నీ జ్ఞాపకం నాతోనే ...
నీ జ్ఞాపకం నాలోనే
పువ్వులో దాగున్న నవ్వులా
చంద్రునిలో మచ్చలా
పిల్లనగ్రోవిలో శ్వాసలా
చినుకులోని సవ్వడిలా ..
ఉక్కిరి బిక్కిరి చేస్తున్న
నీ జ్ఞాపకం ...
ఎవరితో ఏమని చెప్పను
నా హృదయం అనుభవిస్తున్న
ఆ భావన ...
నా చుట్టూ నీ ప్రపంచం
చూస్తున్న వాళ్ళకి నన్ను
పిచ్చి అన్నా ..
నీ పిచ్చి ప్రపంచం చుట్టూ అల్లుకున్న
నా శ్వాస తీగలు నిన్ను
వదలనంటున్నాయి ..
నీ శ్వాస లేకపోతే అవి బ్రతకవు
కదా మరి ..
ఎవరికేవో కనిపిస్తున్న రంగులు
హరివిల్లులో ..
నాకు కనిపిస్తున్న రంగు మాత్రం
నువ్వే కదా ...
నీ నవ్వే కదా..
నీ మాటే కదా..
నీ స్పర్శే కదా ...
ప్రియా ... నీ జ్ఞాపకాల వర్షంలో
తడిసి ముద్దయిన మనసు
నీ మోహన రాగం తప్ప
వేరేది వినంటే ..
నా మూగబోయిన మనసు
ఆ రాగాన్ని ఎలా నేర్చుకునేది ?
ఇక చాలు ఈ ఎడబాటు
ఎక్కడున్నావో
నన్ను చేరు ..
లేదంటే నిజంగానే ఈ లోకంతో
వేరై నీవైన లోకంలో పిచ్చిగా
వుండిపోతానేమో...!!!