Thursday, January 24, 2013

సశేషం


చీకటిని ఈదాలని
ఏకాకి ప్రయత్నం
నలుపునే ఒంటికి పులుముతుంటే 
చీకటికి దేహాన్ని అప్పగించుకుని
కళ్ళు మూసుకున్న క్షణం 
నేనే 
నాకు 
మరో మనిషినైనట్టు 
మరో లోకానికి మారుతూ
నన్ను మరిచిపోతునట్టు

నురగలు నురగలుగా
చీకటి
వలయాలు వలయాలుగా
నన్ను చుట్టుకుంటుంటే
రూపు మారుతున్న
పదార్ధంలా
అణువులోంచి
విస్పోటనం చెందబోతున్నానూ
శకలాలుగా పడిన ఆలోచనల్ని
ఏరుకుంటూ

ఒక్కో ప్రశ్న
ఇటుకల్లా పేరుస్తూ
నాకోసం
ఈ రాతిరి ఇల్లు కట్టుకుని
ప్రతి గోడపై
లెక్కలు చేసుకుంటూ
సమాధానం వెతుకుంటున్నాను
సమాధైన నిజాలని
త్రవ్వుకుంటున్నాను

ఒంటరిని
ఒటమి గెలుపులని
ఈ రాతిరి
నాతో నేనే పంచుకొని
రేపటికి
మిగులు లెక్కల్ని
చూసుకుంటున్నాను

నాకు నేను
సశేషమై మిగులుతున్నాను.....
-------------------------------

Monday, January 21, 2013

"నువ్వు "


ఈ భూమిపైన
అసమానమైన ,అద్వితీయమైన , అనుపమానమైన  ,
అపూర్వమైన అద్భుతానికి  పేరైన ఏకైక వ్యక్తివి
" నువ్వు "
నీకు నకిలీగా  , నీకు మారుగా, నీ నమూనాలో ఎవ్వరూ లేరు
ప్రపంచం సృష్టింపబడినది మొదలు నీలా ఎవ్వరూ లేరు
ఎవ్వరూ ఉండబోరు

నీలాంటి వ్యక్తిత్వంతో ,నీకొచ్చిన అవకాశాలు  నీలాంటి ఆలోచనలు , నీకొచ్చిన బాధలు సంతోషం

అవకాశాల సమన్వయాలు  ,ఎవ్వరికీ లేవు రావు
నీ తల వెంట్రుకలు , వాటి పెరుగుదల చేతి వేళ్ళ గుర్తులు ఈ ప్రపంచంలో నీకు తప్ప ఇంకెవరికి లేవు

నువ్వు  నువ్వే

అందరిలోకి వేరుగా
నువ్వు లేకపోతే సృష్టి నిర్మాణపు ప్రక్రియలో  నీ స్థానం  ఖాళీగా ఉండేది.
నువ్వే లేక పోతే సృష్టిలో ఒక గొప్ప లోటు మిగిలుండేది .

నీలా ఎవరూ ఆలోచించరు ,

నీలో పూసే భావాల పుష్పాలే సృష్టిలో ప్రత్యేకం .
భాదల్లో ఉన్నవారికి నువ్విచ్చే హత్తుకోలు అధ్బుతమైన ప్రత్యెక సంతకం
నీలా పూయించగలరా చిరునవ్వులేవరైనా  ?,

ఎదుటివారిని అర్ధం చేసుకుని వారితో నీలా మనలేరు .

నవ్వించనూ లేరు
దిగులు దిగుడు బావి నుండి నుండి బయటికి లాగలేరు .
నీలా ఉదయాలను పరిమళింప  చేయలేరు .

నీకు తెలుసా నువ్వు ఏకైక అపురూపమైన వ్యక్తివి .

ఆనందించు , సంతోషించు
నీ ఆనందాన్నిజీవితపు  ఖజానాలో దాచిపెట్టుకో .

"నువ్వు "

ప్రవహించు అందరిలోకి ఒక విభిన్న వ్యక్తిగా ,
నీ స్నేహితుల్లోకి ,సమాజంలోని ప్రతి ఒక్కరి హృదయాలలోకి,
నువ్వే బహుమతిగా , నువ్వే చిరునవ్వుగా , సృష్టికే నువ్వొక కానుకగా.


