కన్నీళ్లలో కళ్లు కడుక్కున్న తరువాత
తలపై బరువు తీసి పక్కకు పెట్టి
ఒక్కో ఆలోచనా వలయం నుండి
మనసును దూకిస్తూ
ఆటలాడి అలసిన
నేను
మంచుతుంపరలై కురుస్తున్న ఎడబాటులో
నీ జ్ఞాపకపు దుప్పటిని చుట్టుకుని
మనం ఎప్పుడూ కూర్చునే
ఈ చెట్టు కిందే
చంద్రునికి కబురులు చెబుతూ పొగ మంచు
కదిలిపొతుంటే
నాతో
నువ్వు వదిలి వెళ్లిన నీ నీడ
ఆ చీకట్లో కలిసి ఎక్కడుందో అని
వెదకడానికి
ఈ సమయంలో ఇక్కడికొచ్చా
కళ్లు తేటగా కనిపిస్తున్నా
పాదాలకు నీ తోడుకావాలనే
తపనెక్కువై పరుగెట్టి వస్తుంటే
అపుడెప్పుడో నువ్వు విసిరి పారెసిన
అనుమానపు ముల్లు
ఇప్పుడు నా పాదంలో ఇలా
గుచ్చుకుంది
అదే ఈ గాయం
నీ చూపుతో నా గాయాన్ని తడిమే వరకు
మానను అని సమ్మె చేస్తుంటే
నీకు కబురు పంపుతున్నా
అందిన వెంటనే
వస్తావు కదూ ...
(28/11/2012)