతోషం సమాధిగా

ఒక్కదాన్నే
 ఓడిపోయిన దాన్ని 
వీడిపోయిన అనుభవాలతో 
బ్రతుకునీడుస్తున్న దాన్ని 

అలా వచ్చి నన్ను తాకితే 
విజయమే అని పొంగి పోయా 
నాలుగు దిక్కుల పరిమళాన్ని 
మోసుకొచ్చి నాపై చల్లితే 
ఇంత ప్రేమకు ఎంత అదృష్టం 
చేసుకోవాల్లో అని సంబరపడ్డ 

మాటల భిక్ష వేస్తూ 
మోసం నటించి .. 
మనసును తెలియకుండా
నీ వశం చేసుకొని 
మౌనం మోసపు బహుమానంగా 
ఇచ్చి 
నా సమయాన్ని నీపై వెచ్చించి 
నందుకు 
నాకు ప్రతిఫలంగా వేసిన శిక్ష ఇదేనా ?

ఒరిగిపోతున్న  నేలకు పుప్పొడి మోయలేక 
తేలిక చేసి తోడుంటావనుకున్నా 
ఉన్నంతసేపు నా పెదాలను ..
నా మోము నోదలలేదు 
ఇప్పుడు నేను ప్రేమతో పిలుస్తుంటే 
చులకనగా చూసే 
ఆ చూపుల వెక్కిరింతల శూలాలు 
గుచ్చుతుంటే 
నాకెందుకు ఈ జన్మఅనిపించేంత 
మోసం చూపిస్తే 
ప్రశ్నలే తప్ప సమాధానం 
చెప్పలేని పుస్తకమే నేనైతే 
విచ్చుకున్న రేకుల  కొనలు
 పిల్లగాలిని కూడా దరిచేరనివ్వక 
గాయపరుస్తుంటే 
మానసికంగా నీ దాన్ని అయిన నన్ను 
నీ కనుచూపూలతో శాసిస్తుంటే 
వాడిపోడానికైనా  ఇష్టం 
లోకం వదిలి వెళ్ళిపోవడం కూడా ఇష్టమే 
నీ సాంగత్యం లేని జీవితం 
సంతోషం సమాధిగా అయిన జీవితం 
నాకెందుకు ?? 



Friday, April 20, 2012

మనిషిఆనవాళ్ళు

నేను మనిషిని అనే ఆనవాళ్ళు దొరికాయి 
అన్నం కోసం తన్నుకునే 
వారిని చూసి కళ్ళు చెమ్మగిల్లినప్పుడు ..

నేను మనిషిని అనే ఆనవాళ్ళు దొరికాయి 
అమ్మ ముసలితనం భారం అని ..
నాన్నకు వృద్దాప్యం నాకెందుకని 
వ్రుద్దశ్రమాలలో వదిలిన వారిని చూసి 
హృదయం తల్లడిల్లినప్పుడు 

నేను మనిషిని అనే ఆనవాళ్ళు దొరికాయి 
ప్రాణమైన  చేతి వృత్తులు ..
వ్యవసాయం ఆగిపోయి 
ప్రాణమే వదిలి ప్రేమ చాటుకున్న వారి 
శవాలను చూసి గుండె ద్రవించినపుడు..

నేను మనిషిని అనే ఆనవాళ్ళు దొరికాయి 
దేశంకోసం తపనపడి శత్రువులను 
తరుముతూ అమరులైన వారి గుండెల్లో 
దూసుకెళ్ళి తూటాలు .. వారి దేహాలను 
చూసి శిరస్సు నాకు తెలియకుండానే వంచి 
కన్నీటి నీరాజనాలు రాల్చినప్పుడు ...

నేను మనిషిని అనే ఆనవాళ్ళు దొరికాయి 
నా గుండె ప్రేమకి స్పందించి 
నన్ను నేనే ఆజ్యంగా పోసుకోగలనని
ఆత్మ గోషిస్తూ చేసిన ప్రబోదానికి
శిలలాంటి హృదయం కరిగి ...
నేనైనా శిల కన్నీటిని వర్షించినప్పుడు 

పొడిచిన పొద్దు

పొడిచిన పొద్దు 
ఆశల పందిరి వేసి 
పొడి బారుతున్న కోరికలకు 
తడిని అద్ది 
పోగొట్టుకుంటున్న కాలాన్ని 
బందీ చేయలేక 
పోలమారుతున్న జ్ఞాపకాలను 
పోగు చేసుకొని 
ప్రోత్సాహం ఇస్తుంది 
నాదైన ప్రేమ నాతోనే అని ...