Wednesday, January 16, 2013

నిట్టూర్పు

హృదయం అడుగు భాగం నుంచి
సుడులు తిరుగుతూ నిట్టూర్పు
వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసి
మెదడును తాకి బయటికి దూకే ప్రయత్నం
చేస్తున్నప్పుడు

అప్రయత్నంగా చేయి
తలకి ఆసరా అవుతూ
నోసటిని కౌగలించుకుంటుంది


గుండెని అతలాకుతలం చేస్తూ
ఎన్ని సునామీలను తుఫానులను
ఆలోచనలు మెదడులోంచి జారి గుండెపై
ఒత్తిడి పెంచుతుంటే
నాసికకు తోడుగా కళ్ళు వర్షించి
సముద్రాన్ని నిమ్మలింప చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు


నిట్టూర్పు తుఫానులో తన వంతుగా
కళ్ళు కుండబోతగా వర్షిస్తున్నప్పుడు
ఆ వర్షపాతం కొలవడానికి
ఏ మాపిని కనిపెట్టలేదేమో ఎవరూ ..!?

కన్నీళ్ళంటే జీవితాలకు  వర్షమే  
అవసరమైన మోతాదులో కురిసినప్పుడే
జీవితపు పంటలకు నష్టం అంటే తెలియనిది

తనతోనే -"నేను "



కిర్రు కిర్రు మని చెప్పుల శబ్ధం 
నాకు తెలియకుండా 
ఎవరో నా హృదయంలో 
తిరుగుతున్నారు ..

హృదయపు తలుపులు 
లోపలనుంచి గడియవేసి ఉన్నాయి 
ఎవరో ప్రవేశించారు 
నా అనుమతి లేకుండా ..

నన్ను వదిలిపోయిన 
నా అమూల్య ప్రేమ 
ఎడబాటు తట్టుకోలేక 
నన్ను నేనే బందీ చేసుకున్నా 
ఆశల కిరణాలు కూడా 
లోనికి ప్రవేశించకుండా ...

తను నాకిచ్చిన బహుమతులు, 
నా చేతులతో తన చేతులు 
చేసిన బాసలు ,
నా తనువుతో తన తనువుకున్న 
సాంగత్యాలు ,
నా చెవులకు తన పెదవులకు 
జరిగిన రహస్య ఒప్పందాలు 
అన్నీ అలాగే -గుండె గదిలో 
చెల్లా చెదురై పడి  ఉన్నాయి  ..

ఆ గదిని సర్దాలని లేదు 
ఆ జ్ఞాపకాల వస్తువులను 
ముట్టుకోవాలని లేదు ..
ఎదురుచూపులూ ..
నా బలహీనతగా మారిన తను ,
నా కోన ఊపిరిని కూడా 
తనది చేసుకొని 
నన్ను విముక్తి చేస్తే బాగుండును ...

ఎన్ని సార్లో 
ఏవేవో కొత్త గొంతులు 
నన్ను పిలుస్తూ నా హృదయ 
తలుపులు తడుతూ ..
ఓదార్పుతో నాకు దగ్గరయ్యే 
ప్రయత్నం చేసినా ..
వారిని నా హృదయం లోకి 
ఆహ్వానించే సాహసం చేయలేదు ..

తనువంతా తన ముద్రలు 
అలాగే ఉండిపోయాయి 
ఆడిన ఆటల్లో, గెలుపోటముల్లో 
తన ప్రమేయం లేకుండా
చేసిన గాయాలు ,ఇంకా తనని   
గుర్తు చేస్తూనే ఉన్నాయి ..
కన్నీళ్ళ మాటున తన కధలు 
చెప్తూనే ఉన్నాయి ..

ఒంటరి అని లోకం ముద్ర వేసి
పిచ్చి అని ధృవీకరణ పత్రం ఇచ్చినా 
"తను ఇక లేడు "అన్న 
మాట దగ్గరే ఆగిపోయిన నా కాలం 
ఇవ్వని పట్టించుకోవట్లేదు..

అదే మరి ఇంత కాలానికి 
నాకు నేనుకాకా ఇంకెవరో 
నా  గుండెల్లో రహస్యంగా 
తిరుగుతున్నట్లనిపిస్తుంది  
కిర్రు కిర్రు మని చెప్పుల శబ్ధం 
నాకు తెలియకుండా 
ఎవరో నా హృదయంలో 
తిరుగుతున్నారు ..

ఒక్కో గది తెరిచి చూస్తున్నా 
ఎవరు కనిపించడం లేదు 
నా గదిలో కూడా ఎవరు లేరు 
అలా గోడకు తలవాల్చి 
తలగడను హత్తుకున్న నాకు 
నా తలనెవరో నిమురుతున్నట్టు 
అనిపించింది ..

