Friday, November 30, 2012

నన్ను నేను తోడుకుంటూ

రెక్కలొచ్చిన సాయత్రం 
చీకటి గూటికి చేరుతుంది 
చీకటి పొదిగిన సూరీడు 
ఉదయపు కాంతులీనుతాడు 

పచ్చగా నవ్వుతుంది నేల
ఆవిరి మంచు ఉదయాన్నే తనలో చేరగానే 
ఆకు రాల్చుతూ చెట్టు


నిటారుగా నిల్చొని ప్రతి పరిస్థితి ఎదుర్కుంటూ

మళ్ళీ యవ్వనం వస్తుందని ఎదురు చూస్తూ క్రొత్త రాగం ఏదో 
అభ్యసిస్తూ 

మట్టినంతా రేణువులుగా జల్లెడ పడుతుంది చీమల దండు , 
ఏ వాసనను పసిగట్టి సంభాషిస్తూ ముందుకు కదులుతాయో
ఏదో బడిలో కూర్చుని నిర్వహణా పాఠాలు నేర్చుకున్నట్టు 

వీటన్నిటిని చూస్తూ నేను 
కొన్ని పాఠాలు నేర్చుకుంటాను 
నానుంచి నన్ను బయటికి తోడుకుంటూ 
ఎవన్నా భావాలని కాచి వడబోసి 
కాగితంపై రంగులద్దగలనా అని 
జీవితపు పరిశ్రమలో 
లాభాలతో మనసు ఖాతాని సంతోషాన్ని 
సమం చేసి ముగించాలని 


(18/11/2012)