అడుగులు వేయడం నేర్పుతుంది 
అబ్యాసం చేయిస్తుంది 
శుభారంభం  సగం సఫలం అని 
తానే ముహూర్తమై నన్ను నడిపిస్తుంది 

పూపొదలను పలకరిస్తుంది 
పచ్చిక ,పైరులను స్పృశిస్తూ 
పల్లకిలో ఊరేగే పిల్లగాలులకు 
పాటలు పాడే కోయిల ,భ్రమరాలను 
పిలిచి మరీ నా ప్రేమకు 
సహకరించమని అతిధిలుగా 
ఆహ్వానిస్తుంది 

అలా నా కనురెప్పలను తాకుతూ 
నిద్రలోంచి నన్ను లాగుతూ 
నేడు ఒక సరికొత్త ఉదయమని 
స్పూర్తి నింపుతూ ..
ప్రేమ శ్వాసలో పరధ్యనాలు వదిలి 
పట్టుదల నేర్పి లక్ష్యం వైపు నడిపి 
ప్రయోగమే జీవితమని పాటాలు నేర్పుతూ
పద పద మని పరుగులు తీయిస్తుంధీ 
పైకెగబాకే తాడు వేసి మరీ 
లక్ష్యాన్ని దగ్గర చేస్తుంది 

ప్రక్కనే ఉంది నిన్ను గుర్తుచేస్తుంది 
పసిపాపను చేసి మనసును బుజ్జగిస్తుంది
ప్రేమ పలుకులు నాకు నేర్పి నీపై 
నా ధ్యాసను మరల్చుతుంది
పడిలేచే కెరటమై నాలో ఉత్సాహాన్ని 
నింపుతుంది 
నీవే నా గమ్యం అని 
నీవే నా లక్ష్యమని 
నీవే నా పరుగుకు అర్ధమని 
పొడిచిన పొద్దు 
పోదిబారక నీ ప్రేమతేమను 
సుతిమెత్తగా తాకుతూ 
నీవైపుకు నా అడుగులు వేయిస్తుంది 

Thursday, April 19, 2012

కలలు

తన కలలు నా  కళ్ళతో చూసా 
నా వాటికన్నా అవి ఎంతో అందంగా 
ఉన్నాయి ..!!
నా కలలో నాకు లేని ఉనికి 
తన కలలోకి అడుగడుగునా ..ఎలా ?
నన్ను నే ప్రేమిస్తున్నానన్నది  నిజం 
కాని నా కన్నా నన్ను తను ఎక్కువ 
ప్రేమిస్తున్నాడన్నది ఇంకా నిజం 
నా ఊపిరి ధారలు 
నా కళ్లలోకి ప్రవహిస్తే 
వాటికి జీవం కాని ఇదేంటి ..!!??
తన కళ్ళను వెతుకుతూ
నా కలలు వెళుతున్నాయి 
నా కలలకు కూడా తన కళ్ళే నచ్చాయేమో ?!
తన అంత  అందంగా .. 
నా కలలను నేను పూయించలేనని 
వాటి హృదయాన్ని విప్పాయేమో...?
తన జాడలు వెతుకుతూ 
నా కలలు తన కళ్ళ వైపు 
 వరుస కట్టినప్పటినుంచి
నా కంటికి నిదుర కరువయ్యింది 
తన కంటికి మెలుకువ వీలుకాకుంది 
ఔరా ! తన ప్రేమ నా కళ్ళను 
కలలను కూడా గెలిచిందా ? 
  

Tuesday, April 17, 2012

శబ్దంలో నిశబ్ధం

తన కళ్ళలో కన్నీరు 
నాకు తన గుండెలోకి దారి చూపుతూ 
తనను తన పరిస్థితులను 
స్వీకరించమని అనుమతిగా ఆహ్వానిస్తూ 
శబ్దంలో నిశబ్ధం గమనించమని 
నవ్వు వెనకాల జరిగే పోరాటం తెలుసుకోమని 
ప్రేమ వర్షం కురవక 
ఎండిపోయి  బీటలు వారిన మనసు క్షేత్రం 
చూడమని..
కలల విత్తనాలు జల్లగా సారం లేక 
ఎండిపోయిన వాడి బాధ గనుమని 
తన కళ్ళలో కన్నీరు 
నాకు తన గుండెలోకి దారి చూపుతూ 
నా చేతి వేళ్ళను తన చెక్కిలినంటమని 
ప్రేమాప్యాయతలు అడుకట్ట వేసి 
వాటిని గుండెలోకి మళ్ళించి 
తన ప్రేమ కొరకు కనిపెట్టి 
నా నిరిక్షనను తన కళ్ళలో సానబెట్టమని ..
నా కళ్ళ సాక్షిగా తన మునివేళ్ళ సాక్షిగా 
నన్ను తన గుండెలోకి ఆహ్వానిస్తూ .. !! 

