1.
ఒక్కసారి
ఆమె స్వరం విను
2.
ఏ పెరటి మొక్కో
నాకెందుకనకు !?
నీలోని విత్తనం కూడా
ఏదో ఒక పెరటికెల్లాల్సిందే
మర్చిపోకు
3.
జీవితపు శిఖరానికి
నిన్ను చేర్చడానికి
మెట్లు మెట్లుగా దేహాన్ని విరగొట్టుకున్న
ఆమె
ఎప్పుడు కాళ్ళకిందే అనకు
జారుడు బండ కూడా కాగలదు
4.
వెలిగించబడి వెలిగిస్తూ
ఇంటి దీపంలా ఆరిపోయేదే కాదు
ఆమె
ఆడుకోవాలనుకుంటే
అరణ్యానంత అంటించగల అగ్ని కుంపటిగా
అవతరించగలదు
5.
ఒక్కసారి
ఆమె స్వరం విను
చీల్చిబడిన మర్మావయపు రక్తం
ఏదో మొరపెడుతుంది
తను నీ చెల్లో , చెలియో కాదని వెళ్లకు.
6.
కోర్కెలు తీర్చుకునే కామాందులు
మనలోనే ఉన్నారని తెలియక మసలే
పావురాల్లరా ఆలోచించండి !
ఇంకా గుంపులుగా తిరిగే రోజులే ఇవి
స్త్రీకి స్వాతంత్ర్యం వచ్చి
అర్ధరాత్రి ఆడపిల్ల ఒక్కత్తే నడిచివెళ్ళే
స్వరాజ్యం
ఈ భారతం కాదు.