Sunday, November 4, 2012

నాకూ దోస్తులున్నారు


నేను 
ఎగురుతున్న పక్షి రెక్కల్లోని ఈకల్లోంచి 
ఒక్కొక్కటిగా రాలిపడుతున్న 
స్వేచ్చను 


ఒకేసారి కుప్పకూలను 

అలా అయితే 
పక్షికి నా మీద నమ్మకం ఉండదుగా 


అందుకే 

ఔన్సులు ఔన్సులుగా చేదును సేవిస్తూ 
ప్రేమని అన్ని పరిస్థితుల రుచులతో 
అలవాటు చేసుకుంటాను 


ఆ వీది చివర 

ఒంటరినై నిలబడకుండా 
నా చుట్టూ 
చెట్లు , చెరువు 
గూటిలో గువ్వ ,నీటిలో చేప , రాలిపడ్డ మువ్వ ,
ఎండి అల్లరి చేసే రాలిన ఆకు 
సంధ్యావేళ  చీకటి దుప్పటి నిండా నక్షత్రాలని 
నింపుకొచ్చే చంద్రుడు 

చాలు ఇక లెవ్వమంటూ నిదుర తెరను తొలగించి
సుప్రభాతం పాడే సూరీడు ,

రెప రెప లాడుతూ తరిగిపోతున్న జీవితాన్ని గుర్తు చేసే 
క్యాలెండరు ,
సరిదిద్దుకో మరో అవకాశం వచ్చిందంటూ పిలిచే 
అద్దం ,
గుర్ర్ మంటూ నీ ఒంటరి పాటను వినే శ్రోతని నేనే అని 
అరిచే అటక మీద కిటకీ వెనకే ఉండే పావురం 
ఇవ్వన్నీ నా నేస్తాలే 


తెరచి ఉన్న పుస్తకంలో

నేను నీలాగే ఏకాకిని స్నేహం చేద్దాం రా 
ఇవ్వాల్టి  నిన్ను ఈ పుస్తకం పై ఆవిష్కరించుకో 
అంటూ పిలిచే కలం 
అది నా ప్రియమైన నేస్తం 


అప్పుడప్పుడనిపిస్తుంది 

నేను నా కలం ఒకటేనేమో అని 
సిరా లాంటి ఆత్మతో నన్ను నేను లిఖించుకుంటూ 
ఉంటానని ....