చీకటి నీటిపై తేలియాడుతూ
గమ్యం ఎరుగని ఆలోచనొకటి
ఎన్ని సంభాషణల మూటలు నింపుకొని
ప్రయాణమయ్యిందో
గతం వీస్తుండగా
ఆ హోరు గాలిలో
తీరం చేరే మార్గమే లేక
సంభాషణలన్నిటిని చీకటి
సంద్రంలోకి విసిరేస్తూ
తనని తానూ తేలిక చేసుకునే ప్రయత్నం
చేస్తుంది
విధి వెలుగును చంపితే
చీకటంతా దాన్ని పీల్చేసుకుని
ఆలోచనల్లో
" నేను " ని కూడా వంచిస్తుంటే , మతి లేక చీకటి తోనే
సహాజీవనం చేస్తూ
దిక్సూచి లేక
చీకటి సంద్రంలో చీకటికే ఆవిరైపోయే
స్థితికొచ్చింది
తడుముతూ ఆ మూలాన కూర్చున్న
"నేను " కు
ఒక మూట చేతికి తగిలి
ముడులు విప్పిన మూట నుంచి
ఆత్మవిశ్వాసం ఒక్క సారి పేలి " నేను " వెలిగించింది
చీకటి నీటిపై ప్రజ్వలిస్తూ
ఆలోచనలకు
గమ్యం ,దారి వెతుక్కొని
చీకటిని మండించి వెలుగు సంద్రంగా మార్చింది
"నేను "
లక్ష్యం ఉద్దేశం నెరవేరింది
ఆ వెలుగును చూస్తూఇంకెన్ని ఆలోచనలో
చీకటి నుండి వెలుగు వైపుకు
by -mercy margaret