Friday, November 30, 2012

అనగనగా ...

గాలి భుజాలెక్కి
అది చెప్పే మామ కధలు వింటూ
అడుగులు లెక్కేసుకుంటూ

పగిలిన అద్దంలో ఇక తనను చూడలేక
ఎన్ని నిద్రలో వెల చెల్లిస్తే చీకటికి
ఇన్నాళ్ళకి తన చోటికి తీసుకెళ్ళింది

చలువ ముద్దలా
బోసినవ్వులు నవ్వుతూ చేయి చాపగానే
చేతి నిండా నిండిన తనని తీసుకుని
చుక్కలకి చిక్కకుండా
మేఘాలలో దాక్కుంటూ , రాలుతున్న నక్షత్రాలకు సెలవని చెబుతూ
వలస పక్షుల కళ్ళు కప్పి
మొత్తానికి ఇంటి దారి పట్టానా ..!!

వీధి మూలన ఇంట్లో
చిన్ని తల్లి
పాలబువ్వోద్దని అద్దంలో నాలాగే వెతుకుతూ

ఏడుపు మాన్పించ లేక అమ్మని, తన చేతిలోని బువ్వని
ఏడ్పిస్తుంటే
భద్రంగా ఇన్ని రోజులు నేను ప్రయాస పడి తెచ్చుకున్న
నాదే అనుకున్న నా చందమామను తన చేతుల్లో పెట్టా

ఇప్పుడు
నా దోసిలి నిండా మెరుస్తూ
" నన్ను- నాకు " మళ్ళీ పరిచయం చేసిన తన నవ్వును తీసుకొని
తన పెదాలకంటుకున్న పాల బువ్వ ఇలా నా బుగ్గలపై సంతకంగా
నా పసితనం సంపాదించుకుని తిరిగొచ్చా ..


--------------------------- by Mercy Margaret (29/11/2012)--------