Thursday, January 3, 2013

ఇదీ అగాదమే

ప్రశంసించడానికి హృదయం ముందుకొస్తుంది 
ఎందుకు అవసరమాని ?!
పక్కకు లాగి గుండెను మెలిపెట్టి మందలిస్తుంది 

అప్పటివరకు ఉన్న ప్రేమలకు 

గ్రహణంలా దాపురిస్తూ 
కంటి పొరల నిండా కాంక్రీటు గోడలు కట్టి 
సున్నిత మనసుని బండను జేస్తూ 
మెదడు నుండి హృదయంలోకి 
వ్యాపిస్తుంది 

ఎదుటివారి తోట విజయాలు పూసి పరిమళం  

వెదజల్లుతుంటే హత్తుకోవాలని 
అభినందించాలని  చేతులు చాచిన హృదయానికి 
ఇనుప సంకెళ్ళు చుట్టుకొని 
లోలోపలే బంధిస్తు హృదయాన్నేచెరగా చేస్తుంది 

తన మన బేధాలస్సలు లేక 

పొంగి పొంగి బయటికొచ్చి 
దూరి దూరి ఆలోచనల్లో తిష్టవేసుకొని
హృదయాల మధ్య అగాధాలకు 
పునాది వేస్తుంది 

మనసులో నేమ్మదినావిరి చేసి 

కళ్ళకు నిదురను పరాయి చేసి 
హృదయంలో విషం గక్కుతూ మొలకెత్తే 
అసూయా బీజాలు ఎవరునాటిన , ఎటునుంచి పడ్డా 
ఏరివేయక వదిలేస్తే  

నీ చుట్టూ ఎవరు నిన్ను చేరుకోలేనంత అగాధమే 

నీ హృదయపు వాకిట పేరుకుపోయే చెత్త ద్వేషమై 
ఎవరికీ వారిని దూరం చేస్తూ 
 జ్ఞానాని హరించి 
ప్రేమ రాహిత్యంతో ఒంటరి గుహలో ఆజన్మాంతం 
బందీ చేస్తుంది 
ఈ - " అసూయా "