Saturday, April 14, 2012

ఏముంది నీకివ్వడానికి

ఏముంది నీకివ్వడానికి నాదగ్గర
బహుమతిగా 
నీ కోసం కొండంత ఆశిస్సులు
శుభాలు కోరుకోవడం తప్ప ..

ఎంతో ఎదిగేవరకు
ఎన్నో సాదించే వరకు
పదిమందిలో నిన్ను పైవాడిగా
చూసేవరకు
విజయపు మెట్లన్నీ ఎక్కి
విజేయుడవయ్యే వరకు
నీకోసం హృదయాన్ని ప్రమిదగా
చేసి దేవుడిని రోజు ప్రసన్నం
చేసుకోవడం తప్పు

నీలాంటి నేస్తం  నాకు దొరకడం
నేను దేవుణ్ణి అడగకుండానే
పొందిన వరం
నీవు మాటలతో అందించే చేయూత
నేను తీర్చుకోలేని ఋణం

ఒంటరి అయిన  వేళ మాటల
అల్లరిని చల్లి
ప్రోత్సాహం కోసం ఎదురుచూస్తున్నప్పుడు
వెన్ను తట్టి నిలబెట్టి
నన్ను నేను శోదించుకునే సమయంలో
నాతో పాటు నిద్రనోదిలి
కొంచెం సమయంలోనే నేస్తం
కొండంత ధైర్యం అయినందుకు
హృదయ పూగుత్తినే
నీ పుట్టిన రోజు బహుమంగా ఇస్తూ ...
ఆశీస్సుల సుమ పరిమళాలను
మేఘాలనిండా నింపి నీ మీద
కురవమని పంపుతూ ..
అందజేస్తున్న
ఆత్మీయ 
హృదయపూర్వక  జన్మదిన శుభాకాంక్షలు

ఎన్ని వాడుకలు ..

ఎన్ని వాడుకలు .. 
వడబోతలో  జీవితంలో
ఎన్ని ప్రయత్నాలు 
పలరహితాలో సాధనలో 
ఎన్ని పరుగులో 
పరధ్యనాలో ఈ బ్రతుకు పోటిలో 
ఎన్ని మాటలో 
మైమరపులో ఈ జీవన వైచిత్రిలో 
ఎన్ని అభినందనలో 
చీత్కారలో గెలుపు ఓటముల్లో 
ఎన్ని గుండె సవ్వడుల శబ్దాలు 
నిశబ్దాలో ప్రేమ నాదంలో 
నేను నేనై .. 
నాలో నాకే 
నా విజయానికి జరిగే సంగర్షణలో 
ఎన్ని గుర్తింపులో ... అవమానాలో ..  
అయినా చివరికి 
వడబోతలోమిగేలేది 
నేనే నాలో (సశేషం )

జీవితం

ఒక్కోరేకు ఒక్కోఅనుభవం 
అన్నీ విచ్చుకుంటేనే అందమైన జీవితం 
ఒక్క అనుభవం విచ్చుకోనని 
మొండికేసినా 
ఆ పువ్వు మొహం చూడడానికే 
అందవిహీనం ..

ఒక్కోరేకు విచ్చుకోడానికి 
ఎంత కష్టమేసినా 
విచుక్కోలేనని రేకు
సహకరించకున్నా 
ఇంత అందమైనదిగా 
పేరు తెచ్చుకోగాలదా ..?

బాల్యం ..కౌమారం 
వ్రుదాప్యం .. 
ఒక్కో దశలో ఒక్కో వరుస 
అనుభవాల క్షేత్రం  ..
ఒక్కో అనుభవానికి ఒక్కో 
పరిణితి చెందే సమయం .. 

విచ్చుకుంటున్న కొద్ది 
దగ్గరయ్యే 
అనుభవాల సారం 
చేతులు కలిపి సహకరించుకునే 
ప్రేమాప్యయతలను 
అనుభవం నుంచి నింపుకున్న
వైనం  ..

బయట పరిస్థితులనుంచి 
లోపలి హృదయాన్ని అర్ధం 
చేస్కునేంత సాగే 
నిరంతర అభ్యాసం .. 
ముళ్ళున్న .. కిందకు చూడని
ధైర్యంతో నిండిన 
సాహసమే శ్వాసై
పువ్వై విచ్చుకునే ప్రహసనం జీవితం
ఒక్కోరేకు ఒక్కోఅనుభవం 
అన్నీ విచ్చుకుంటేనే అందమైన జీవితం ..