తెరిచిన కళ్ళ ముందు
తనే  సాక్షాత్తు 
నుదిటిపై వెచ్చని ముద్ధిస్తూ 
పుట్టిన రోజు శుభాకాంక్షలు 
చెబుతూ ...

ఒక్క క్షణం నా గుండెల్లో 
ప్రకంపనలు ..
నమ్మలేని నా కనులను నమ్మిస్తూ 
గట్టిగా హత్తుకున్నాను 
కాని దేహం  లేని తన ఆకారం 
నా కౌగిలిలో ఒదగలేక పోతుంది
నేను విని తట్టుకోలేని  
"తను చనిపోయాడన్న మాటను  "
రుజువు చేస్తూ ..
ఆ బాధ నా తనువుకు 
మంటలు పెడుతుంది ..
అయినా .. 
నా కన్నీళ్లు మాట్లాడ్తున్న ఊసులు 
వింటూ తను ..
నా  కళ్ళల్లో నను నింపుకుని 
తల్లడిల్లుతున్న నేను  ..
మౌనంగానే ఎనెన్నో 
మాట్లాడేసుకుంటున్నాం ..
సమయం అయిపోయిందంటు
తను లేవబోయాడు 
వెళ్ళ నివ్వనని నేను ..
 హృదయాల ఘర్షణ 

నేను లేని ప్రయాణం చేసి 
ప్రమాదంలో ఒంటరిగా తను 
అదేదో లోకాలకు వెళ్లి 
నన్ను ఆనందంగా వుండమంటే 
ఎలా ?? ఒప్పుకోనని .. 
ప్రా దేయపడుతున్నాను ..

నా గురించి తనకు తెలియనిదేముంది
తనే నా ప్రాణం కదా 
అలా నన్ను తాకే ప్రయత్నం లో 
ముట్టుకోలేని  తన బాధ ..
అదో  తను వెళ్లి పోతున్నాడు ..
ఆవేదన ఆపుకోలేని
 నా గుండె గదిలో మంటలు 
హృదయ కుహరం అంతా వ్యాపించి 
నా తనువును ఉక్కిరి బిక్కిరి చేస్తూ ..
నన్ను తన దగ్గరిగా తీసుకెళ్తు ..
ఆ గుండె మంటల్లోనుంచి
అలా వాయువై తన వెనకే నేను 
పరుగెత్తి తన భుజం తట్టా ..
నిర్ఘాంత పోయాడు తను 
ఇప్పుడు ...
తనకౌగిలిలో నేను
తను వెళ్ళిన లోకాలకే తనతో పాటు  ..♥ 

   




నాకు మనసుంది


తను నాపై తల వాల్చి 
నాలో నుంచి
బయటకు చూస్తుంది 
నన్ను తడుముతున్న తన కళ్ళు 
తన నుదురు 
అప్పుడప్పుడు తన చెక్కిలి 
నన్ను ఆటపట్టించే తన శ్వాస నిశ్వాసలంటే 
నాకెంతో ప్రేమ 

రెండేళ్ళ పరిచయం తనతో 
చుట్టూ కూర్చున్న వాళ్ళతో
సరదా మాటలు 
హాయిగా నవ్వుతూ
అందరినీ  ఆటపట్టిస్తూ 
కలుపుకు పోయే చిలిపి పిల్ల 
ప్రతి వారి సమస్యకు సమాధానం వెతకాలనే 
తాపత్రయం 
తనపై నాకు ప్రేమ 

కాని ఆ రోజు తను మాములుగా లేదు 
ఆ మొహం లో ఏదో తేడా
ఏదో కోల్పోయి 
రాత్రంతా ఏడ్చింది కాబోలు 
వాచీ పోయిన కళ్ళు ,జీవం లేని చూపులు 
అలా వచ్చి కూర్చుని 
ఎప్పటిలాగే నాపై తల వాల్చింది 

ఈ రోజు తన చూపులు నా నుంచి
బయటకు   పోలేదు 
ప్రకృతి నాస్వాదించలేదు
ఏ కవితా రాసుకోలేదు 
మూసినా కళ్ళతోనే తను నాపై తల వాల్చింది 

తన ముక్కుపుటాలు అదురుతున్నాయి 
కళ్లలోంచి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి 
తన శ్వాస నిస్వాసాలు ఏవో బాధను 
వెళ్ళ  గక్కుతున్నాయి

