నన్నూ .. నాతో పాటు
నువ్వూ .. గడిపిన క్షణాలను
ఇలా డైరీలో దాచావు
రోజంతా ఆ పెజీల వెనక
నీ శ్వాస ,
ఎప్పుడు తగులుతుందో అని
ఎంతో ఎదురుచూస్తుంటా ...
ఏ సమయం నేను గుర్తొచ్చి
ఈ పుస్తకాన్ని తెరుస్తావేమో అని
అక్షరాలపై ఎక్కి కూర్చొని
అలాగే చూస్తుంటా ..
నువ్వు వచ్చేవరకు ...
నీ పెదాలు తాకి
నీ నుదుటిని స్పృశించి
నీ చేతుల్లో పరవశించే కలంతో
గడుపుతూ కొంతసేపు ఆనందిస్తా ..
ఎవరైనా డైరీని
ఇటు అటు కదిపారా ...?
నువ్వేనేమో అనిఆరాటంతో
అక్షరాలూ భావాలను కలగలిపి
నీవు నిర్మించిన
సింహసనాలు ,సౌధాలు ,
లోతులు ,అగాధాలు
దాటుకొని ..నువ్వు
డైరీ తెరిచే సమయంలో
నీ చేతి వేళ్ళు
ముద్దాడటం కోసం . .
ఎంత పరుగెత్తి వస్తానో ..
ఆ వచ్చే క్రమంలో దెబ్బలు
తగిలించుకున్న సందర్భాలెన్నో ..
ఒక్కోసారి గ్లాసులో నీళ్ళు
ఒలికి .. ఆ సిరాతో కలిసి
నన్ను సిరామయం చేసి
అందవిహీనం చేసి .. అక్షరాలు
నన్ను ఎక్కిరించాయని
నీకు తెలుసా ??
ఒక్కో పేజి ముగుస్తూనే
ఇంకో పేజీకి నన్ను ముద్దుగా
తీసుకొని వెళ్ళే నీ
చేతి వేళ్ళంటే నాకు మహా ఇష్టం ..
అప్పుడప్పుడు ,ఎపుడో పెట్టిన
గులాభి ,నా తల వెంట్రుక ,
చేతి రుమాలు ,తిని పారేసిన
చాక్లెట్ కవరు , చిరు వస్తువులు
డైరీలో నువ్వు దాస్తునప్పుడల్లా
నువ్వంటే ప్రాణానికే ప్రాణం
అనిపిస్తుంది సుమా ...
"ప్రేమ కూడా కుళ్ళుకునేలా
ప్రేమిస్తావు మరి "...
అర్ధరాత్రులు నీతో గడిపే
సమయం
రంగు రంగుల .. ఆలోచన
హరివిల్లుల్లో నువ్వు నన్ను
త్రిప్పుతుంటే .. ఆ క్షణాలు
నాకెంత ఇష్టమో
అలసిపోయి నిద్రలో
నీ గుండెపై అలా డైరీతో పాటు
నన్ను పడుకోబెట్టుకుంటే
నీ శరీర సుగంధం చాలు
ఇలా ఉండిపోవచ్చు ...
జీవితాంతం అనిపిస్తుంది ..
ఇంకేం చెప్పను ..??ఇక రా ..!
ఎదురుచూపులు చూడలేను
ఇవ్వాళా ఏ రకంగా నన్ను
అలరించి ..అలంకరించి
హత్తుకుంటావో అని ..
ఎదురు చూస్తున్న
నీ జ్ఞాపకాన్ని....
నీ డైరీలో నీ అక్షరాలతో
సజీవంగా నీకోసం ఎదురుచూసే
నీ జ్ఞాపకాన్ని .. ♥♥
BY-Mercy Margaret (6/6/2012)