మళ్ళీ నా స్నేహితుడొచ్చాడు..
తనతో పాటు ఆ పాత జ్ఞాపకాల
బాల్యపు గుభాలింపులు తీసుకొచ్చాడు ..
ఆడుకున్న ఆటలు
చెప్పుకున్న ఊసులు
కలసి తిరిగిన దారులు
పంచుకున్న కష్ట సుఖాల కలబోతలు
తన రాకతో మళ్లీ జీవం పోసుకొని
తిరిగి లేచాయి
ఆ కోతి కొమ్మచ్చి ఆటలో
తను కింద పడ్డ వైనం
దోబుచులాటలో దొరికి పోయిన
క్షణం తాలుకు జ్ఞాపకం
దొంగతనం చేసిన మామిడి
కాయల వేసవి కమ్మదనం
వెన్నెల్లో ఒకే మంచంపై పడుకొని
పంచుకున్న రహస్యాల గోముతనం
ఒక్కొక్కటి .. ఒక్కొక్కటి మళ్ళీ
తొంగి చూస్తున్నాయి ..
చదువుల పరదా పడి
తను ఎటో నేను ఎటో
భవిష్యత్తును బంగారం చేసుకోవాలని
తలో దారిన బయల్దేరాం
లోకంతో పాటు మార్పు నేర్చుకున్నాం
మాటలకు పై పూతలు
మనసు మీద ముసుగులు
పెదాలపై దొంగ నవ్వులు
ఆలోచనలో ప్రత్యామ్న్యాయ
కలుషితాలు ,కల్మషాలు పూసుకొని
జీవితాన్ని జీవించటం కన్నా
నటిస్తూ గడిపాం ..
గుర్తుచేసుకున్న గతం ప్రతి క్షణం
ఎత్తి పొడుపులు అయినా
అందరికన్నా ముందుండాలన్న పోటీ తత్వం
మరుపే బహుమానంగా ముందుకు తోసింది
మళ్ళీ ఇన్ని రోజులకు
కల్మషం లేని నవ్వొచింది పెదాలపై
నా స్నేహితుడొచ్చాడు .. తనతో పాటు
నా బాల్యపు జ్ఞాపకాల గుభాలింపును
తీసుకొని .. మూటకట్టి .. మోసుకొని . .