అర్ధం అయ్యి అర్ధమవనట్టు 
కంటి కొనల నుండి తన కన్నీళ్లు కొన్ని నన్ను తాకాయి 
ఏంటో హృదయం ఎంతో రగిలిపోతున్నట్టు 
ఆమె హృదయం తనపై ఆధీనం కోల్పోతునట్టు 
అనిపించింది 
తన గమ్యం రాగానే ఎప్పటిలాగే దిగి వెళ్ళిపోయింది 

మరుసటి ఉదయం తనెలా ఉందో 
చూడాలి తపన 
తన స్తేజి రాగానే చుట్టూ వెతికా లేదు 
ఏమయ్యిందో మూడు రోజులయ్యకా 
ఎవరో అది స్థానం లో కూర్చొని పేపరు తిరిగేస్తున్నారు 

నా హృదయంలో తట్టుకోలేని బాధ 
ఎద్పును ఆపుకోలేక వెళ్ళగక్కుతుంటే 
ఆ భాద తట్టుకోలేక దేహం దూరమై పగుళ్ళు రావడం మొదలు 
ఆ"వేదన" నా దేహాన్ని కోసేస్తుంది  

చదువుతున్న అతని చేతిలోని 
ఆ వార్తా పత్రికలో తన ఫోటో 
ప్రేమించబడి ప్రేమలో మోసపోయిందని 
-"యువతీ ఆత్మహత్య "

ఇక తను మళ్ళీ కనిపించడే అనే బాధ 
ఈ కాలేజి బస్సు తన సరదా మాటల్ని కోల్పోయింది 
నేను ఇన్ని రోజులు నాతో స్నేహం చేస్తు 
అనుభవించిన తన ప్రతి కదలిక కోల్పోయా 

-"గాజు కిటికీని "- గదా !..
అందుకే ఏడుపొస్తుంటే ముక్కలయ్యేలా
పగుళ్ళు పై నుండి కిందికి 

రేపటి నీ కోసం


రేపటి
నీకోసం
నిన్నటి నేను
నేటి రెక్కలు తొడిగి

కాలపు కన్నుల వెనక
తెల్లటి సంద్రాన్ని చీల్చుకొని
అటు ఇటు తనైన
అంచుల తీరం వెంబడి
ప్రయాణిస్తూ

నిదురను ఆవిరి చేసి
నల్లటి మేఘంలో కలిపి
చీకటి కౌగిలిలో వర్షించి
కలల ప్రవాహంలో పోటిపడి

రెప్పల ఆకాశంలో దారులు
వెతుక్కుంటూ
శక్తినంతా కూడగట్టుకొని
రాతిరి తలపుల తలుపులు పగలగొడుతూ

అక్షర నక్షత్రాలపై అడుగులు వేస్తూ
కన్నీటి మడుగులు పూడ్చి
దారులు మరమత్తు చేసుకుంటూ
ప్రయాణమై వస్తున్నా...


ఒక్కసారి ఆమె స్వరం విను



1.
ఒక్కసారి
ఆమె స్వరం విను

2.
ఏ పెరటి మొక్కో
నాకెందుకనకు !?
నీలోని విత్తనం కూడా
ఏదో ఒక పెరటికెల్లాల్సిందే
మర్చిపోకు

3.
జీవితపు శిఖరానికి
నిన్ను చేర్చడానికి
మెట్లు మెట్లుగా దేహాన్ని విరగొట్టుకున్న
ఆమె
ఎప్పుడు కాళ్ళకిందే అనకు
జారుడు బండ కూడా  కాగలదు

4.
వెలిగించబడి వెలిగిస్తూ
ఇంటి దీపంలా ఆరిపోయేదే కాదు
ఆమె
ఆడుకోవాలనుకుంటే
అరణ్యానంత  అంటించగల అగ్ని కుంపటిగా
అవతరించగలదు
5.

ఒక్కసారి
ఆమె స్వరం విను
చీల్చిబడిన మర్మావయపు రక్తం
ఏదో మొరపెడుతుంది
తను నీ చెల్లో , చెలియో  కాదని వెళ్లకు.


6.
కోర్కెలు తీర్చుకునే కామాందులు
మనలోనే ఉన్నారని తెలియక మసలే
పావురాల్లరా ఆలోచించండి !
ఇంకా గుంపులుగా తిరిగే రోజులే ఇవి
స్త్రీకి స్వాతంత్ర్యం వచ్చి
అర్ధరాత్రి ఆడపిల్ల ఒక్కత్తే నడిచివెళ్ళే
స్వరాజ్యం
ఈ భారతం కాదు.

