ఆ ఊరి తలుపులు
ఉలిక్కి పడుతున్నాయి
ఏ చేయి తట్టినా,ఏ కాలి చెప్పు
కిర్రు కిర్రు మన్నా
ఆ పేట
గుండె అదిరిపడుతోంది
రాళ్ళ స్వరం విన్నా
కర్రల కర్కశ గొంతు
పలకరిస్తూ నేల తాకినా
గుడ్ల గూబలు గుర్ర్ మంటూ
పలకరించు కున్నా
ఇంట్లో దీపాలని వెలిగించి
కాంతి నింపుకోవాలన్నా
ఆ ఇళ్ళన్నీసాక్షమిస్తున్నాయి
చరిత్రలో మళ్లో సారి
వివక్షకి గురై
వికృత చేష్టలకి ,
నవ్వుల పాలయిన నా గౌరవాన్ని
చూసి
రాలి పడి ,
మసైపోయిన
మలినం లేని మల్లెలను చూసి
మట్టి వాసనని ఇష్టపడే
మనుషులను
అన్యాయాన్ని ఎదిరించేంతలో
ఆవిరైన హక్కులను చూసి
క్యాలెండరు లో 12 జూన్ ని చూసి
*****
అక్కడ
ప్రజాస్వామ్యం
పేరుకి కుర్చీ వేసుకొని
కులం సినిమా టికెట్టులు
అమ్ముకుంటుంటే
కులగజ్జికి
మందులు ప్రభుత్వాసుపత్రులలో
దొరక్క జనాలు గోక్కోలేక
పోతుంటే
చూసి అయ్యో అన్న వారిమీదికీ
ఎగబడే
ఈ అశుద్ధ నిర్మాణాన్ని వర్ణించడానికి
మాటల్ని వ్యర్ధం చేసుకోవడం
దండగే
గాయం అయ్యి ఇన్ని రోజులైనా
ఏది చికిత్స??
స్రవిస్తున్న రక్తానికి ఏది ఆనకట్ట??
రక్తంలో రంగు రుచి చిక్కదనం
వాసన చూసే కుక్కలే చెప్పాలి!
నెత్తురు రుచి మరిగి
గొర్రె తోలు కప్పుకు తిరిగే
మేక వన్నె పులులే చెప్పాలి !
ఇంకెన్నాళ్ళు నా రక్తపు రుచి
చూస్తూ చస్తారో ?!
ఇక ఇదే తంతయితే....
ఒక్కో గడప వీరుడై లేస్తుంది
ఒక్కో రక్తపు చుక్క
వేల వేల మొలకలై హక్కులకై
త్యాగం చేస్తుంది
ఒక్కో గొంతు పెనవేసుకునే తాళ్ళలా
ఉరి తాడుగా పేనుతూ
రక్తం మరిగిన మృగాలను
ఉరివేసి చంపుతుంది
ఇక్కడ
ఒక్కో శ్వాస విస్పోటనం చెందే
అణుబాంబు అవ్తుంది
అచ్చంగా
ఎదురిస్తున్న లక్షిం పేటలా