Wednesday, January 16, 2013

తనతోనే -"నేను "



కిర్రు కిర్రు మని చెప్పుల శబ్ధం 
నాకు తెలియకుండా 
ఎవరో నా హృదయంలో 
తిరుగుతున్నారు ..

హృదయపు తలుపులు 
లోపలనుంచి గడియవేసి ఉన్నాయి 
ఎవరో ప్రవేశించారు 
నా అనుమతి లేకుండా ..

నన్ను వదిలిపోయిన 
నా అమూల్య ప్రేమ 
ఎడబాటు తట్టుకోలేక 
నన్ను నేనే బందీ చేసుకున్నా 
ఆశల కిరణాలు కూడా 
లోనికి ప్రవేశించకుండా ...

తను నాకిచ్చిన బహుమతులు, 
నా చేతులతో తన చేతులు 
చేసిన బాసలు ,
నా తనువుతో తన తనువుకున్న 
సాంగత్యాలు ,
నా చెవులకు తన పెదవులకు 
జరిగిన రహస్య ఒప్పందాలు 
అన్నీ అలాగే -గుండె గదిలో 
చెల్లా చెదురై పడి  ఉన్నాయి  ..

ఆ గదిని సర్దాలని లేదు 
ఆ జ్ఞాపకాల వస్తువులను 
ముట్టుకోవాలని లేదు ..
ఎదురుచూపులూ ..
నా బలహీనతగా మారిన తను ,
నా కోన ఊపిరిని కూడా 
తనది చేసుకొని 
నన్ను విముక్తి చేస్తే బాగుండును ...

ఎన్ని సార్లో 
ఏవేవో కొత్త గొంతులు 
నన్ను పిలుస్తూ నా హృదయ 
తలుపులు తడుతూ ..
ఓదార్పుతో నాకు దగ్గరయ్యే 
ప్రయత్నం చేసినా ..
వారిని నా హృదయం లోకి 
ఆహ్వానించే సాహసం చేయలేదు ..

తనువంతా తన ముద్రలు 
అలాగే ఉండిపోయాయి 
ఆడిన ఆటల్లో, గెలుపోటముల్లో 
తన ప్రమేయం లేకుండా
చేసిన గాయాలు ,ఇంకా తనని   
గుర్తు చేస్తూనే ఉన్నాయి ..
కన్నీళ్ళ మాటున తన కధలు 
చెప్తూనే ఉన్నాయి ..

ఒంటరి అని లోకం ముద్ర వేసి
పిచ్చి అని ధృవీకరణ పత్రం ఇచ్చినా 
"తను ఇక లేడు "అన్న 
మాట దగ్గరే ఆగిపోయిన నా కాలం 
ఇవ్వని పట్టించుకోవట్లేదు..

అదే మరి ఇంత కాలానికి 
నాకు నేనుకాకా ఇంకెవరో 
నా  గుండెల్లో రహస్యంగా 
తిరుగుతున్నట్లనిపిస్తుంది  
కిర్రు కిర్రు మని చెప్పుల శబ్ధం 
నాకు తెలియకుండా 
ఎవరో నా హృదయంలో 
తిరుగుతున్నారు ..

ఒక్కో గది తెరిచి చూస్తున్నా 
ఎవరు కనిపించడం లేదు 
నా గదిలో కూడా ఎవరు లేరు 
అలా గోడకు తలవాల్చి 
తలగడను హత్తుకున్న నాకు 
నా తలనెవరో నిమురుతున్నట్టు 
అనిపించింది ..

తెరిచిన కళ్ళ ముందు
తనే  సాక్షాత్తు 
నుదిటిపై వెచ్చని ముద్ధిస్తూ 
పుట్టిన రోజు శుభాకాంక్షలు 
చెబుతూ ...

ఒక్క క్షణం నా గుండెల్లో 
ప్రకంపనలు ..
నమ్మలేని నా కనులను నమ్మిస్తూ 
గట్టిగా హత్తుకున్నాను 
కాని దేహం  లేని తన ఆకారం 
నా కౌగిలిలో ఒదగలేక పోతుంది
నేను విని తట్టుకోలేని  
"తను చనిపోయాడన్న మాటను  "
రుజువు చేస్తూ ..
ఆ బాధ నా తనువుకు 
మంటలు పెడుతుంది ..
అయినా .. 
నా కన్నీళ్లు మాట్లాడ్తున్న ఊసులు 
వింటూ తను ..
నా  కళ్ళల్లో నను నింపుకుని 
తల్లడిల్లుతున్న నేను  ..
మౌనంగానే ఎనెన్నో 
మాట్లాడేసుకుంటున్నాం ..
సమయం అయిపోయిందంటు
తను లేవబోయాడు 
వెళ్ళ నివ్వనని నేను ..
 హృదయాల ఘర్షణ 

నేను లేని ప్రయాణం చేసి 
ప్రమాదంలో ఒంటరిగా తను 
అదేదో లోకాలకు వెళ్లి 
నన్ను ఆనందంగా వుండమంటే 
ఎలా ?? ఒప్పుకోనని .. 
ప్రా దేయపడుతున్నాను ..

నా గురించి తనకు తెలియనిదేముంది
తనే నా ప్రాణం కదా 
అలా నన్ను తాకే ప్రయత్నం లో 
ముట్టుకోలేని  తన బాధ ..
అదో  తను వెళ్లి పోతున్నాడు ..
ఆవేదన ఆపుకోలేని
 నా గుండె గదిలో మంటలు 
హృదయ కుహరం అంతా వ్యాపించి 
నా తనువును ఉక్కిరి బిక్కిరి చేస్తూ ..
నన్ను తన దగ్గరిగా తీసుకెళ్తు ..
ఆ గుండె మంటల్లోనుంచి
అలా వాయువై తన వెనకే నేను 
పరుగెత్తి తన భుజం తట్టా ..
నిర్ఘాంత పోయాడు తను 
ఇప్పుడు ...
తనకౌగిలిలో నేను
తను వెళ్ళిన లోకాలకే తనతో పాటు  ..♥