Tuesday, January 15, 2013

రక్తంలో రంగు రుచి చిక్కదనం


ఆ ఊరి తలుపులు
ఉలిక్కి పడుతున్నాయి
ఏ చేయి తట్టినా,ఏ కాలి చెప్పు
కిర్రు కిర్రు మన్నా

ఆ పేట

గుండె అదిరిపడుతోంది
రాళ్ళ స్వరం విన్నా
కర్రల కర్కశ గొంతు
పలకరిస్తూ నేల తాకినా
గుడ్ల గూబలు గుర్ర్ మంటూ
పలకరించు కున్నా
ఇంట్లో దీపాలని వెలిగించి
కాంతి నింపుకోవాలన్నా

ఆ ఇళ్ళన్నీసాక్షమిస్తున్నాయి

చరిత్రలో మళ్లో  సారి
వివక్షకి గురై
వికృత చేష్టలకి ,
నవ్వుల పాలయిన నా  గౌరవాన్ని
చూసి
రాలి పడి ,
మసైపోయిన
మలినం లేని మల్లెలను చూసి
మట్టి వాసనని ఇష్టపడే
మనుషులను
అన్యాయాన్ని ఎదిరించేంతలో
ఆవిరైన హక్కులను చూసి
క్యాలెండరు లో 12 జూన్ ని చూసి

*****


అక్కడ

ప్రజాస్వామ్యం
పేరుకి కుర్చీ వేసుకొని
కులం  సినిమా టికెట్టులు
అమ్ముకుంటుంటే
కులగజ్జికి
మందులు ప్రభుత్వాసుపత్రులలో
దొరక్క జనాలు గోక్కోలేక
పోతుంటే
చూసి అయ్యో అన్న వారిమీదికీ
ఎగబడే
ఈ అశుద్ధ  నిర్మాణాన్ని వర్ణించడానికి
మాటల్ని వ్యర్ధం చేసుకోవడం
దండగే

గాయం అయ్యి  ఇన్ని రోజులైనా

ఏది చికిత్స??
స్రవిస్తున్న రక్తానికి ఏది ఆనకట్ట??
రక్తంలో రంగు రుచి చిక్కదనం
వాసన చూసే కుక్కలే చెప్పాలి!
నెత్తురు రుచి  మరిగి
గొర్రె తోలు కప్పుకు తిరిగే
మేక వన్నె పులులే చెప్పాలి !
ఇంకెన్నాళ్ళు నా  రక్తపు రుచి
చూస్తూ   చస్తారో ?!

ఇక ఇదే తంతయితే....


ఒక్కో గడప వీరుడై లేస్తుంది

ఒక్కో  రక్తపు చుక్క
వేల వేల మొలకలై హక్కులకై
త్యాగం చేస్తుంది
ఒక్కో గొంతు పెనవేసుకునే తాళ్ళలా
ఉరి తాడుగా పేనుతూ
రక్తం మరిగిన మృగాలను
ఉరివేసి చంపుతుంది
ఇక్కడ
ఒక్కో శ్వాస విస్పోటనం చెందే
అణుబాంబు అవ్తుంది
అచ్చంగా
ఎదురిస్తున్న లక్షిం పేటలా








మాటలు మోస్తున్న బానిస


మాటలు మోస్తున్న బానిస కూలిని 
ఎప్పుడైనా చూసావా ??
భాద్యతలు బంధుత్వాలు మోసేవారిలాగే 
వీడు  కూడా ...

ఎవరెవరో విసిరేసే 
మాటలన్నీ మూటకట్టుకొని 
భుజానికెత్తుకొని ప్రయాణం చెస్తూనే ఉంటాడు  
ఈ బానిస

గొప్ప తెలివిగల వాడినన్నారని 
సాహసినన్నారని , ఓర్పు నేర్పులు నేర్పమని అడిగారని 
అప్పుడప్పుడు 
ఆ మూటను విప్పి వెతికి మరీ ఆ  మాటలను 
ప్రదర్శనకు పెడతాడు ఎదో సాధించిన వాడిలా 

ఎన్ని రకాల మాటలున్నాయి ప్రదర్శనకని ??
అడిగితే 
మరో  నిమిషం ఆగకుండా మూట విప్పి 
గబా గబా ప్రదర్శిస్తూనే ఉంటాడు '
ఎదుటివాడి సమయం ఏడ్వనంత వరకు 
వీడికి వీడే సాటిలా 