తన మోము మందారం 
మాట మధుర భాండాగారం 
చూపు విసిరితే చల్లని చంద్ర హారం 
నవ్వు విసిరితే పరిమళించే నవపారిజాతం 

చిక్కుకున్న నా హృదయం 
నీ సొట్ట బుగ్గల గాలానికే 
చేప పిల్ల అయ్యింది మనసు 
నీ చేపల్లాంటి కళ్ళలో ఈదుటకు.. 

ఎదుట నిలిచే నీ ప్రతి బింబం 
ఇటు అటు అని లేకా 
ఏ వైపు వెళ్తున్నావో తెలియక 
దారి మరిచే మతి తానై  నిండుకోగా   

తనని చూడలేని ప్రతి ఆలస్యం 
నాకు విరహాగ్ని గుండంలో స్నానం 
తన మాట వినని ప్రతి క్షణం 
మనసు శూన్యంలో విహారం 

స్నేహితుడొచ్చాడు..

ఎన్నో రోజులకి మొహంపై కల్మషం లేని నవ్వొచ్చింది 
మళ్ళీ నా స్నేహితుడొచ్చాడు..
తనతో పాటు ఆ పాత జ్ఞాపకాల 
బాల్యపు గుభాలింపులు తీసుకొచ్చాడు .. 

ఆడుకున్న ఆటలు 
చెప్పుకున్న ఊసులు 
కలసి తిరిగిన దారులు 
పంచుకున్న కష్ట సుఖాల కలబోతలు 
తన రాకతో మళ్లీ జీవం పోసుకొని 
తిరిగి లేచాయి 

ఆ కోతి కొమ్మచ్చి ఆటలో 
తను కింద పడ్డ వైనం 
దోబుచులాటలో దొరికి పోయిన 
క్షణం తాలుకు జ్ఞాపకం 
దొంగతనం చేసిన మామిడి 
కాయల వేసవి కమ్మదనం 
వెన్నెల్లో  ఒకే మంచంపై పడుకొని 
పంచుకున్న రహస్యాల గోముతనం 
ఒక్కొక్కటి .. ఒక్కొక్కటి మళ్ళీ 
తొంగి చూస్తున్నాయి .. 

చదువుల పరదా పడి
తను ఎటో నేను ఎటో 
భవిష్యత్తును బంగారం చేసుకోవాలని 
తలో దారిన బయల్దేరాం 
లోకంతో పాటు మార్పు నేర్చుకున్నాం 
మాటలకు పై పూతలు 
మనసు మీద ముసుగులు 
పెదాలపై దొంగ నవ్వులు 
ఆలోచనలో ప్రత్యామ్న్యాయ 
కలుషితాలు ,కల్మషాలు పూసుకొని 
జీవితాన్ని జీవించటం కన్నా 
నటిస్తూ గడిపాం ..
గుర్తుచేసుకున్న గతం ప్రతి క్షణం 
ఎత్తి పొడుపులు అయినా 
అందరికన్నా ముందుండాలన్న పోటీ తత్వం 
మరుపే బహుమానంగా ముందుకు తోసింది 

మళ్ళీ ఇన్ని రోజులకు 
కల్మషం లేని నవ్వొచింది పెదాలపై 
నా స్నేహితుడొచ్చాడు .. తనతో పాటు 
నా బాల్యపు జ్ఞాపకాల గుభాలింపును
తీసుకొని .. మూటకట్టి .. మోసుకొని . .

