Tuesday, January 15, 2013

" అవసరం " ఏ వస్తువు?


@ మెర్సీ మార్గరెట్ 
* * *

కళ్ళు నిండిన తేమ గుండెలోకే దిగుతూ 
లోపలికి  వేస్తున్న  అడుగులతో మాట్లాడుతూ
నన్ను నేను ప్రశ్నించుకుంటూ
అణువణువున  ఆరిపోని తడిని తడుముకుంటూ 
ప్రశ్నించింది -"అవసరం "అంటే ఏంటని?

ఎముకలు కొరికేసే చలి

విడి చేతులను ఒక దగ్గరికి తెస్తూ
ఒక దాన్నొకటి చేసుకున్న ఆలింగనంలో  పుట్టిన వెట్ట 
హృదయాన్ని అడిగింది దీన్నేలాంటి అవసరం మంటారని ??

కురుస్తున్న పొగ మంచు

నాతో పాటు చలిలో వణుకు నాట్యం చేస్తున్నపచ్చని మొక్కలు
అన్నీ దాటెళ్ళిన నేన్నిక్కడే అంటూ  దారి ,
ఏమి మాట్లాడలేక నిలబడి చూసే విగ్రహాలు , 
అటు ఇటుగా కదులుతూ కోనేటిలో నీళ్ళు 
వణుకుతూ కొత్త రాగం ఆలపిస్తుంటే
తూరుపు తలుపులు తెరిచి చాల సేపైనా చలికి ముడుచుకుని
భూమికి సరిపడ వేడి రగిలించుకుని
ఆవలిస్తూ బయటికొచ్చాడు సూర్యుడు
లేలేత కిరణాలు మెల్లిగా మొహాన్ని తాకగానే 
కళ్ళలోంచి ప్రకాశం ఏదో వళ్ళంతా ప్రవహిస్తూ
నరాల్లోని రక్తాన్ని ఉత్సాహపు  కవాతు చేయిస్తుంటే
శరీరం అడిగింది ఈ అవసరం ఖరీదెంతని  ??

రోడ్ల ప్రక్కనే

దుకాణాల ముందే దొరికిన స్థలం చాలనుకుని
మోకాళ్లను కడుపులో ఒత్తుకుంటూ
చలికి సవాలు విసిరే  బ్రతుకులు కప్పుకున్న
ఆశల దుప్పటి చిరుగుల్లోంచి
చలితో పాటు సూర్యుడు ఒకే సారి ప్రవేశించి
కలలో అష్టైశ్వర్యాలని అనుభవిస్తున్న వాణ్ని చూసి  
కనురెప్పల గోడల  మీదే ఘనీభవించి గడ్డ కడుతుంటే 
కళ్ళడిగాయి వీటికి అవసరం అంటే తెలుసా అని ??

ఉదయాన్నే చదువు మెదడుకెక్కుతుందని 

పరీక్షల్లో ప్రతాపం  చూపిస్తుందని 
గడియారం ఐదు గంటలు కొట్టినప్పటి నుండి పుస్తకాలతో కుస్తీ పట్టి ,
వెళ్ళాలని లేకపోయిన  స్కూలు బస్సెక్కి  వెళ్తూ , 
కిటికీ చువ్వలోంచి
శబ్దం చేస్తూ  హాయిగా ఎగురుతున్న పక్షులని చూస్తున్న చిన్నారి కళ్ళు
కిటికీ చువ్వలతో చేసే సంభాషణ అవసరం ఏమైయుంటుందని ??