వాడి వంగిపోయిన నడుము 
ఆ మాటల మూట బహుమతి అని 
పొంగిపోయే వీడికి 
కనిపిస్తున్న పెద్ద బండరాళ్ళు కోపం ,ద్వేషం అని బరువు 
పెంచుకుంటుంటే అవిమాత్రం వదలననే వాడికి 

జీవితం అంటే  సరిగా నిలబడ్డమేనని 
మూటను వదిలిపారేయ్ అని 
ఈ మూర్ఖుడికి చెప్పేదెలా ??
------------ by mercy margaret (10/11/2012)------

" అవసరం " ఏ వస్తువు?


@ మెర్సీ మార్గరెట్ 
* * *

కళ్ళు నిండిన తేమ గుండెలోకే దిగుతూ 
లోపలికి  వేస్తున్న  అడుగులతో మాట్లాడుతూ
నన్ను నేను ప్రశ్నించుకుంటూ
అణువణువున  ఆరిపోని తడిని తడుముకుంటూ 
ప్రశ్నించింది -"అవసరం "అంటే ఏంటని?

ఎముకలు కొరికేసే చలి

విడి చేతులను ఒక దగ్గరికి తెస్తూ
ఒక దాన్నొకటి చేసుకున్న ఆలింగనంలో  పుట్టిన వెట్ట 
హృదయాన్ని అడిగింది దీన్నేలాంటి అవసరం మంటారని ??

కురుస్తున్న పొగ మంచు

నాతో పాటు చలిలో వణుకు నాట్యం చేస్తున్నపచ్చని మొక్కలు
అన్నీ దాటెళ్ళిన నేన్నిక్కడే అంటూ  దారి ,
ఏమి మాట్లాడలేక నిలబడి చూసే విగ్రహాలు , 
అటు ఇటుగా కదులుతూ కోనేటిలో నీళ్ళు 
వణుకుతూ కొత్త రాగం ఆలపిస్తుంటే
తూరుపు తలుపులు తెరిచి చాల సేపైనా చలికి ముడుచుకుని
భూమికి సరిపడ వేడి రగిలించుకుని
ఆవలిస్తూ బయటికొచ్చాడు సూర్యుడు
లేలేత కిరణాలు మెల్లిగా మొహాన్ని తాకగానే 
కళ్ళలోంచి ప్రకాశం ఏదో వళ్ళంతా ప్రవహిస్తూ
నరాల్లోని రక్తాన్ని ఉత్సాహపు  కవాతు చేయిస్తుంటే
శరీరం అడిగింది ఈ అవసరం ఖరీదెంతని  ??

రోడ్ల ప్రక్కనే

దుకాణాల ముందే దొరికిన స్థలం చాలనుకుని
మోకాళ్లను కడుపులో ఒత్తుకుంటూ
చలికి సవాలు విసిరే  బ్రతుకులు కప్పుకున్న
ఆశల దుప్పటి చిరుగుల్లోంచి
చలితో పాటు సూర్యుడు ఒకే సారి ప్రవేశించి
కలలో అష్టైశ్వర్యాలని అనుభవిస్తున్న వాణ్ని చూసి  
కనురెప్పల గోడల  మీదే ఘనీభవించి గడ్డ కడుతుంటే 
కళ్ళడిగాయి వీటికి అవసరం అంటే తెలుసా అని ??

ఉదయాన్నే చదువు మెదడుకెక్కుతుందని 

పరీక్షల్లో ప్రతాపం  చూపిస్తుందని 
గడియారం ఐదు గంటలు కొట్టినప్పటి నుండి పుస్తకాలతో కుస్తీ పట్టి ,
వెళ్ళాలని లేకపోయిన  స్కూలు బస్సెక్కి  వెళ్తూ , 
కిటికీ చువ్వలోంచి
శబ్దం చేస్తూ  హాయిగా ఎగురుతున్న పక్షులని చూస్తున్న చిన్నారి కళ్ళు
కిటికీ చువ్వలతో చేసే సంభాషణ అవసరం ఏమైయుంటుందని ??





