Thursday, January 24, 2013

సశేషం


చీకటిని ఈదాలని
ఏకాకి ప్రయత్నం
నలుపునే ఒంటికి పులుముతుంటే 
చీకటికి దేహాన్ని అప్పగించుకుని
కళ్ళు మూసుకున్న క్షణం 
నేనే 
నాకు 
మరో మనిషినైనట్టు 
మరో లోకానికి మారుతూ
నన్ను మరిచిపోతునట్టు

నురగలు నురగలుగా
చీకటి
వలయాలు వలయాలుగా
నన్ను చుట్టుకుంటుంటే
రూపు మారుతున్న
పదార్ధంలా
అణువులోంచి
విస్పోటనం చెందబోతున్నానూ
శకలాలుగా పడిన ఆలోచనల్ని
ఏరుకుంటూ

ఒక్కో ప్రశ్న
ఇటుకల్లా పేరుస్తూ
నాకోసం
ఈ రాతిరి ఇల్లు కట్టుకుని
ప్రతి గోడపై
లెక్కలు చేసుకుంటూ
సమాధానం వెతుకుంటున్నాను
సమాధైన నిజాలని
త్రవ్వుకుంటున్నాను

ఒంటరిని
ఒటమి గెలుపులని
ఈ రాతిరి
నాతో నేనే పంచుకొని
రేపటికి
మిగులు లెక్కల్ని
చూసుకుంటున్నాను

నాకు నేను
సశేషమై మిగులుతున్నాను.....
-------------------------------