Tuesday, January 15, 2013

మాటలు మోస్తున్న బానిస


మాటలు మోస్తున్న బానిస కూలిని 
ఎప్పుడైనా చూసావా ??
భాద్యతలు బంధుత్వాలు మోసేవారిలాగే 
వీడు  కూడా ...

ఎవరెవరో విసిరేసే 
మాటలన్నీ మూటకట్టుకొని 
భుజానికెత్తుకొని ప్రయాణం చెస్తూనే ఉంటాడు  
ఈ బానిస

గొప్ప తెలివిగల వాడినన్నారని 
సాహసినన్నారని , ఓర్పు నేర్పులు నేర్పమని అడిగారని 
అప్పుడప్పుడు 
ఆ మూటను విప్పి వెతికి మరీ ఆ  మాటలను 
ప్రదర్శనకు పెడతాడు ఎదో సాధించిన వాడిలా 

ఎన్ని రకాల మాటలున్నాయి ప్రదర్శనకని ??
అడిగితే 
మరో  నిమిషం ఆగకుండా మూట విప్పి 
గబా గబా ప్రదర్శిస్తూనే ఉంటాడు '
ఎదుటివాడి సమయం ఏడ్వనంత వరకు 
వీడికి వీడే సాటిలా 

వాడి వంగిపోయిన నడుము 
ఆ మాటల మూట బహుమతి అని 
పొంగిపోయే వీడికి 
కనిపిస్తున్న పెద్ద బండరాళ్ళు కోపం ,ద్వేషం అని బరువు 
పెంచుకుంటుంటే అవిమాత్రం వదలననే వాడికి 

జీవితం అంటే  సరిగా నిలబడ్డమేనని 
మూటను వదిలిపారేయ్ అని 
ఈ మూర్ఖుడికి చెప్పేదెలా ??
------------ by mercy margaret (10/11/2012)------