Saturday, January 5, 2013

కొన్ని సార్లు

వాకిలి ఈ -సాహిత్యపత్రికలో వచ్చిన నా కవిత

కొన్ని సార్లు

మొదలు ఎక్కడ పెట్టాలో వెతుకుతూఉంటా

నాలో ఆలోచన నిలువునా చినిగిన స్థానాన్ని


కుట్టుకోడానికి

లోపలికెళ్ళే దారికి గుమ్మం ఎదురుగానే ఉన్నా


కొన్ని సార్లు

ప్రశ్నలను పిడికిలిలోనే బంధిస్తూ తిరుగుతుంటా

గాయం మౌనం మిళితమై హృదయపు పునాదులను

కదిలిస్తున్నా

ఉదయం లాంటి నవ్వు నా పిడికిలో అస్తమించడం

ఇష్టం లేక


కొన్ని సార్లు

రాలిపోతుంటా

నాలో అగమ్యాలు రాలి గమ్యం చిగురించేలా

నిశబ్దాలను చీల్చుకుని

వసంతపు శబ్ధం నాలో జనిస్తుందని ఆశగా

కొన్ని సార్లు

నాలో నేను

మళ్ళీ మళ్ళీ పుడుతుంటా

అవమానాల్లోంచి విజయంగా

నిరుత్సాహంలోంచి లేలేతగా

చనిపోయిన ఓటమిలోంచి

నన్ను నేను నిర్వచించుకుంటూ కొత్తగా

---------------------------------------------------------------
http://vaakili.com/patrika/?p=478#comment-313

జారి పడ్డ విత్తనం

నేను
రైతు చేతుల్లోంచి

జారిపడ్డ విత్తనాన్ని



సేద్యగాని చేతుల్లో

ధాన్యంగా మారే వరకు తోడుండమని

దేవుణ్ణి వేడుకుంటూ

దుక్కి దున్ని చదును చేయబడ్డ నేలలోకెళ్ళే లోపే

జారి పడ్డ విత్తనాన్ని


ధాన్యం

ఆకలి కడుపునింపాలని ఆహారంగా మారాలని

తాతలు చెప్పిన మాటలు నిలబెట్ట్టుకోలేక

కుములుతుంటే

రివ్వున ఎగిరొచ్చింది


టు నుంచో ఈ పిట్ట

నోట పట్టుకుని ఎత్తుకెళ్తుంటే

ఎవరిని తిట్టుకోను ఏమని అరవను ??


గూట్లో

వేసంగి ఎండకు తట్టుకోలేక కిచ కిచ మంటూ పిల్ల పిట్ట

ఎదురుచూపుల ఆకలి లెక్కలు నేరుస్తూ

తల్లి నోట నన్నుచూడగానే

ఆహరం దొరికిందనే ఆనందం పంచుకునే తల్లి బిడ్డలను చూస్తున్నప్పుడు

తను చనిపోతూ జన్మ నిచ్చిన మా అమ్మ గుర్తొచ్చింది


రోజంతా ఎక్కడెక్క ఆహరం కోసం తిరిగి అలసిపోయిందో చెప్తూ

నన్ను ఆ పిల్ల పిట్ట నోటికందిస్తే

ల్లి ప్రేమ చూస్తూ ..దాని ఆకలి తీరుస్తూ ..

ఆనందంగా ఆహరమయ్యా ..




(9/12/12)

కదలని దేహంతో


మబ్బులన్నీ నన్ను దాటి వెళ్తుంటాయి

నేను ఇక్కడే నిల్చుంటా

పర్వతాన్నికదూ కదలకుండా స్థిరంగా



నన్ను పలకిరించాలని మేఘం

నా ముఖ శిఖరం స్పృశిస్తుంది

వర్షం లా

స్నేహంతో తనువును కౌగలించుకుని

నదితో మాట్లాడుతూ కలిసిపోతుంది


ఆ సుదూర తీరం నుంచి

తమ పేర్లతోనే నన్ను పిలుస్తారు

నేను వాళ్ళ పేర్లతో తిరిగి పిలుస్తుంటా

ప్రేమికుల ప్రేమను

చిన్నారులకు ఆనందాన్ని తిరిగి ఇస్తూ


రాతిరవుతూనే చంద్రుడు

లోయలో నుంచి ఒక్కో అడుగు వేస్తూ నాపైకెక్కి

ఆకాశంతో మాట్లాడుతూ

నా చుట్టూ గాలితో పాటు దొంగా పొలిసు ఆడుతుంటాడు

నన్నూ కాసేపు నవ్విస్తూ


అందరు ఎటు వారు అటు వెళిపోతారు

మళ్ళీ నేను అక్కడే వచ్చీ పోయే అతిధులను

చూస్తూ

కదలకుండా

 9/12/2012 

చిప్కో

కిటికీలోంచి బయటికి చూస్తున్న నాకు  ప్రశాంతంగా యోగ ముద్రలో ఉన్నట్టు కనిపిస్తుంది ఆ చెట్టు .