Thursday, April 12, 2012

ఇలాంటి సమాజాన్ని ఏమనాలి

ఇలాంటి సమాజాన్ని ఏమనాలి ... 
ఈ రాక్షసత్వాన్ని ఎలా నిలదీయాలి 
ఆడపిల్లలమే ... 
అమ్మతనానికి నిదర్శనమే 
ప్రేమ పంచి పెంచే హృదయాలమే 
ఇంకెన్ని నాళ్ళు .. 
ఇంకెన్ని ఏళ్ళు 
ఈ వివక్ష ..
మంతం .. కులం .. ఏది లేదా 
ఆడపిల్లంటే .. అన్నిటికి ఒకే భావన 
కనకుండానే .. కడుపులో 
కన్నా తర్వాత ..కర్కశంగా గొంతు నులిమి 
కాటికి కూడా తీసుకెళ్ళకుండా పడేసే మనుషులు ..
ఎదుగుతున్నంత సేపు ఏ మదమెక్కిన 
కుక్క కంట పడకుండా .. జాగ్రత్త పడినా 
తప్పించుకొని ఆసిడ్ దాడులు .. గొంతు కోతలు 
పెళ్లి కోసం కన్నా కలలను పారని ఆరాక ముందే 
కట్నం వేదింపుల ఉరులు 
పైశాచికంగా హింసించే అనుమానపు 
మృగాలు .. 
మార్పు రాదా ఇంకా .. ? 
మారలేమా ఇంకా ?
ఆకశానికేక్కెంత సాహం ఉన్న ..
ఇంట్లో  కుక్కకున్నంత స్వేచ లేదే 
రాజ్యాన్ని నడిపించెంత సామర్ధ్యం ఉన్నా 
పేరుకే ఆ వైభవమే .. 
ఎన్నాళ్ళు .. ?? ఇంకెన్నాళ్ళు .. ?? 
ఆడ మగ తేడాలు ... ?



Wednesday, April 11, 2012

నాతప్పేంటమ్మా .. ??

నాతప్పేంటమ్మా .. ??
ఇక్కడున్నాను ?!!
ఆడపిల్లననేగా ?
నేను కడుపులో వున్నప్పుడు 
మగపిల్లవాన్నని నువ్వు కన్న కలలు
నిన్ను చూసి నవ్వాయనా ?
నాన్న నీకిచ్చిన అవకాశం నాతో 
ముగుసిపోతుందేమో అని భయమా?
పున్నామ నరకం నుంచి నేను 
తప్పించలేనని వేదాలు చెప్పయనా?
నాకు కట్నం కోసం మీరింకా 
ఎక్కువ కష్ట పడాలనా?

నాతప్పేంటమ్మా .. ??
ఇక్కడున్నాను ?!!
ఆడపిల్లననేగా ?
నేను ఆడపిల్లనవడం నా తప్పుకాదు 
కదా అమ్మా ...
నీ కడుపులో మోస్తునంత సేపు  
తొందరగా బయట పడి పెద్దదాన్నయి 
నీ మొహంలో నవ్వు నిమ్పాలనుకున్నా 
ప్రతి నిమిషం నేను నిన్ను తంతూ కడుపులో
తిరుగుతూ తినకుండా చేసినప్పుడు 
ఎప్పుడు నా చేతితో గోరుముద్దలు 
తినిపించాలని ఆరాటపడ్డా .. 
నీ కలలు నా కలలుగా మార్చుకొని
నీకు సంతోషం బహుమానంగా 
ఇద్దామని ...



నాతప్పేంటమ్మా .. ??
ఇక్కడున్నాను ?!!
ఆడపిల్లననేగా ?
కళ్ళు తెరవగానే నీ అందమయిన 
నాకు పంచిన రూపం చూద్దామనుకున్నా
నువ్వు నా చెక్కిలిపై ముద్దు పెట్టి 
దగ్గరకు తీసుకుని ఆనందిస్తుంటే 
నీ కళ్ళలోని నన్ను చూద్దామనుకున్నా
నా చిన్ని వేళ్ళను మెల్లిగా నిమురుతూ 
నా నొసటి పై నీ ముద్దు పెడితే 
నా ప్రపంచం ఇంత అందంగా ఇచ్చినందుకు 
దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలనుకున్నా 
కాని ఇప్పుడు 



నాతప్పేంటమ్మా .. ??
ఇక్కడున్నాను ?!!
ఆడపిల్లననేగా ?
ఈ చెత్త కుప్పలో 
వదిలేయడానికిచ్చేపుడు
నా వేళ్ళు నీ వేళ్ళను పట్టుకొని 
వదిలి వేయలేనప్పుడు
ఎలా భరించావమ్మా ??
ఒంటి మీద బట్టలు కప్పడానికి 
కూడా వృధా అనే భావన ఎలా వచ్చిందమ్మా 
ఇలా వదిలేసిన నన్ను చూసి 
చెత్త కుప్ప కూడా భాదపడుతుంది 
మీకెందుకు అనిపించలేదమ్మా 




నాతప్పేంటమ్మా .. ??
ఇక్కడున్నాను ?!!
ఆడపిల్లననేగా ?
అమ్మా అమ్మా ....
భయంగా ఉందమ్మా..
కుక్కల అరుపులవిగో 
అమ్మా అమ్మా ఎక్కడున్నావమ్మా
ఆత్రంగా చూస్తున్న వాటి చూపులవిగో
అమ్మా ... అమ్మా .. 
నన్ను తీసుకెల్లమ్మా ....
నన్ను తీసుకెల్లమ్మా ... :(