**********
నేను బయటపడ్డా ..
నేను పడ్డ ఆ గుంటలో నుండి
బయటపడలేని జిగటగల ఊబి
అపవాది అనే దొంగ త్రవ్విన
గుంట నుండి
పడి కూరకు పోవడమే కానీ
బయటపడలేని ఊబి నుండి ..
మునిగిపోతూ కేకలు వేసా
కూరుకు పోతూ సహాయం కోసం
అర్ధించా ..
ఎవరెవరో వచ్చారు సహాయానికి
శక్తిలేక .. పట్టులేక .. జ్ఞానం లేక
నన్ను లాగుతూ వాళ్ళు పడిపోయి..
కొందరు
చూస్తూ హేళన చేస్తూ
వెళ్ళిపోయిన ఇంకొందరిని చూసి ..
రోదిస్తున్నా ..
లోలోపలికే లాగుతున్న ఊబి
నా ఊపిరినే నులిమి
నా జీవాన్నీ జీవితాన్ని
లాగేసుకోవాలని ప్రయత్నిస్తున్న
దానితో పోరాడుతూ .. ఓడిపోతూ
సహాయం కోసం ఎదురుచూస్తూ
మూలుగులతో విడుదల కోసం
నిట్టూరుస్తూ మొరపెడుతూ
కోల్పోతున్నా నన్ను నేనే
అనే సమయంలో ....
ఎటు నుంచో స్వరం
నా చేయి పట్టుక్కో మని
ఆ చేతినుంచి కారుతున్న రక్తం
నా నుదుటిపై పడి
నా కళ్ళకి తేట నిచ్చి
నా ఎండిపోయిన ఆశలను .. జీవితాన్ని
తిరిగి జీవంతో నింపి
నా చేతిని పట్టుకొని బయటికి లాగి
ప్రేమగా నన్ను హత్తుకుంది
తలపై ముళ్ళ కిరీటం
పక్కలో బల్లెందించడం వల్ల
అయిన గాయం
నన్ను ఆ గుంటలో నుంచి లాగడానికి
తను చెల్లించిన పరిహారం ..
ఎందుకు ఇంత త్యాగం నాకోసం అని
అడిగిన ప్రశ్నకు ...
నిన్ను ప్రాణం పెట్టేంత ప్రేమిస్తున్నానని
తను చెప్పిన సమాధానం
ఏమివ్వగలను ఇంతటి విడుదలకు
నీ ప్రేమకని అడిగా
నా కుళ్ళిపోయిన హృదయం
గుంటలో పడి మురికి
అంటుకున్న నేనే కావాలన్నది
ఆ స్వరం
నా గుండె ఏడుస్తుంది
మేకులు దించిన ఆ పదాలను
ముద్దాడుతుంది
కన్నీటితో తన పాదాలు కడిగి
నా ప్రేమ అత్తరును తనకి పూస్తూ ..
జీవితాంతం తన పాదాల దగ్గర
చోటుచాలని సంతోషిస్తుంది ..