ఆ కిటికీ రెక్కలోంచి వెలుగు కొన్ని ఆకులపై పడుతుంటే  , ఈ సమయంలో 
ఇంకేం పనిలేదా అని కోపంగా , కనుబోమ్మల్లు చిట్లిస్తూ చూస్తున్నట్టుగుందీ.
చలి ఏదో నేర్పుతానని కనుపాపపై నుంచి నిదురపొరను తీసి ,వణుకుతున్న దేహంతో సంగీతంలో ఇదో కొత్త ఆలాపన అంటూ చెవులలో గుస గుస లాడుతుంటే 
ఆ చెట్టు వైపుకు నా చూపును తీసుకేలుతుంటే ఏవో ఆలోచనలు ....

చెట్లు కూడా మనలాగే నడవగలిగితే ఎలా ఉండేది ?
వాటికి కూడా మాట్లాడ్డం వచ్చి ఉంటె ఈ సమయంలో ఏ కబుర్లు చెప్పేవి ?
సంగీతానికి ఏ నృత్యం చేసేవి ?
ఉదయాన్నే పక్షులతో పాటు ఏ పాటతో మనల్ని  నిద్రలేపేవి ? రాతిరి ఏ పాటతో నిదురబుచ్చేవి ?
సాదు జంతువులను పెంచుకున్నట్టు వీటిని పెంచుకుంటే ? మన లాగే పుట్టి పెరిగి మనలాంటి ఉనికే కలిగి ఉండి మనతో పాటే 
చనిపోయేలా ఉండి ఉంటే ..?
పసి పాపలాంటి చెట్టు , మాటలు నేరుస్తున్న చెట్టు , వివాహనికోచ్సిన చెట్ట్టు ... అంటూ అవి మనలాగే జీవిత దశలు కలిగి ఉంటే ..??

చెట్లకు కూడా జ్ఞానం కావాలని వాటికి స్కూల్లుంటే ??
మనిషి బాధలన్ని విని , పంచుకుని , తిరిగి సమాధానం ఇవ్వగలిగెట్టు ఉంటే ??  మనిషికో చెట్టు నేస్తం ఉండేది కదూ ..!!

 by Mercy Margaret  (12 -12- 2012)


ప్రియాన్వేషి

వాకిలి ఈ-పత్రిక లో అచ్చైన నా కవిత - " ప్రియాన్వేషి "

తాపంతోనో
తమకంతోనో
ప్రకృతిలోని యే యే
మూలల్లోంచి
ఏరి ఏరి ఆ చినుకుల్ని
నింపుకొచ్చాడో
ఎదురు చూసి
చూసి
బరువవుతున్న దేహాన్ని
మోయలేక
మెళికలు తిరుగుతూ కదులుతుంటే
చల్లగాలి తన అరికాళ్ళపై
గిల్లుతూ చక్కిలి గింతలు
పెడుతుంటే
దొంగ దొంగగా
ఊళ్ళని దారులని దాటుతూ
కొండ పూలు
కన్నుగీటుతూ సన్నజాజులు
పరిమళాల దారాలతో
కౌగిళ్ళ పతంగులుకట్టి
రసిక ఆహ్వానం పంపినా
చూడకుండా
కళ్ళనిండా తన రూపం
తనువు అణువణువున
వేడినేదో పుట్టిస్తుంటే
చల్లదనంతో దూదిలా
పోగులు పోగులుగా
ఊహల చిత్రాలేవో
మెరుపు కుంచెతో
అద్దుకుంటూ
ప్రియురాలైన అరణ్యంపై
వర్షిద్దామని
ప్రతి వత్సరం లాగే వచ్చి
ఈ తొలకరిన పరిణయానికుంటానని
చెప్పి, అదృశ్యం అవడం చూసి
భంగపడి
వెక్కి వెక్కి ఏడుస్తూ
వణుకుతూ ఆ తనను తానూ
వర్షిస్తూ.. కృమ్మరించుకుని
ఎర్రన్ని మృత్తికలో
ఎరుపై
అరణ్యపు జాడనెతుకుతూ
బయల్దేరాడు
వణుకుతున్న వాగై ..